Nalgonda: ఖరీదైన కార్లలో ప్రయాణం.. సూట్ బూటుతో స్లైలిష్ లుక్.. ఏం చేస్తారో తెలిస్తే అవాక్కే
సాధారణంగా దొంగలు రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటారు. పగటి పూట రెక్కి చేసి రాత్రి అయితే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని కొల్లగొడతారు. కానీ దొంగల్లో కూడా దర్జా దొంగలు ఉంటారు. ఖరీదైన కార్లలో తిరుగుతూ.. సూట్ బూటుతో పగటిపూట పరిసరాలను గమనిస్తుంటారు. అందరూ అనుకున్నట్లుగా వీరు రాత్రిపూట డబ్బులు, బంగారం కొట్టేయడం లేదు. దర్జా దొంగలుగా కనిపిస్తున్న వీరు ఎలాంటి దొంగతనాలు చేస్తారో తెలుసా..?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొంతకాలంగా మేకల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఈ దొంగతనాలపై దృష్టి సారించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈజీ మనీ కోసం కొందరు ఫ్రెండ్స్ నాలుగు గ్యాంగ్‌లుగా ఏర్పడి ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రి సమయాలలో టార్గెట్ ను కొట్టేస్తారు. అందరూ అనుకున్నట్లుగా ఈ ముఠాలు డబ్బులు బంగారం కొట్టేయడం లేదు. రాత్రివేళ ఈ ముఠాలు ఖరీదైన కార్లలో వచ్చి మేకలను కార్లలో వేసుకొని మేకల దొంగతనాలకు పాల్పడుతున్నాయి. శాలిగౌరారం పోలీసులు బైరవోనిబండ క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా AP 09 BQ 3128 డిజైర్ కారును పట్టుకున్నారు. కారులోని ముగ్గురు మగవాళ్లు, మహిళను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. వీరి ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో చెక్ చేయగా వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలింది.
ఈ ముఠాలపై గతంలో నల్గొండ రూరల్ పిఎస్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్‌పల్లి, నల్గొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పిఎస్‌లలో మేకల దొంగతనాల నేరాలలో నిందితులుగా ఉన్నారు. ఈ ముఠా సభ్యులు గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చినా ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి నేరాలకు పాల్పడుతున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 15 చోట్ల మరియు రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకల దొంగతనాలకు పాల్పడ్డారు.
మొత్తం 26 నేరాలలో 200లకు పైగా మేకలను ముఠా సభ్యులు దొంగిలించారు. ఈ ముఠాలు దొంగలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. నాలుగు ముఠాలకు చెందిన 16 మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండులక్షల 46 వేల రూపాయల నగదు, 22 గొర్రెలు, 47 లక్షల విలువ గల 8 కార్లు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.




