Pan Card: మీ పాన్ కార్డుపై వేరొకరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారా..? ఇలా సులువుగా గుర్తు పట్టేయండి..
ఇటీవల పాన్ కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. ఒకరి పాన్ కార్డుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాన్ కార్డు పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు సిబిల్ రిపోర్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అనుమానం ఉంటే బ్యాంకులను సంప్రదించాలి.

ఇటీవల పాన్ కార్డు దుర్వినియోగం అనేది పెరిగిపోతుంది. ఒకరి పాన్ కార్డుపై మరొకరు అకౌంట్ ఓపెన్ చేయడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. మీ పేరుపై మరొకరు అకౌంట్ తెరిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. బ్యాంక్ అకౌంట్లో జరిగే అన్నీ లావాదేవీలు పాన్‌తో లింక్ అయి ఉంటాయి. దీంతో ఆ అకౌంట్ నుంచి జరిగే ప్రతీ ట్రాన్సాక్షన్ మీరు చేసినట్లు అవుతుంది. దీని వల్ల మీరు ట్యాక్స్ ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు మీ పేరుపై ఉన్న అకౌంట్‌తో చేసే మోసాలకు మీరే బాధ్యులు అవుతారు. దీంతో మీరు కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
ఎలా గుర్తించాలి..?
మీ సిబిల్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మన పేరుపై ఉండే బ్యాంక్ అకౌంట్లు, లోన్లు, ఇతర ఆర్ధిక వివరాలు అన్నీ సిబిల్ రిపోర్టులో కనిపిస్తాయి. దీంతో మీ పేరుపై ఎవరైనా అకౌంట్ తెరిస్తే వెంటనే తెలిసిపోతుంది. మీకు తెలియకుండా ఏదైనా బ్యాంకులో అకౌంట్ తెరిచినట్లు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. సదరు బ్యాంక్‌ను సంప్రదించి అకౌంట్ క్లోజ్ చేసుకోండి. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల మీ అకౌంట్ నుంచి మెసాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఫార్మ్ 26ఏఎస్ లేదా వార్షిక సమాచార స్టేట్‌మెంట్ చెక్ చేయడం ద్వారా మీ పాన్‌కు లింక్ అయిన ఆర్ధిక కార్యకలాపాలను చూడవచ్చు. మీకు తెలియని లావాదేవీలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులను సంప్రదించండి.
తెలియని వ్యక్తులకు చెప్పకండి
ఇక మీరు తెరవని అకౌంట్ల నుంచి లేఖలు రావడం వంటివి కూడా మీ పాన్ కార్డు దుర్వినియోగం అయిందని చెప్పడానికి ఒక సంకేతం. ఇలాంటి సంకేతాలను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. మీ పాన్ కార్డు వివరాలను తెలియనివారితో అసలు పంచుకోకండి. నమ్మకమైన ఆర్ధిక సంస్థలు, వ్యక్తులకు మాత్రమే పాన్ వివరాలు చెప్పడం లేదా జిరాక్స్ కాపీలు ఇవ్వడం లాంటివి చేయండి. అనధికార వెబ్ సైట్లలో మీ పాన్ వివరాలు అప్‌లోడ్ చేయకండి. పాన్ అనేది ఆర్ధిక లావాదేవీలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది దుర్వినియోగం అయితే మీరు ఇబ్బందుల్లో పడతారు. అందుకే మీ పాన్ విషయంల జాగ్రత్తగా ఉండండి.
