AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఒకే ఒక్క వికెట్.. 74 పరుగులు.. రెండో రోజు కివీస్ బ్యాటింగ్ విధ్వంసం

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ బ్యాటర్లు ఆధిపత్యం చూపిస్తున్నారు. గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులతో సెంచరీ చేయగా, హెన్రీ నికోల్స్ అజేయంగా 146 పరుగులు సాధించాడు. రెండో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 317/6 స్కోరుతో నిలిచింది. భారత బౌలర్ల ప్రదర్శన, మ్యాచ్‌లో టీమిండియా తిరిగి పుంజుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

IND vs NZ: ఒకే ఒక్క వికెట్.. 74 పరుగులు.. రెండో రోజు కివీస్ బ్యాటింగ్ విధ్వంసం
Ind Vs Nz 1st Test (1)
Rakesh
|

Updated on: Nov 20, 2026 | 6:55 AM

Share

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. తొలి రోజు ఆరంభంలో భారత బౌలర్లు అదరగొట్టినా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ నికోల్స్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రెండో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌పై ఆతిథ్య జట్టు పట్టు సాధించే దిశగా సాగుతోంది.

తొలి రోజు తడబడిన న్యూజిలాండ్

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత పేసర్లు ఆరంభంలో బాగానే ఇబ్బంది పెట్టారు. బుమ్రా మూడు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ అంషుల్ కాంబోజ్ ఖాతాలో చేరింది. దీంతో కివీస్ ఒక దశలో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఫిలిప్స్, నికోల్స్ అద్భుత భాగస్వామ్యం

ఈ దశలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్.. హెన్రీ నికోల్స్‌కు అండగా నిలిచాడు. ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వేగం పెంచారు. ఫిలిప్స్ దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోగా.. నికోల్స్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. చివరకు ఫిలిప్స్ 118 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

రెండో రోజు కూడా కివీస్ జోరు

తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. రెండో రోజు కూడా కివీస్ బ్యాటర్లు అదే జోరు కొనసాగించారు. ఫిలిప్స్ వికెట్ తీసినప్పటికీ భారత బౌలర్లు పరుగులను అడ్డుకోలేకపోయారు. రెండో రోజు తొలి సెషన్‌లో 26 ఓవర్లు వేసిన భారత బౌలర్లు 74 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశారు. దీంతో న్యూజిలాండ్ స్కోరు 300 పరుగుల మార్కును దాటింది.

నికోల్స్ సెంచరీ దాటి భారీ స్కోరు దిశగా

రెండో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 108 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ 146 పరుగులతో అజేయంగా నిలవగా.. నాథన్ స్మిత్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు, అంషుల్ కాంబోజ్ ఒక వికెట్ తీశారు. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లకు ఇంకా వికెట్లు దక్కలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us