AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aakasamlo oka tara Review: ఆకాశంలో ఒక తార రివ్యూ.. మనసును హత్తుకునే ఇన్‌స్పిరేషనల్ డ్రామా..!

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా.. కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి ముఖ్య పాత్రలో పవన్ సాదినేని దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ భావోద్వేగ ప్రయాణం ఆడియన్స్ మనసులను గెలుచుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Aakasamlo oka tara Review: ఆకాశంలో ఒక తార రివ్యూ.. మనసును హత్తుకునే ఇన్‌స్పిరేషనల్ డ్రామా..!
Aakasamlo Oka Tara
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 20, 2026 | 7:17 AM

Share

మూవీ రివ్యూ: ఆకాశంలో ఒక తార

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతి హాసన్, ప్రవీణ్, కసిరెడ్డి, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, రుహాణి శర్మ తదితరులు

సంగీతం: జీవి ప్రకాష్

సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్

ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్

దర్శకత్వం: పవన్ సాదినేని

నిర్మాణం: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్

కథ:

చిన్నప్పటి నుంచే అంతరిక్షంలోకి వెళ్లాలనే బలమైన ఆశయంతో పెరుగుతుంది కల్పన (సాత్విక వీరవల్లి). ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా పట్టుదలతో చదివి పదో తరగతిలో జిల్లా మొత్తంలోనే ప్రథమ స్థానం సాధిస్తుంది. సరిగ్గా అదే సమయంలో పెద్దలు ఆమెకు వివాహం జరిపిస్తారు. పెళ్లి తర్వాత తన భార్య మనసులోని ఆశయాన్ని భర్త కృష్ణ (దుల్కర్ సల్మాన్) గుర్తిస్తాడు. అక్కడి నుంచి కల్పన లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృష్ణ ఎలాంటి అడుగులు వేశాడు, ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డాడు? ఈ ప్రయాణంలో ‘స్కై వే’ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ యజమాని రోహిణి (శృతి హాసన్) పాత్ర ఏంటి, ఆమె వీరికి అండగా నిలిచిందా లేక అడ్డంకులు సృష్టించిందా? చివరకు కల్పన అంతరిక్ష యాత్రికురాలు కావాలన్న తన ఆశయాన్ని చేరుకుందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం వెండితెరపైనే చూడాలి.

కథనం:

మనసును తాకే కొన్ని చిత్రాలను మాటల్లో వర్ణించడం కష్టం, వాటిలోని భావాలను హాలులో కూర్చుని అనుభూతి చెందాల్సిందే. ‘ఆకాశంలో ఒక తార’ కూడా సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది. కేవలం ఆశయాలు పెట్టుకుంటే సరిపోదు, వాటిని సాధించడానికి ఎంతదూరమైనా పోరాడాలి, ఆ పోరాటంలో వెన్నంటి నడిపించే తోడు ఒకరు ఉండాలనే గొప్ప ఆలోచన చుట్టూ దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని మలిచారు. భార్య అంతరిక్ష యాత్ర ఆశయాన్ని నిజం చేయడానికి భర్త పడే తపనను ఎంతో సున్నితంగా, గుండెకు హత్తుకునేలా తెరపై ఆవిష్కరించారు. నిజానికి మూల కథ చాలా చిన్నదే అయినా, దానికి అల్లిన సన్నివేశాలు ప్రేక్షకులను లోతుగా కట్టిపడేస్తాయి. ఇలాంటి సున్నితమైన అంశాలను చెప్పేటప్పుడు పాత్రల స్వభావాన్ని, వాటి మధ్య బంధాన్ని స్పష్టంగా స్థాపించాలి కాబట్టి వేగం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఆ కారణంగానే మొదటి సగం అక్కడక్కడా నిదానంగా సాగుతూ సాధారణ స్థాయిలోనే అనిపిస్తుంది. దానికి తోడు కృష్ణ, అతని అక్క మధ్య వచ్చే చిన్న సన్నివేశం గతంలో ఎన్నో చిత్రాల్లో చూసిన భావన కలిగిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా పూర్తిగా ఊపందుకుంటుంది. సెకండాఫ్ మొత్తం ఆద్యంతం ఉత్కంఠగా, భావోద్వేగభరితంగా సాగుతుంది. కృష్ణ, కల్పనల మధ్య ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, బాధ్యతను ఏ పాత్రనూ తగ్గించకుండా సమాన ప్రాధాన్యంతో చూపించడంలో దర్శకుడు పూర్తి విజయం సాధించారు. ముఖ్యంగా దుల్కర్, సాత్విక, శృతి హాసన్ కలిసి కనిపించే ఓ కీలక ఘట్టం చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముగింపు సన్నివేశాల్లో పండిన భావోద్వేగాలు వీక్షకుల కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ చిత్రం చూస్తున్నంత సేపు అలనాటి క్లాసిక్ తెలుగు కుటుంబ చిత్రాల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అనవసరమైన మలుపుల జోలికి పోకుండా కథ లక్ష్యంపైనే దృష్టి పెట్టి, చక్కటి కుటుంబ విలువలను జోడించడం బాగా కలిసొచ్చింది. చిన్నపాటి లోటుపాట్లను పక్కన పెడితే, గుండెను కదిలించే అద్భుతమైన అనుభూతిని ఈ కథనం అందిస్తుంది.

నటీనటులు:

దుల్కర్ సల్మాన్ సాధారణ హీరో కాదని, అద్భుతమైన నటుడని కృష్ణ పాత్రతో మరోసారి చాటిచెప్పారు. ‘సీతారామం’ తర్వాత తిరిగి అలాంటి స్వచ్ఛమైన, నిజాయితీ గల భావోద్వేగ పాత్రలో జీవించి ప్రేక్షకులను కట్టిపడేశారు. తొలి చిత్రంతోనే సాత్విక వీరవల్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక కొత్త అమ్మాయికి ఇంతకంటే గొప్ప ఆరంభం దొరకదేమో అన్నట్లుగా, కల్పన పాత్రలో ఆమె చూపిన హావభావాలు, పరిణతి అబ్బురపరుస్తాయి. దుల్కర్, సాత్వికల మధ్య కుదిరిన సహజమైన అన్యోన్యత తెరపై చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. శృతి హాసన్ పోషించిన రోహిణి పాత్ర చిత్రానికి మరో పెద్ద బలంగా నిలిచింది. తనదైన శైలిలో ఆ పాత్రకు బరువు తీసుకొచ్చింది. ఇక కీలక సహాయ పాత్రల్లో కనిపించిన మురళీ శర్మ, గౌతమ్ మీనన్, రుహాణి శర్మ తమ అనుభవంతో మెప్పించగా, మిగిలిన నటీనటులంతా తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు వినసొంపుగా ఉండటమే కాకుండా, కొన్ని కీలక ఘట్టాల్లో నేపథ్య సంగీతం సన్నివేశాల స్థాయిని పెంచి చిత్రానికి అండగా నిలిచింది. సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, సహజంగా చూపించింది. ప్రవీణ్ కే ఎల్ ఎడిటింగ్ సినిమా స్పీడ్‌కు తగ్గట్టుగా చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా విజువల్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే ఈ కథలోని గొప్పతనం మరింత అద్భుతంగా తెరపై పండేది. పవన్ సాదినేని ఎంచుకున్న నిజాయితీ గల ఆలోచనకు గుణ్ణం గంగరాజు, వసంత్ జుర్రు అందించిన కథా నిర్మాణం తోడై మంచి ఫలితాన్నిచ్చింది. దీనికి తోడు పదునైన, మనసుకు హత్తుకునే మాటలు ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకుంటాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘ఆకాశంలో ఒక తార’.. మనసును కదిలించి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం..!

Follow Us