Telangana: ఆ పని కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసిన తహసీల్దార్.. చివరకు ఏం జరిగిందంటే..?
ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌తో పాటు సహకరించిన ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందనే ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. గత ఏడాది కాలంగా భారీగా అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకుని జైలుకు పంపించింది. అందులో రూ.వేల నుంచి మొదలు వందల కోట్ల వరకు అక్రమంగా సంపాదించిన అధికారులు ఉండడం గమనార్హం. తాజాగా మరో అవినీతి చేపను ఏసీబీ ట్రాప్ చేసింది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పట్టా భూమికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయడానికి లంచం డిమాండ్ చేసిన చిట్యాల తహసీల్దార్ గుగులోతు కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో తహసీల్దార్‌తో పాటు గట్టు రమేష్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అధికారులు అరెస్టు చేశారు.
మ్యుటేషన్ కోసం భారీ డిమాండ్
చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని సర్వే నం. 172 లో ఉన్న వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయడం, మరో వ్యవసాయ భూమి సర్వే నివేదికను చిట్యాల ఎస్సై పంపడం కోసం తహసీల్దార్ రూ.10లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరికి రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో బాధిత వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. తహసీల్దార్ సూచన మేరకు ప్రైవేట్ వ్యక్తి గట్టు రమేష్ బాధితుడి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డబ్బును రమేష్ కార్యాలయంలోని బీరువాలో భద్రపరిచినట్లు తెలిసింది.
బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు
ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్‌తో పాటు గట్టు రమేష్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ తహసీల్దార్‌పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తహసీల్దార్‌తో పాటు, ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




