40 ఏళ్లనాటి పగ.. మద్యం సెట్టింగ్ వేసి.. ధావత్‌కు పిలిస్తే వెళ్లిన బీఆర్ఎస్ నేత.. ఇంతలో దారుణం..!
సూర్యాపేట జిల్లాలోని యల్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త, చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం (మే 22) సూర్యాపేటలోని తన నివాసం నుండి బయటకు వెళ్లిన మధు, సాయంత్రం నుండి ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు.

సూర్యాపేట జిల్లాలోని యల్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త, చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం (మే 22) సూర్యాపేటలోని తన నివాసం నుండి బయటకు వెళ్లిన మధు, సాయంత్రం నుండి ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యల్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో అనుమానాస్పదంగా మూట కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మధు మృతదేహంగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు.
సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో మద్యం సెట్టింగ్ ఏర్పాటు చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అక్కడే మధును హతమార్చి, అనంతరం మృతదేహాన్ని వాహనంలో యల్కారం శివారుకు తరలించినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
మృతుడు చింతలపాటి మధు 25 ఏళ్ల క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ పాత కక్షల నేపథ్యంలోనే మిద్దె రవీందర్ వర్గీయులు పక్కా స్కెచ్‌తో మధును హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యల్కారం ఫ్యాక్షన్ పరంగా అత్యంత సున్నితమైన గ్రామం కావడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పికెట్ నిర్వహించారు.
యల్కారం గ్రామంలో 1985 నుండి రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరువర్గాల మధ్య కక్షల కారణంగా సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1985 ప్రాంతంలో గ్రామ టీడీపీ నాయకుడు యలగందుల సిద్దయ్య సూర్యాపేటలో దారుణ హత్యకు గురైయ్యారు. అప్పటి నుండి తాజాగా జరిగిన మధు హత్య వరకు సుమారుగా ఎనిమిది మంది రాజకీయ కక్షలు బలైయ్యారు. 1985 లో యలగందుల సిద్దయ్య హత్య తరవాత కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య అనంతరం 1996 సిద్దయ్య కుమారుడు అజయ్ హత్యకు గురైయ్యాడు. అప్పటి నుండి గ్రామం నీవురుగప్పిన నిప్పులా మారింది. అజయ్ హత్య జరిగిన కొద్దీ రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ పై హత్యా యత్నం జరిగింది. ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేషే కారణమని భావించి 1999లో రమేష్ ని హత్య చేశారు.
రమేష్ హత్య అనంతరం కొంత కాలం ప్రశాంతంగా ఉన్న గ్రామం తిరిగి 2007 లో మిద్దె రవీందర్ హత్యతో భగ్గుమంది. రవీందర్ హత్యతో పోలీసులు గ్రామం పై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో మరో ఘటన జరగకుండా అన్ని వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సమన్వయం చేశారు . కొద్దీ రోజులపాటు పోలీసుల చర్యలు ఫలితాల ఇచ్చి గ్రామం ప్రశాంతంగా మారింది. ఇంతలోనే 2020 లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నని గ్రామంలో దారుణంగా హత్య చేశాడు ప్రత్యర్థి వడ్డే ఎల్లయ్య. అయితే 2024 ఎల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో అతని ప్రత్యర్థి శ్రీకాంతా చారి హత్య చేశాడు. చింతలపాటి మధు 25 ఏళ్ళ క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తాజా ఘటన రవీందర్ వర్గీయులు చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
ఈ వరుస హత్యలతో యల్కారం పేరు చెబితేనే చుట్టుపక్కల ప్రజలు హడలిపోతున్నారు. రాజకీయ కక్షల వల్ల నలిగిపోతున్న పలు కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్తున్నాయి. పోలీసులు ఇకనైనా ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి, భవిష్యత్తులో ఇలాంటి రక్తపాతాలు జరగకుండా శాశ్వత శాంతిభద్రతలు నెలకొల్పాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
