AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 1st Test: ఒంటరి పోరాటంతో హెన్రీ నికోల్స్ 175 నాటౌట్.. న్యూజిలాండ్ 368 ఆలౌట్

IND vs NZ 1st Test: భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. ఫిలిప్స్ 118 పరుగులు చేయగా, నికోల్స్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

IND vs NZ 1st Test: ఒంటరి పోరాటంతో హెన్రీ నికోల్స్ 175 నాటౌట్.. న్యూజిలాండ్ 368 ఆలౌట్
Ind Vs Nz 1st Test (2)
Rakesh
|

Updated on: Nov 20, 2026 | 7:35 AM

Share

IND vs NZ 1st Test: వెల్లింగ్టన్‌లో జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ తొలి టెస్టులో రెండో రోజు భారత బౌలర్లు చివరకు పైచేయి సాధించారు. తొలి రోజు భారీ భాగస్వామ్యంతో భారత్‌ను ఇబ్బంది పెట్టిన న్యూజిలాండ్ బ్యాటర్లను రెండో రోజు కట్టడి చేశారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ 368 పరుగుల వద్ద ముగిసింది. అయితే హెన్రీ నికోల్స్ మాత్రం భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో రోజు ఆటలో కీలక మలుపు గ్లెన్ ఫిలిప్స్ వికెట్. అతను 118 పరుగులు చేసి ఔటవడంతో హెన్రీ నికోల్స్‌తో అతడి భారీ భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 216 పరుగులు జోడించి న్యూజిలాండ్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు.

70 పరుగులకే 5 వికెట్లు

ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబడింది. కేవలం 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించినట్లే కనిపించారు.

216 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు షాక్

ఐదో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్.. హెన్రీ నికోల్స్‌తో కలిసి భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు ఏకంగా 216 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిలిప్స్ 216 బంతుల్లో 118 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో ఈ కీలక భాగస్వామ్యానికి ముగింపు పడింది.

నికోల్స్ ఒంటరి పోరాటం

మరోవైపు హెన్రీ నికోల్స్ మాత్రం భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఫిలిప్స్ ఔటైన తర్వాత కూడా సహచరులతో కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 335 బంతులు ఎదుర్కొన్న నికోల్స్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి. తొలి రోజు సెంచరీతో ఆకట్టుకున్న నికోల్స్.. రెండో రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

బుమ్రా 4 వికెట్లు.. ఆకాశ్ దీప్ 3 వికెట్లు

భారత్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి కీలక బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అన్‌శుల్ కాంబోజ్ కూడా వికెట్లు సాధించారు. అయితే నికోల్స్, ఫిలిప్స్ భాగస్వామ్యం కారణంగా న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించగలిగింది. తొలి రోజు 243/5తో ముగించిన కివీస్.. రెండో రోజు 368 పరుగుల స్కోరుకు చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us