Telangana: సమ్మర్ ఎఫెక్ట్.. ఈ దొంగలు ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే.. నవ్వాపుకోలేరు!
దొంగలంటే సాధారణంగా ఇంట్లో ఉన్న డబ్బో, లేదా బంగారమో ఎత్తు కెళ్తారు. లేదా ఇంటి ముందు ఉన్న వాహనాలో లేదా ఏవైనా విలువైన వస్తువులు ఉంటే కాజేస్తారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు దొంగలు చేసిన పని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారు ఎత్తుకెళ్లిన వస్తువు గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకూ వాళ్లు కోట్టేసింది ఏంటనేగా మీ డౌట్.. అయితే తెలుసుకుందాం పదండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో దొంగల టాలెంట్ కొత్త లెవెల్‌కి చేరింది. ఇళ్లూ, షాపులూ, బైక్‌లూ చాలవనుకున్నారో ఏమో ఇప్పుడు నేరుగా శవాల ఫ్రీజర్‌లపైనే కన్నేశారు కొందరు కేటుగాళ్లు. సారపాక పంచాయతీ కార్యాలయంలో మృతదేహాల భద్రపాటుకు కోసం ఉంచిన ఫ్రీజర్ మోటార్‌ను రాత్రికి రాత్రే మాయం చేశారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఫ్రీజర్ను చూసి ఆది పనిచేయకపోవడంతో పరిశీలించి అవాక్కయ్యారు. ఇదేం ట్విస్ట్ రా బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఇదే విషయాన్ని స్థానిక సర్పంచ్, ఈఓలకు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు బంగారం, డబ్బు దొంగిలించడం ఓకే కానీ శవాల ఫ్రీజర్ మోటార్ కూడా వదలకపోవడంతో ఏంటని షాక్ అవుతున్నారు. దొంగతనానికి కాదేది అనర్హం అన్న సామెతను ఈ దొంగలు నిజం చేసి చూపించారంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. అసలే ఎండలు మండిపోతున్నాయి, మోటార్ ఒక్కటే కాకుండా ఫ్రీజర్ బాక్సునే ఎత్తుకెళ్లి వేసవి కాలం అయి పోయేవరకు అందులోనే పడుకుంటే సల్లంగ ఉంటుంది కదరా అని నవ్వుకుంటున్నారు.
ప్రస్తుతం మండలంలో ఏ నోటా చూసిన ఈ చోరీ ఘటన గురించే చర్చ, సారపాక పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు సర్పంచ్, ఈఓ లు, మరి పోలీసులు ఆ మోటార్ దొంగలను పట్టుకుంటారా.. లేదా ఈ చిన్న దానికి కూడా కేసు నమోదు చేయడం అవసరమా అని వదిలేస్తారో వేచి చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
