చీర ముక్క ఆధారంగా వృద్ధురాలి మిస్సింగ్ మిస్టరీని ఛేదించిన పోలీసులు..!
వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన వృద్ధురాలు వెంకటమ్మ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం బంగారు, వెండి నగల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పరిగి డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో బండవెల్కిచర్లకు చెందిన చిపిరి మంజుల, ఆమె భర్త భీరయ్య, వారి బంధువు అరుణ్ కుమార్ ప్రధాన నిందితులుగా తేలారు.

వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన వృద్ధురాలు వెంకటమ్మ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం బంగారు, వెండి నగల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పరిగి డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో బండవెల్కిచర్లకు చెందిన చిపిరి మంజుల, ఆమె భర్త భీరయ్య, వారి బంధువు అరుణ్ కుమార్ ప్రధాన నిందితులుగా తేలారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
నిందితులు ముగ్గురు కలిసి పథకం ప్రకారం కొత్తబావి వెంకటమ్మను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో కొత్తబావి వెంకటమ్మకు మద్యం తాగించారు. తిర్మలాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చున్నీతో ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఆమె వద్ద ఉన్న బంగారు నెక్లెస్, కమ్మలు, వెండి కడియాలు, సెల్ ఫోన్లను దోచుకున్నారు. సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని రాళ్ల మధ్య పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం దొంగిలించిన నగలను కామునిపల్లి గ్రామంలో దాచిపెట్టారు.
పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలను సేకరించారు. చీర ముక్క ఆధారంగా కూతురు లక్ష్మి తన తల్లి మృతదేహాన్ని గుర్తించింది. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నగలతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ మిస్టరీని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కుల్కచర్ల పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని డిఎస్పీ స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
