చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వారసత్వ సంపదను రక్షించాలంటూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జాతీయంగా రక్షిత వారసత్వ స్మారక చిహ్నం, వరంగల్ కోట భూములను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆస్తిగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాల తొలగింపు, కోట భూముల నుండి ఆక్రమణదారులను తొలగించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు.

వారసత్వ సంపదను రక్షించాలంటూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జాతీయంగా రక్షిత వారసత్వ స్మారక చిహ్నం, వరంగల్ కోట భూములను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆస్తిగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాల తొలగింపు, కోట భూముల నుండి ఆక్రమణదారులను తొలగించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు.
2022 నుండి ASI పదే పదే నోటీసులు, జిల్లా కలెక్టర్‌కు లేఖలు పంపినప్పటికీ స్పందనలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అసలు ఏడు కోట గోడలలో మూడు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అన్యాక్రాంతం అవుతున్న వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. కోటలో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రభావవంతమైన చర్య తీసుకోకపోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు.
దాదాపు 250 సంవత్సరాలపాటు కాకతీయుల రాజధానిగా కీర్తిగడించి ఘనమైన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైభవంతో అలరారిన ఓరుగల్లు పట్టణం.. మన వారసత్వ సంపదకు నిలయంగా విరాజిల్లుతోంది. కాకతీయుల కాలంలో ఇతర రాజ్యాల నుంచి ఎదురయ్యే దండయాత్రల నుంచి రాజధానికి రక్షణ కల్పించటం కోసం ఒక ప్రణాళిక ప్రకారం 7 ప్రాకారాలతో వరంగల్ కోటను ఎంతో పకడ్బందీగా నిర్మించారు. ఢిల్లీ సుల్తానులు, హైదరాబాద్ నవాబుల దాడులను ఎదుర్కొన్న కోట.. నేటికీ కాకతీయుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
ప్రతిరోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ కోటను సందర్శించి కోటలో దాగి ఉన్న శిల్ప సంపద, నిర్మాణ నైపుణ్యం, వందలాది ఆలయాలు, వాటి నేపథ్యం, కోట ప్రాధాన్యం గురించి తెలుసుకుంటుంటారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సౌండ్, ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాలలో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలున్నాయి. ఈ 3 ప్రాకారాలతో పాటు ఇతర ప్రాకారాలను కొంతమంది స్థానికులు ఆక్రమించి కోట భూములలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారు. వరంగల్ కోట ASI అధీనంలో ఉన్న ఒక స్మారక ప్రదేశమని, దీనికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలను నిర్మించడం చట్టరీత్యా నేరమని, వెంటనే ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలని కోరుతూ ASI అధికారులు ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ వరంగల్ జిల్లా కలెక్టరు గారికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించి, కోట భూములను పరిరక్షించటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమణలు, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను నియంత్రించడంలో ASIకి చట్టపరమైన అడ్డంకులను సృష్టిస్తున్నందున, కోట భూములను ప్రభుత్వ భూమికి బదులుగా ASI ఆస్తిగా నమోదు చేయడం ద్వారా రెవెన్యూ రికార్డులను గుర్తించి సరిచేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థించారు.
అనధికార నిర్మాణాలను వెంటనే తొలగించాలని, ఆక్రమణదారుల తొలగింపు, రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని, చట్ట ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి ASIకి పూర్తి సహకారాన్ని అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
