ఇలా తయారయ్యారేంట్రా..! టిఫిన్‌లో చట్నీ తక్కువైందని హోటల్ సిబ్బందిపై కత్తితో దాడి..!
హైదరాబాద్ మహానగరంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. కేవలం టిఫిన్‌లో చట్నీ తక్కువగా వేశారనే అతిచిన్న కారణంతో ఒక కస్టమర్ రెచ్చిపోయాడు. హోటల్ సిబ్బందిపై ప్రాణాంతక దాడికి దిగాడు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి సుచిత్ర జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సుచిత్ర ప్రాంతంలోని ఒక టిఫిన్ సెంటర్‌కు శనివారం (మే 23) ఉదయం ఓ కస్టమర్ వచ్చాడు. టిఫిన్ ఆర్డర్ చేసిన అతడికి సిబ్బంది ప్లేట్ అందించారు. అయితే, అందులో చట్నీ తక్కువగా ఉందని సదరు కస్టమర్ హోటల్ నిర్వాహకులు, సిబ్బందితో గొడవకు దిగాడు. సిబ్బంది ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తీవ్ర ఆగ్రహంతో వాగ్వాదాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన ఆ కస్టమర్, హోటల్ కౌంటర్ వద్ద ఉల్లిపాయలు కోసేందుకు ఉంచిన పదునైన కత్తిని తీసుకుని ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశాడు.
ఈ ఆకస్మిక దాడిలో హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు విన్న అక్కడి కస్టమర్లు, స్థానికులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తీవ్రంగా గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిన్న విషయాలకే ఇంతలా రెచ్చిపోయి దాడులకు తెగబడటం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..