Artificial Lungs: కృత్రిమ ఊపిరితిత్తులు వస్తున్నాయ్.. IIT హైదరాబాద్‌లో పరిశోధనలు షురూ!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో జట్టు కడుతూ వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ తో కలిసి సంయుక్తంగా కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి పరిశోధనలు చేపడుతోంది. అందులో భాగంగా బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను..

హైదరాబాద్, జనవరి 7: వైద్య రంగంలో కీలక పరిశోధనలపై ఐఐటీ హైదరాబాద్ దృష్టి సారించింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో జట్టు కడుతూ వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ తో కలిసి సంయుక్తంగా కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి పరిశోధనలు చేపడుతోంది. అందులో భాగంగా బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వ్యాధుల చికిత్స, అవయవ మార్పిడి ఎంతో ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సక్సెస్ రేటూ తక్కువే.
కరోనా వంటి మహమ్మారి సమయంలోనూ ఊపిరితిత్తుల వ్యాధులు, చికిత్స కీలకంగా మారింది. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు ఉపశమనం కలిగించేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలపై దృష్టి సారించింది. జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ తో కలిసి సంయుక్తంగా ‘కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి పరిశోధనలు ప్రారంభించింది. బుధవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో రెండు సంస్థలు సంయుక్తంగా బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఆధునిక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. పద్మవిభూషణ్, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు.
ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు జర్మనీకి చెందిన వెర్నర్ సీగర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నేతృత్వంలో పరిశోధనలు సాగనున్నాయి. ఇప్పటికే దేశంలో పలు చోట్ల పరిశోధన కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రసిద్ధ సంస్థలతో ఏర్పాటవుతున్న పరిశోధన కేంద్రం ఐఐటీ హైదరాబాద్ మాత్రమే. ఇండో- జర్మన్ బయో ఇంజినీరింగ్ ఎక్సలెన్స్ ద్వారా వ్యాధులపై పరిశోధన, చికిత్స విధానాలను మార్చడం, వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సాగనున్నాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




