AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మళ్లీ మత్తులో మహానగరం.. దడ పుట్టి డ్రగ్స్.. వారం రోజుల్లో వరుసగా పెరిగిన కేసులు..!

హైదరాబాద్‌ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ మొదలైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు బయటపడుతుండటం పోలీసులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా వారం రోజుల్లోనే దాదాపు పది కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మహానగరంలో డ్రగ్ పెడ్లర్లు మళ్లీ చురుకుగా మారుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad: మళ్లీ మత్తులో మహానగరం.. దడ పుట్టి డ్రగ్స్.. వారం రోజుల్లో వరుసగా పెరిగిన కేసులు..!
Hyderabad Drug Cases
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 11:15 PM

Share

హైదరాబాద్‌ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ మొదలైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు బయటపడుతుండటం పోలీసులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా వారం రోజుల్లోనే దాదాపు పది కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మహానగరంలో డ్రగ్ పెడ్లర్లు మళ్లీ చురుకుగా మారుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల అమీన్‌పూర్‌లో జరిగిన దాడిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు భారీగా ఓపియం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఒక మార్బుల్ షాపులో తనిఖీలు నిర్వహించగా సుమారు 2.7 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్‌తో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, మత్తు పదార్థాల సరఫరాలో కొత్త తరహా పద్ధతులు బయటపడుతున్నాయి. యువకులు జట్లుగా ఏర్పడి గంజాయి, డ్రగ్స్ కొనుగోలు చేసి తమ మధ్యే వినియోగించుకోవడంతో పాటు వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. క్రౌడ్ ఫండింగ్, డెడ్ డ్రాప్ వంటి కొత్త విధానాల ద్వారా మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి, గోవా వంటి ప్రాంతాల నుంచి సింథటిక్ డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.

అటు మియాపూర్‌లో కూడా డ్రగ్స్ కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎమ్‌డీఎమ్ఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఈ ముఠా బెంగళూరు మార్గంగా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు బయటపడింది.

ఇటు రాజేంద్రనగర్‌లో మరో కేసు సంచలనం సృష్టించింది. విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీయులు డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి భారీ విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది.

ఇక అబిడ్స్ ప్రాంతంలో మరో ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తెచ్చి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల గ్యాంగ్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వరుస ఘటనలతో నగరంలో డ్రగ్స్ సరఫరా మళ్లీ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై కట్టడి చర్యలను మరింత కఠినంగా చేపడతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. మరోవైపు పోలీసుల దాడుల్లో ముఠాలు బయటపడటం మత్తు దందా ఎంత విస్తరించిందో తెలియజేస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us