AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించే శక్తి ఉన్న బార్బరీకుడు గురించి మీకు తెలుసా..?

మహాభారతంలోని అత్యంత రహస్యమైన, శక్తివంతమైన పాత్రల్లో బార్బరీకుడు ఒకడు. భీముడి మనుమడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరీకుడు పరమశివుని వరంగా మూడు అద్భుత బాణాలను పొందాడని పురాణ కథలు చెబుతాయి. ఎవరు బలహీనంగా ఉంటే వారి పక్షాన పోరాడతానని మాటిచ్చిన అతను, మహాభారత యుద్ధాన్ని ఒక్క క్షణాల్లో ముగించగల యోధుడిగా పేరుపొందాడు.

3 బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించే శక్తి ఉన్న బార్బరీకుడు గురించి మీకు తెలుసా..?
Barbarika
Ram Naramaneni
|

Updated on: May 23, 2026 | 11:33 AM

Share

మహాభారతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నప్పటికీ, బార్బరీకుడి గాథ ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. అపారమైన శక్తి ఉన్నా, ధర్మం కోసం తనని తాను త్యాగం చేసిన మహాయోధుడిగా ఆయనను భక్తులు ఆరాధిస్తారు. అయితే బార్బరీకుడి గురించి ప్రచారంలో ఉన్న కథలు వ్యాస మహాభారతం, పురాణాలు, ప్రాంతీయ జానపద గాథలు, భక్తి సంప్రదాయాల మేళవింపుగా భావించబడతాయి.

బార్బరీకుడు పాండవుల్లో భీముడి మనుమడు, ఘటోత్కచుడి కుమారుడు. చిన్నప్పటి నుంచే అసాధారణ యోధుడిగా ఎదిగిన అతను పరమశివుని అనుగ్రహంతో మూడు అద్భుత బాణాలను పొందాడని కథలు చెబుతాయి. అందుకే అతనిని “త్రిబాణధారి” అని పిలుస్తారు. ఎవరు బలహీనంగా ఉంటే వారి పక్షాన పోరాడతానని తన తల్లికి మాట ఇచ్చిన బార్బరీకుడు, మహాభారత యుద్ధానికి బయలుదేరాడు.

పురాణ కథనాల ప్రకారం, యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు బార్బరీకుడి శక్తిని పరీక్షించాడని చెబుతారు. తన మూడు బాణాలతో యుద్ధాన్ని చాలా తక్కువ సమయంలో ముగించగలనని బార్బరీకుడు చెప్పడంతో, అతని శక్తి ఎంత ప్రమాదకరమో కృష్ణుడు గ్రహించాడని కథనం. ఎందుకంటే బలహీనుల పక్షాన మారుతూ పోరాడితే చివరికి యుద్ధభూమిలో ఎవరూ మిగలరని భావించిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణ వేషంలో అతని వద్దకు వెళ్లి శిరస్సు దానం కోరాడని భక్తి గాథలు చెబుతాయి.

బార్బరీకుడు తన తలను దానం చేస్తూ, యుద్ధాన్ని చూడాలనే కోరిక కోరాడు. శ్రీకృష్ణుడు అతని తలను యుద్ధభూమికి సమీపంలోని కొండపై ఉంచి మహాభారత యుద్ధాన్ని వీక్షించే వరం ఇచ్చాడని విశ్వసిస్తారు. యుద్ధం అనంతరం విజయం ఎవరి వల్ల సాధ్యమైందని అడిగితే, “ధర్మ స్థాపన కోసం దివ్య శక్తే యుద్ధాన్ని నడిపించింది” అని బార్బరీకుడు చెప్పినట్లు కథలు చెబుతాయి.

కలియుగంలో బార్బరీకుడు “ఖాటూ శ్యామ్” పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడనే విశ్వాసం కూడా భక్తుల్లో ఉంది. అందుకే నేటికీ రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ టెంపుల్ సహా అనేక ప్రాంతాల్లో బార్బరీకుడిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు.

కొన్ని కథనాల ప్రకారం బార్బరీకుడిని చిన్నప్పట్లో “సుహృదయ” అని కూడా పిలిచేవారని చెబుతారు. అయితే “బార్బరీక” అనే పేరే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. “బార్బరీక” అనే పదం సంస్కృతంలోని “బర్బర” అనే పదం నుంచి వచ్చిందని, చిన్నప్పటి నుంచే అతనికి గుబురు జుట్టు ఉండేదని కొన్ని జానపద కథలు చెబుతాయి. భక్తి కథనాల ప్రకారం అతని 3 బాణాల్లో.. ఒక బాణం లక్ష్యాలను గుర్తిస్తుంది, రెండోది రక్షించాల్సిన వాటిని గుర్తిస్తుంది, మూడోది శత్రువులను పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే మూడు బాణాలే ఉన్నా అతను అజేయుడిగా భావించబడాడు. అగ్నిదేవుడు ఇచ్చిన విల్లు వల్ల బార్బరీకుడి బాణాలు ఎప్పుడూ లక్ష్యాన్ని తప్పవని కథలు చెబుతాయి. జానపద విశ్వాసాల ప్రకారం యుద్ధంలో అతను దిగితే.. మొదట కౌరవులను బలహీనులుగా భావించి వారిపక్షాన పోరాడేవాడు, తర్వాత పాండవులు బలహీనమైతే వారి వైపు మారేవాడు, ఇలా చివరకు యుద్ధంలో ఎవరూ మిగలరని శ్రీకృష్ణుడు గ్రహించాడని చెబుతారు.

మహాభారత యుద్ధాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పూర్తిగా వీక్షించిన వ్యక్తిగా బార్బరీకుడి తలను భక్తి గాథలు పేర్కొంటాయి. యుద్ధం తర్వాత పాండవులు విజయం తమ వల్లే వచ్చిందని భావించినప్పుడు, బార్బరీకుడి తల మాత్రం “సుదర్శన చక్రం, శ్రీకృష్ణుడి దివ్యశక్తే యుద్ధాన్ని నడిపించాయి” అని చెప్పిందని విశ్వాసం. ఒక జానపద కథనం ప్రకారం.. శతాబ్దాల తర్వాత రాజస్థాన్‌లో ఒక ఆవు ప్రతిరోజూ ఒక ప్రదేశంలో స్వయంగా పాలు కార్చేదట. అక్కడ తవ్వితే బార్బరీకుడి శిరస్సు బయటపడిందని, అదే తర్వాత ఖాటూ శ్యామ్ ఆలయంగా మారిందని భక్తులు చెబుతారు. కొన్ని నేపాలీ కథనాల్లో బార్బరీకుడిని “ఎలంబర్” రాజుతో అనుసంధానం చేస్తారు. అయితే దీనిపై చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేవు.

Follow Us