AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నేటి నుంచి తెలంగాణలో తెరచుకోనున్న పాఠశాలలు.. బడి బాట పట్టనున్న 60 లక్షల మంది విద్యార్థులు..

Schools Reopen: వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్‌ 13) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు ఆటపాటలతో ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు మళ్లీ బ్యాగులేసుకుని బడికి బయలుదేరనున్నారు.

Telangana: నేటి నుంచి తెలంగాణలో తెరచుకోనున్న పాఠశాలలు.. బడి బాట పట్టనున్న 60 లక్షల మంది విద్యార్థులు..
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 6:43 PM

Share

Schools Reopen: వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్‌ 13) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు ఆటపాటలతో ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు మళ్లీ బ్యాగులేసుకుని బడికి బయలుదేరనున్నారు.  విద్యాశాఖ అంచనాల ప్రకారం సుమారు 60 లక్షల మంది విద్యార్థులు మళ్లీ బడి బాట పట్టనున్నాని తెలుస్తోంది. కరోనా కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తి కాకపోవడం, భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సమ్మర్‌ హాలీడేస్‌ పొడిగిస్తారని ప్రచారం జరిగినా అదేమీ జరగలేదు. ముందు చెప్పినట్లుగానే 13వ తేదీ నుంచే యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో 26లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రెసిడెన్షియల్, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌లో మరో 2.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక 10,800 ప్రైవేటు స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం మీద సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. కాగా కరోనా ప్రభావం కారణంగా గత రెండేళ్లుగా సకాలంలో బడులు తెరచుకోలేదు. అయితే ఈ విద్యా సంవత్సరం లోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి.

ఇంగ్లిష్‌ మీడియంలో పెరగనున్న అడ్మిషన్లు..

కాగా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో 1 -8 తరగతులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన మొదలుకానుంది. ఈ మేరకు ఇప్పటికే 80 వేల మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు. దీంతో సర్కారీ స్కూళ్లలో ఈసారి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశాలు పెరుగవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంగ్లిష్‌ మీడియం కోసం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలు స్కూళ్లకు సరిపడా చేరలేదని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఎక్కువ ధరకు కోట్‌ చేయడంతో టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలుపెట్టడం, కాగితం కొరత ఆలస్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్య ఇప్పటికీ వేధిస్తోంది. బోధనేతర సిబ్బంది సరిపడా లేరు. 2019–20 విద్యా సంవత్సరంలో 21 వేల మంది విద్యా వలంటీర్లను నియమించినా.. కొవిడ్‌ కారణంగా గత ఏడాది వీరి సేవలు నిలిపివేశారు. మళ్లీ వారిని తీసుకుంటే కొంతవరకైనా సమస్యలు తీరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత కొద్దిరోజులుగా తెలంగాణలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఫోర్త్‌ వేవ్‌ ఉండబోదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: ఈ ఎలుగుబంటికి ట్రాఫిక్‌ సెన్స్‌ ఎక్కువే.. రోడ్డుపై ట్రాఫిక్‌ కోన్‌ను ఎలా సరి చేసిందో మీరే చూడండి..

CM KCR: ఉండవల్లితో సమావేశమైన గులాబీ బాస్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సరికొత్త చర్చకు దారి తీసిన భేటీ..

ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌ లో చేర్చుకోవాల్సిందే..