Minister Komatireddy: పదవ తరగతి విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి బర్త్ డే సర్ప్రైజ్ గిఫ్ట్..
పరీక్షల్లో విద్యార్థులు సాధించే మార్కులను చూసి శభాష్ అంటే ఎంతో మురిసిపోతుంటారు. వారి ప్రతిభకు బహుమతులు ఇస్తే ఎంతో ఆనంద పడుతుంటారు. మరీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే.. విద్యార్థుల ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి సీనే ఇక్కడ రిపీట్అయింది. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ఓ మంత్రి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.. అన్నట్టుగానే విద్యార్థులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ల కళ్లలో ఆనందం చూశారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పదో తరగతిలో ప్రతి కనభర్చిన విద్యార్థులకు మంత్రి కోటమి రెడ్డి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వారందరినీ విమానం ఎక్కించి వారి కళ్లలో ఆనందాన్ని చూశారు. విరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల మనిషిగా ఉంటారు. ప్రజల కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చదువుతోనే మనిషికి విలువ.. పేదరికం పోవాలంటే చదువొక్కటే మార్గమని నమ్మిన వ్యక్తి ఆయన.. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి విద్యార్థులకు ఆయన ఎప్పుడూ ఆర్థికంగా చేయూతనిస్తుంటారు. కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అనేక విద్యా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల తిప్పర్తి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన మంత్రి కోమటి రెడ్డి అక్కడి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. మంచి టాప్ మార్కులు సాధించిన వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు.
అన్నట్టుగానే 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం తన బర్త్ డే సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బహుమతులు అందజేశారు. భవిష్యత్ ఆలోచనలు, ఉన్నత చదువులపై విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి ఉన్నత విద్యకు భరోసాగా ఉంటానని విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. విద్యార్థుల ఆలోచనలు ఉద్యోగం వరకే పరిమితం కాకుండా ఉద్యోగాల సృష్టి కర్తలుగా ఎదగాలని వారికి హితవు పలికారు.
అంతే కాకుండా తన బర్త్ డే సర్ప్రైజ్ గిఫ్ట్ కింద విద్యార్థులకు “విమాన ప్రయాణం” వైజాగ్, అరకు వ్యాలీ రెండు రోజుల ట్రిప్ ఏర్పాటు చేశారు. టూర్ కు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ ఆయన విద్యార్థులకు అందజేశారు. దీంతో శనివారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి 14మంది విద్యార్థుల బృందం విశాఖపట్నంకు ఫ్లైట్‌లో బయల్దేరారు. వైజాగ్‌లో విద్యార్థులకు మంత్రి స్టార్ హోటల్లో బస ఏర్పాట్లు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకునేందుకు టీచర్, తన వ్యక్తిగత సిబ్బందిని సైతం మంత్రి పంపారు. ఫ్లైట్ ట్రిప్ ఎంజాయ్ చేయండి.. హ్యాపీ జర్నీ అంటూ మంత్రి కోమటిరెడ్డి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఆకాశంలో ఎగురుతున్న విమానాలను చూసి తాము ఎప్పుడు ఎక్కుతామో అని అనుకునేవాళ్లమని, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్ తో ఫ్లైట్ కల సాకారమైందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఫ్లైట్ జర్నీ తమ జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకం అని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
