వందేళ్ల అవ్వకు కొడుకే సర్వస్వం.. దట్టమైన అభయారణ్యంలో తల్లీకొడుకుల ఒంటరి జీవితం!
ఊరంటే.. గుడి, బడి, పాడి పంటలు, పొలాలు, ఆత్మీయంగా పలకరించే ఇరుగుపొరుగు, చుట్టాలు, బంధువులు. కానీ అక్కడ అవేమి కనిపించవు.. అసలు చెప్పాలంటే అక్కడ ఊరే లేదు. సరిగ్గా 70 ఏళ్ల క్రితం 250 పైగా గడపలతో చుట్టు దట్టమైన అడవితో ఒక స్వచ్చమైన గూడెం ఇక్కడ ఉండేది. కాల గమనంలో ఆ ఊరు మాయమైంది. కానీ వందేళ్లు దాటిన ఓ అవ్వ మాత్రం ఆ ఉరే ప్రాణంగా.. ఆ అడవే పంచ ప్రాణంగా జీవనం సాగిస్తుంది.

చుట్టు దట్టమైన అడవి.. నిత్యం క్రూరమృగాల సంచారం.. కనీసం సరైన దారి కూడా లేని ప్రాంతం. అలాంటి ఓ ప్రాంతంలో 7 దశాబ్దాలుగా జీవనం సాగిస్తోంది ఓ అవ్వ. ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేకపోయినా, ఆ పూరి గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. అలా అని ఆ అవ్వకు ఎవరు లేరనికాదు. ఐదుగురు కొడుకులు ఐదుగురు కూతుళ్లు. వాళ్లకు మరో 25 మంది వారసులు. ఆ వారసులకు మరో 30 మంది సంతానం.. జగమంత కుటుంబం ఉన్నా.. ఉన్న ఊరును భర్త కట్టించిన గూడును వదిలి వెళ్లలేక అడవే ప్రాణంగా బ్రతుకు సాగిస్తోంది. ఎన్ని కష్టాలున్నా కట్టె కాలే వరకు ఈ అడవే నా ఇళ్లు అంటోంది. సర్కార్ దయ తలచి కరెంట్, నీళ్ల కష్టాలు తీరిస్తే, అదే పది వేలు అంటోంది ఆ గిరిజన తల్లి. చిన్న కొడుకు సాయంతో కాలం వెళ్లదీస్తున్న అడవిలో అవ్వ కథ తెలుసుకోవాలంటే ఊరు పేరు తప్ప ఊరే లేని ఊరి స్టోరీ చదవాల్సిందే..!
ఊరంటే.. గుడి, బడి, పాడి పంటలు, పొలాలు, ఆత్మీయంగా పలకరించే ఇరుగుపొరుగు, చుట్టాలు, బంధువులు. కానీ అక్కడ అవేమి కనిపించవు.. అసలు చెప్పాలంటే అక్కడ ఊరే లేదు. సరిగ్గా 70 ఏళ్ల క్రితం 250 పైగా గడపలతో చుట్టు దట్టమైన అడవితో ఒక స్వచ్చమైన గూడెం ఇక్కడ ఉండేది. కాల గమనంలో ఆ ఊరు మాయమైంది. కానీ వందేళ్లు దాటిన ఓ అవ్వ మాత్రం ఆ ఉరే ప్రాణంగా.. ఆ అడవే పంచ ప్రాణంగా జీవనం సాగిస్తుంది. ఆమె కుర్సింగ రాంబాయి. వయసు అక్షరాల నూట ఒక్కటి. సెంచరీ దాటి ఠీవిగా నూటొక్క ఏళ్లతో పచ్చని అడవిలో జీవనం సాగిస్తోంది. ఒంటరిగా ఉంటుందా అంటే కాదు.. కొడుకు కుర్సింగ అనంతితో కలిసి పూరింట్లో జీవనం సాగిస్తోంది. కొడుకు అనంతి వయసు 56 ఏళ్లు.
అసలు రాంబాయి ఉండే ఊరు ఎక్కడా అనే కదా..! అక్కడికే వస్తున్నా.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం బలరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మారు మూల గ్రామం జువ్విగూడ. కానీ ఇప్పుడు ఆ ఊరు పేరు తప్ప అక్కడ ఊరు లేదు. స్వాతంత్ర్యానికి ముందు ఇక్కడ 250కి పైగా కుటుంబాలతో ఈ పల్లె కళకళలాడింది. కాల గమనంలో ఈ గ్రామంలోని జనమంతా వలస వెళ్లిపోయింది. కానీ కుర్సింగ రాంబాయి ఆమె కుమారుడు అనంతుతో కలిసి ఇక్కడే ఉండి పోయింది. జువ్విగూడ గ్రామంలో మిగిలి ఉన్న ఏకైక నివాసం కూడా వీరిదే.
1950 లో కుర్సింగ దాము కొడుకు ఇస్రు తో రాంబాయి వివాహం జరిగింది. ఇస్రు – రాంబాయిలకు ఐదుగురు మగ పిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు. రాంబాయి పెళ్లైన ఆరేళ్లకు అత్తమామలు చనిపోయారు. భర్త ఇస్రు పిల్లలతో కలిసి అటవీ ఉత్పత్తుల విక్రయంతో పాటు వ్యవసాయం చేస్తూ ఇక్కడే జీవితాన్ని కొనసాగించింది రాంబాయి. కాలగమనంలో సరైన వసతులు లేవంటూ రాంబాయి ముగ్గురు కుమారులు వలస వెళ్లిపోయారు. ఐదుగురు కూతుర్లలలో ముగ్గురు చనిపోగా మిగిలిన ఇద్దరు పెళ్లిలు కావడంతో వారు ఇటు వైపే రావడం మానేశారు. వృద్ధాప్యం కారణంగా రాంబాయి భర్త ఇస్రు 20 ఏళ్ల కిందటే మరణించారు. చివరకు అందరూ దూరమైనా చిన్న కొడుకు అనంతు మాత్రం తల్లి రాంబాయి కోసం ఇక్కడే ఆగిపోయాడు.
కొడుకు కుర్సింగ అనంతుకు ముప్పై ఏళ్ల క్రితమే వివాహం అవగా.. భార్య పెళ్లైన కొన్ని ఏళ్లకు అనారోగ్యంతో చనిపోయింది. అనంతుకు ఇద్దరు సంతానం కాగా వివాహం చేసుకుని వలస వెళ్లిపోయారు. భార్య చనిపోవడం పిల్లలు దూరమవడంతో కుంగిపోయిన అనంతు.. తల్లి రాంబాయి తో కలిసి ఉన్న ఊరిలోనే ఉండిపోయాడు.
జువ్విగూడ ఇప్పుడు ఒకే ఒక్క ఇళ్లుతో కనిపిస్తుండగా.. ఆ ఊరికి చేరేందుకు సరైన దారి కూడా లేదు. చుట్టు కవ్వాల్ అభయారణ్యం ఉండగా నిత్యం ఈ ప్రాంతంలో క్రూరమృగాల సంచారం కొనసాగుతోంది. రాంబాయి ఉంటున్న ఇంటికి నీటి సౌకర్యంకూడా లేదు. కనీసం కరెంటు సౌకర్యం కూడా లేదు. అయినా ఈ ఊరిలోనే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నిస్తే మాత్రం కంటి నిండా దుఃఖంతో ఉన్న ఊరును ఎలా వదిలి పెడ్తాం అంటూ గోండి బాషలో సమాదానం ఇచ్చింది 101 ఏళ్ల రాంబాయి. ‘కన్నతల్లి లాంటి ఈ ఊరు మీద ఉన్న మమకారంతోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇక్కడే నివాసం ఉంటున్నాం’ అని తెలిపాడు రాంబాయి కొడుకు అనంతు. అయిన వారు ఉన్నా ఎవరు పట్టించుకోరని.. కనీసం మా ఇంటి వైపు కన్నెత్తి చూడరని.. చిన్న తనంలో ఈ గూడెం నిండుగా కలకలాడేదని.. ఇప్పుడిలా ఒంటరి పక్షిలా మారిందంటాడు అనంతు. మా ఇద్దరిని సర్కార్ వాళ్లు కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తున్న తమ ఇంటికి కనీసం కరెంట్ సరఫరా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అయితే ఈ అడవిలో ఉండబట్టే ఆరోగ్యంగా ఉన్నానని.. వందేళ్లు దాటినా ఇంకా తన పని తానే చేసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. పోయేలోగా నా వాళ్లను అందరిని ఒక్కసారి చూడాలని.. ఈ ఇంటికి కరెంట్ వస్తే అదే పది వేళని.. నేను పోతే నాకొడుకు అనంతు ఒంటరి వాడవుతాడేమో అన్న ఆవేదన తప్ప మరే భయం లేదంటోంది నిండు నూరేళ్ల రాంబాయి. తల్లి కోసం కొడుకు.. కొడుకు కోసం తల్లి.. ఉన్న ఊరిని కన్న తల్లిని విడవని ఈ ఇద్దరి జీవనం ఈ ఆధునిక సమాజానికి ఒక మంచి పాఠం. చల్లంగా ఉండు అనంతు.. అడవి నీడలో అవ్వ సాక్షిగా..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



