PM Narendra Modi: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. మూడు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
PM Modi Hyderabad Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్ రానున్నారు. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో శనివారం, ఆదివారం జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ పాల్గొననున్నారు.
PM Modi Hyderabad Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్ రానున్నారు. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో శనివారం, ఆదివారం జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అదేవిధంగా నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న మోడీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 28 నుంచి 30 గంటల పాటు సాగనున్న మోడీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు పోలీసులు. హెచ్‌ఐసీసీ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హెచ్‌ఐసీసీకి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్, నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 4 రోజుల పాటు పూర్తిగా పోలీసుల నిఘాలో హెచ్‌ఐసీసీ ఉండనుంది.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా..
కాగా జూలై 2 శనివారం మధ్యాహ్నం 12 .45 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ హైదరాబాద్ కు బయలుదేరుతారు. 2.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మాదాపూర్ హెచ్ఐసీసీకి వెళతారు. 3. 20 గంటలకు నోవాటెల్ కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. రాత్రి 9 గంటల వరకు సమావేశంలోనే ఉండనున్నారు మోడీ. ఇక జూలై 3 ( ఆదివారం) ఉదయం 10 గంటలకు సమావేశాలకు హాజరవుతారు. సాయంత్రం 4.30 వరకు సమావేశాల్లోనే ఉంటారు. పలు అంశాలపై కార్యవర్గ సభ్యులకు మోడీ దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత హోటల్ కు వెళతారు. కాసేపు విరామం తర్వాత పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు సాయంత్రం 5:55 గంటలకు హెచ్ఐసీసీ నుంచి బయలుదేరుతారు. 6.30 పరేడ్ గ్రౌండ్స్ సభకు చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 వరకు సభలో ఉంటారు. అక్కడ ప్రజలు, కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఇక జులై 4న ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు మోడీ. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్తారు. కాగా భద్రత కారణాలతో మోడీ పర్యటనలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఆరోజు రాజ్‌భవన్‌లోనే బస..
కాగా జులై 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత రాజ్‌భవన్‌లోనే ప్రధాని బస చేయనున్నట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈమేరకు రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హెచ్‌ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4వేల మంది, పేరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారన్నారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టార్ ఇంఛార్జ్ లుగా నియమించామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..