BJP National Executive Meet Day 1 Highlights: ముగిసిన తొలి రోజు బీజేపీ కార్యవర్గ సమావేశం.. పలు తీర్మానాలు ఆమోదం..

|

Updated on: Jul 02, 2022 | 9:34 PM

PM Modi, Amit Shah in Hyderabad Live Updates: నేటినుంచి రెండు రోజులపాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలకు గాను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన మోదీ, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీ వెళ్లారు..

BJP National Executive Meet Day 1 Highlights: ముగిసిన తొలి రోజు బీజేపీ కార్యవర్గ సమావేశం.. పలు తీర్మానాలు ఆమోదం..
Narendra Modi

PM Modi, Amit Shah in Hyderabad: హైదరాబాద్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో తొలి రోజు ముగిసింది. ఈ సమావేశాలకు దేశ నలుమూలల నుంచి పార్టీ అగ్ర శ్రేణి నాయకులంతా తరలివచ్చారు. సమావేశంలో భాగంగా పార్టీ పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక, పేదల సంక్షేమంపై రూపొందించిన తీర్మానాన్ని ఆమోదించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా.. పీయూష్ గోయల్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మద్దతు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.

అలాగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించినట్లు సమాచారం. కార్యవర్గ సమావేశాల ఏర్పాటుపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. సమావేశం అనంతరం మోదీ, అమిత్‌షా, నడ్డాతో బండి సంజయ్‌, లక్ష్మణ్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో జరుగుతోన్నరాజకీయాలపై జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 02 Jul 2022 09:22 PM (IST)

  ముగిసిన తొలి రోజు సమావేశం..

  బీజేపీ కార్యవర్గ సమావేశం తొలి రోజు ముగిసింది. ‘రాజకీయ తీర్మానం’ ఆమోదం పొందింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఆదివారం రెండో రోజు కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న విజయ సంకల్ప సభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 • 02 Jul 2022 08:43 PM (IST)

  మొదటి తీర్మానం ఆమోదం..

  హైదరాబాద్‌లో జరుగుతోన్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆర్థిక, పేదల సంక్షేమంపై రూపొందించిన తీర్మానాన్ని ఆమోదించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా.. పీయూష్ గోయల్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మద్దతు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని పేద ప్రజల అవసరాలు తీర్చడమే భాజపా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేశంలోని పేదలను దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వ ప్రతి నిర్ణయం తీసుకుంటోంది’ అని తెలిపారు.

 • 02 Jul 2022 07:28 PM (IST)

  తెరాసపై బండి సంజయ్‌ ఫైర్‌..

  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ విచ్చలవిడితనంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. తెరాస నేతలు అత్యాచారాలు, దందాలు, డ్రగ్స్‌ దందాకు పాల్పడుతున్నారన్నారు. 'కేసీఆర్‌కు దమ్ముంటే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. మీ ఎమ్మెల్యేలు ఉంటారో, పోతారో ముందు చూసుకో. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటిలేటర్‌పైన ఉంది' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

 • 02 Jul 2022 07:01 PM (IST)

  కుటుంబ పార్టీని పారదోలుతాం.. బీజీపీ తెలంగాణ ట్వీట్‌

  తెలంగాణలో కుటంబ పార్టీలను, రాచరిక పాలను పారదోలుతామని బీజేపీ తెలంగాణ శాఖ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలుకుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం స్థానికంగా సాగుతోన్న రాచరిక పాలనకు అంతం పలుకుతామని ట్వీట్ చేశారు.

 • 02 Jul 2022 06:27 PM (IST)

  పార్టీ సభ్యులతో...

  బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

 • 02 Jul 2022 06:07 PM (IST)

  వ్యాక్సినేషన్‌లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం: స్మృతి ఇరానీ

  వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ తెలిపారు. హెచ్‌ఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ.. 'పేదల అభ్యున్నతికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. కోవిడ్‌ సంక్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కున్నాం. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ సిద్ధాంతాలను బీజేపీ పాటిస్తోంది. కార్యకర్తల త్యాగాలను సమావేశంలో గుర్తుచేసుకున్నాము' అని చెప్పుకొచ్చారు.

 • 02 Jul 2022 05:36 PM (IST)

  ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. .

  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ట్వీట్ చేశారు. 'ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందని. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది' అంటూ రాసుకొచ్చారు.

 • 02 Jul 2022 05:07 PM (IST)

  తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా కార్యవర్గ సమావేశ ప్రాంగణం..

  హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ స్థలిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలను వ్యక్తులను పలు ప్రాంగణాలకు నామకరణం చేశారు. ఇందులో భాగంగా.. హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ ప్రదేశానికి శాతవాహన నగరంగా, సమావేశ నగరానికి కాకతీయ నగరంగా నామకరణం చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మగా, మీడియా హాల్‌కు షోయబ్‌ బుల్లాఖాన్‌ హాల్‌ అని, అతిథులు బస చేసే ప్రాంగణాలకు సమ్మకసారలమ్మ నిలయంగా నామకరణం చేశారు.

 • 02 Jul 2022 04:41 PM (IST)

  కొనసాగుతోన్న బీజేపీ కార్యవర్గ సమావేశం..

  మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్‌ వీడియో ఇక్కడ చూడండి..

 • 02 Jul 2022 04:22 PM (IST)

  ఆరు నెలల్లో ఇది మూడోసారి..

  Modi

  ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. కానీ, ప్రోటోకాల్ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం కేసీఆర్ స్వాగతం పలకట్లేదు. గత ఆరు నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ స్వాగతం పలకకపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

 • 02 Jul 2022 04:16 PM (IST)

  కార్యవర్త సమావేశానికి హాజరైన నరేంద్ర మోదీ..

  హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన మోదీ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

 • 02 Jul 2022 03:46 PM (IST)

  దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తాం: వసుందర రాజే

  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు వసుందర రాజే అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్దంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బూత్ కు 200 వందల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, కార్యకర్తలను సిద్దం చేయడం పై రాష్ట్ర శాఖ దృష్టి పెట్టాలని తెలిపారు. తెలంగాణ పై సమావేశం తర్వాత ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తామని తెలిపిన వసుందర రాజే.. దేశంలో అన్నీ రాష్ట్రాల్లో విస్తరించాలని అనుకుంటున్నామని, ఉత్తరంలో సీట్లు తగ్గుతాయని దక్షిణాది పై దృష్టి పెట్టమనడం సరికాదని తెలిపారు.

 • 02 Jul 2022 03:33 PM (IST)

  'డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌ చేరుకున్నాను'.. ప్రధాన నరేంద్ర మోదీ ట్వీట్‌..

  హైదరాబాద్‌ చేరుకున్న నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గవర్నర్‌ తమిళసైతో పాటు ఇతర బీజేపీ నాయకులు ఆహ్వానానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. 'డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం' అని రాసుకొచ్చారు.

 • 02 Jul 2022 03:14 PM (IST)

  బేగంపేట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ...

  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. ముందు షెడ్యుల్‌ కంటే మోదీ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. కాసేపట్లో మోదీ హెచ్‌ఐసీసీకి చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోదీకి స్వాగతం పలికేందుకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 'ప్రధాని వారి నేషనల్ కమిటీ మీటింగ్ వెళ్లారు. ప్రొటోకాల్ లో కచ్చితంగా ముఖ్యమంత్రి రావాలని ఏం లేదు. క్యాబినేట్ లో ఉన్న మంత్రి వెళితే చాలు' అని మంత్రి తెలిపారు.

 • 02 Jul 2022 03:11 PM (IST)

  టీఆర్‌ఎస్‌ ప్రజాధనాన్ని వృథా చేస్తోంది: కిషన్‌ రెడ్డి

  బీజేపీకి పోటీగా టీఆర్‌ఎస్‌ సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పాలనను కూకటివేళ్లతో కూల్చే సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాల ప్రాంగణంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

 • 02 Jul 2022 02:51 PM (IST)

  హెచ్ఐసీసీ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

  కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీకి చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

  అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ పార్టీ సీనియర్ నేతలు మీనాక్షి లేఖి, పంకజ్ ముండే తదితరులు హెచ్ఐసీసీకి చేరుకున్నారు.

 • 02 Jul 2022 02:50 PM (IST)

  తెలంగాణపై ప్రత్యేక ప్రకటన.. వసుంధర రాజే

  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణపై ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే తెలిపారు.

 • 02 Jul 2022 02:50 PM (IST)

  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుంది: ఖుష్బూ

  తెలంగాణలో 2023లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఖుష్బూ అన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, తెలంగాణలో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.

 • 02 Jul 2022 02:46 PM (IST)

  హెచ్‌ఐసీసీకి చేరుకున్న అమిత్‌షా..

  హైదరాబాద్‌లో జరుగుతోన్న బీజేపీ కార్యవర్గ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కాసేపటి క్రితమే హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా కలిసి వస్తారని చర్చ జరిగినప్పటికీ అమిత్‌షా ముందుగా చేరుకున్నారు.

 • 02 Jul 2022 02:44 PM (IST)

  బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు.. మరోసారి SPG ట్రయల్ రన్

  ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కానున్నారు. మోదీని చూసేందుకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు విమానాశ్రయ పరిసర ప్రాంతాలకు తరలివస్తున్నారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉండగా వాతావరణంలో మార్పులు రావడంతో ఎస్పీజీ అలెర్ట్ అయ్యింది. మరోసారి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెచ్ఐసీసీ వరకు ఎస్పీజీ ట్రయల్ రన్ నిర్వహించింది. వాతావరణం అనుకూలంగా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెచ్ఐసీసీ చేరుకోనున్నారు. ఆ మేరకు బేగంపేట నుంచి హెచ్ఐసీసీ వరకు ఎస్పీజీ ట్రయల్ రన్ నిర్వహించింది.

 • 02 Jul 2022 02:37 PM (IST)

  కాసేపట్లో బేగంపేట్‌కు మోదీ..

  బీజేపీ జాతీయ కార్యవర్త సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌కి చేరుకుంటారు. అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఎస్పీజీ కమాండర్లు ఇప్పటికే ట్రాయల్ రన్ ను నిర్వహించారు. మోదీని ఆహ్వనించడానికి గవర్నర్ తమిళసై, తెలంగాణ బీజేపీ అధ్యకుడు బండి సంజయ్ బేగంపేట్ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బీజేపీ కార్యవర్త సమావేశాల్లో మోదీ పాల్గొంటారు.

 • 02 Jul 2022 01:49 PM (IST)

  హెచ్ఐసీసీ నోవాటెల్ ముట్టడికి కాంగ్రెస్ నాయకుల ప్రయత్నం..

  హెచ్ఐసీసీ నోవాటెల్ ముట్టడికి కాంగ్రెస్ నాయకుల ప్రయత్నం

  తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి అరెస్ట్

  అమిత్ షా వచ్చే సమయంలో అడ్డుకోవడానికి సన్నాహం చేసిన యూత్ కాంగ్రెస్

  ముందస్తుగానే గుర్తించి నోవా హోటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు

 • 02 Jul 2022 12:46 PM (IST)

  వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం.. ఖుష్బూ

  దేశంలోని పలు రాష్ట్రాల్లో, తెలంగాణలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ నాయకురాలు ఖుష్బూ పేర్కొన్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఖుష్బూ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ ఆమె ధీమా వ్యక్తంచేశారు.

 • 02 Jul 2022 12:42 PM (IST)

  టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుంది: అనురాగ్ ఠాకూర్

  2.50 లక్షల కోట్లు అప్పులు చేసి.. కుటుంబానికి తరలించారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

 • 02 Jul 2022 12:32 PM (IST)

  కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ నిరసన

  ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ నిరసన వ్యక్తంచేశారు. ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కట్టిన బీజేపీ, టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అంజన్ కుమార్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 • 02 Jul 2022 12:18 PM (IST)

  తెలంగాణలో 100 శాతం అధికారంలోకి వస్తాం.. అనురాగ్ ఠాకూర్

  తెలంగాణలో 100 శాతం అధికారంలోకి వస్తామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని.. మహిళలకు భధ్రత లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల తరువాత కేసీఆర్ విహారయాత్ర చేసుకోవచ్చని ఎద్దెవా చేశారు.

 • 02 Jul 2022 11:48 AM (IST)

  బేగంపేట చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి భారీ భద్రత మధ్య హెచ్ఐసీసీకి చేరుకోనున్నారు.

 • 02 Jul 2022 11:28 AM (IST)

  2023లో తెలంగాణలో అధికారం బీజేపీదే.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్

  2023లో తెలంగాణాలో 100 శాతం బీజేపీ అదికారంలోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షిణించాయని, ఇది సీఎం కెసిఆర్ కు సిగ్గు చేటుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు తగిన భద్రత లేకుండా పోయిందన్నారు. సంపన్న రాష్టం ఎందుకు అప్పుల పాలయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బులు ఎక్కడకు వెళ్లాయో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును యూపీఏ సర్కారు మిస్ మ్యానేజ్ చేసినా.. బీజేపీ సహకరించిందన్నారు. కేసీఆర్ నేషనల్ పార్టీ యోచన.. గతంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల చేసినట్లు ఉంటుందంటూ అనురాగ్ ఠాగూర్ ఎద్దేవా చేశారు.

 • 02 Jul 2022 11:20 AM (IST)

  చార్మినార్ దగ్గర కొనసాగుతున్న హై సెక్యూరిటీ

  హైదరాబాద్ పాతబస్తీ‌లోని చరిత్రాత్మిక చార్మినార్ వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పటు చేశారు. బీజేపీ నేతలు వచ్చి భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. వీరి  రాకతో ఛార్మినార్ పరిసర ప్రాంతాలలో పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. 500 మందికి పైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాలుపంచుకుంటున్నారు.

 • 02 Jul 2022 11:19 AM (IST)

  ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.. కిషన్ రెడ్డి

  తెలంగాణలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగడం సంతోషకరమని.. ప్రజలంతా దీనికోసం ఎదురుచూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏడాది, రెండళ్లకు ఈ సమావేశాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్‌లో జరగడం మంచి పరిణామమని తెలిపారు.

 • 02 Jul 2022 11:17 AM (IST)

  కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  కొడుకు (కేటీఆర్) సీఎం కాలేడనే నిరాశతోనే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలకడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ వల్ల సీఎం కేసీఆర్‌కు కొడుకు సీఎం కాడనే భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రజల డబ్బులతో హైదరాబాద్‌లో హోర్డింగులు పెట్టారని ఆరోపించారు. దిగజారే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబ పార్టీ ఎంఐఎంతో కలిసి దిగజారే రాజకీయాలు చేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

 • 02 Jul 2022 11:10 AM (IST)

  హైదరాబాద్‌లో ప్రధాని మోదీ టూర్ వివరాలు..

  హైదరాబాద్‌లో కాషాయ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ తమిళిసై , సీఎస్ సోమేశ్ కుమార్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు.

  ప్రధాని మోదీ ఢిల్లీలో 12 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3 గంటల 20నిమిషాలకు హెచ్‌ఐసీసీకి వెళ్తారు. సాయంతం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.

  ఇక మరుసటి రోజు(3 జులై) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సమావేశాలకు హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు హైటెక్స్‌కు చేరుకుంటారు. 6 గంటల 15 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆరున్నర గంటలకు రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌ సభకు చేరుకుంటారు. బీజేపీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏడున్నర గంటల వరకు సభలోనే ఉంటారు మోదీ.

 • 02 Jul 2022 10:56 AM (IST)

  హై సెక్యూరిటీ జోన్‌గా బేగంపేట ఎయిర్‌పోర్టు..

  బేగంపేట హైసెక్యూరిటీ జోన్‌గా మారింది. రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ర్యాలీలో సీఎం కేసీఆర్‌ పాల్గొనున్నారు. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రుల రాకతో బేగంపేట ఎయిర్‌పోర్టులో టైట్‌ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. వీవీఐపీల రాకతో ఎయిర్‌పోర్టులో భద్రతా బలగాలను మోహరించారు.

  • కాసేపట్లో బేగంపేటకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా
  • ఉదయం 11.35కి రాజ్‌నాథ్‌సింగ్‌ ల్యాండ్‌
  • 12.45కి బేగంపేటకి రానున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌
  • 2 గంటలకు రానున్న అమిత్‌ షా, శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, నితిన్‌ గడ్కరీ
  • మధ్యాహ్నం 3 తర్వాత రానున్న ప్రధాని మోదీ
 • 02 Jul 2022 10:42 AM (IST)

  హైదరాబాద్‌లో రోడ్డు మార్గాన మోడీ కాన్వాయ్..!

  హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోతే బేగంపేట నుంచి నోవాటెల్ కు రోడ్డు మార్గాన మోడీ కాన్వాయ్ వెళ్లే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎస్పీజీ నిన్నటి నుంచి నోవాటెల్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ వరకు మోడీ కాన్వాయ్ ట్రయల్ రన్స్ నిర్వహించింది..

 • 02 Jul 2022 10:13 AM (IST)

  బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం..

  హెచ్ఐసీసీలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ చీఫ్ నడ్డా అధ్యక్షతన ఆఫీస్ బారర్ల సమావేశం జరుగుతోంది. 148 మంది సభ్యులతో నడ్డా పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చిస్తున్నారు.

 • 02 Jul 2022 10:03 AM (IST)

  ప్లెక్సీల వార్‌లో చేతులెత్తేసిన GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్..

  హైదరాబాద్ నగరం ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఇటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు.. అటు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు భారీగా తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ఈ ప్లెక్సీల వార్‌లో GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ చేతులెత్తేసింది. పర్మిషన్స్ లేని చోట్ల తొలగించినా ఆ పార్టీల శ్రేణులు మళ్లీ బ్యానర్లు, ప్లెక్సీలను కడుతున్నాయి. నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఖైరతాబాద్, ప్రసాద్ ఐమాక్స్ రోడ్లలో తొలగించిన చోట టిఆర్ఎస్, బీజేపీ మళ్లీ బ్యానర్లు కడుతున్నాయి.

 • 02 Jul 2022 09:59 AM (IST)

  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ

  హైదరాబాద్‌లో ఎటు చూసినా బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓ రకంగా ఫ్లెక్సీ వార్ నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బ్యానర్లు, హోర్సింగ్స్ ఏర్పాటు చేశారు. అటు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న యస్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

  టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొన్న ఫెక్సీ వార్‌పై జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేతులెత్తేసింది. అనుమతి లేని చోట ఫ్లెక్సీలను తొలగించినా బ్యానర్లు, ఫ్లెక్సీలను మళ్లీ కడుతున్నారు. నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఖైరతాబాద్, ప్రసాద్ ఐమాక్స్ రోడ్లలో తొలగించిన చోట టిఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మళ్లీ బ్యానర్లు కట్టారు. దీంతో వీటిని తొలగించలేక జీహెచ్ఎంసీ అధికారులు చేతులెత్తేశారు.

 • 02 Jul 2022 09:59 AM (IST)

  ఈ మూడు అంశాలే ఎజెండాగా..

  ఎన్నికలు, పార్టీ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం.. ఈ మూడు అంశాలే ఎజెండాగా ఇవాళ్టి నుంచి బీజేపీ ప్రత్యేక టాస్క్‌ చేపడుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతోంది. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో కీలక తీర్మానాలు చేయనున్నారు. 2024 లోక్‌ సభ ఎన్నికలకు కార్యవర్గ సమావేశంలోనే రోడ్‌మ్యాప్‌ ప్రతిపాదించనున్నారు. బూత్‌లలో గెలుపు- పార్లమెంట్‌లో గెలుపు నినాదంతో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యచరణ రూపొందిస్తారు.

 • 02 Jul 2022 09:54 AM (IST)

  HICCలో సందడి..

  భాగ్యనగరంలో బీజేపీ నేతల సందడి నెలకొంది. HICCలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నడ్డా నేతృత్వంలో మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో HICCకి క్యూ కడుతున్నారు బీజేపీ ముఖ్య నాయకులు. రాత్రి 9వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

 • 02 Jul 2022 09:53 AM (IST)

  బేగంపేట విమానాశ్రయంలో భారీ భద్రత ఏర్పాటు..

  • బీజేపీ, టిఆర్ఎస్ తలపెట్టిన పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసుల హై అలర్ట్..
  • రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ర్యాలీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్..
  • ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు రానున్న నేపథ్యంలో పటిష్ట నిఘా ఏర్పాటు..
  • బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకు జరగనున్న యశ్వంత్ సిన్హా ర్యాలీ..
  • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు.
 • 02 Jul 2022 09:48 AM (IST)

  సీఎం యోగి చార్మినర్ పర్యటన రద్దు..

  నేడు చార్మినార్‎లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పర్యటన రద్దయింది. అనివార్య కారాణాల రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు యోగి హైదరాబాద్ చేరుకుంటారని వెల్లడించాయి. కాగా.. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా.. ఈ రోజు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ 1.30 నిమిషాలకు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కానీ చివరి నిమిషంలో పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 • 02 Jul 2022 09:24 AM (IST)

  పాసులు ఉన్నవారికే అనుమంతి..

  హైటెక్స్ సిటీలోని హెచ్ఐసీసీ, నోవాటెల్ వద్ద ఎస్పీజీ, సీఆర్పీఎప్, ఆక్టోపస్ బలగాలను మోహరించారు. మూడు ఎంట్రీల వద్ద డీసీసీ స్థాయి అధికారులను నియమించారు. పాసులు ఉన్నవారికే అనుమతించనున్నారు. ఆంక్షల నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇచ్చాయి.

 • 02 Jul 2022 09:21 AM (IST)

  ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’కి స్వాగతం: మంత్రి కేటీఆర్

  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో మరింత పొలిటికల్ హీట్‌ను పెంచాయి. బీజేపీ - టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందమైన హైదరాబాద్‌ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్‌ యూనివర్సిటీకి స్వాగతమంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ పేర్కొన్న కేటీఆర్.. ఇక్కడ ధమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దంటూ బీజేపీ నేతలకు సూచించారు.

 • 02 Jul 2022 09:04 AM (IST)

  చార్మినార్‎లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పర్యటన..

  నేడు చార్మినార్‎లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పర్యటన.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈరోజు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 1.30 నిమిషాలకు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించనున్నారు.

 • 02 Jul 2022 08:45 AM (IST)

  హెచ్ఐసీసీలోనే ప్రధాని మోడీ బస..

  మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఈరోజు హెచ్ఐసీసీలోనే బస చేయనున్నారు.

 • 02 Jul 2022 08:35 AM (IST)

  భారీ భద్రత..

  వీవీఐపీల హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట, ఖైరాతాబాద్, రాజ్‌భవన్, హెచ్ఐసీసీ తదితర ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది సిబ్బందిని మోహరించారు. పలువురు అగ్రనేతల బస నేపథ్యంలో వెస్ట్ ఇన్ హోటల్ చుట్టూ పోలీసులను మోహరించారు.

 • 02 Jul 2022 08:31 AM (IST)

  గులాబీ, కషాయ జెండాల రెపరెపలు.. 

  హైదరాబాద్ నగరంలో జెండాల వార్ మొదలైంది. బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీగా జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.

  Bjp

  Bjp

  Trs

  Trs

  Trs Bjp

  Trs Bjp

 • 02 Jul 2022 08:06 AM (IST)

  ఎస్పీజీ ఆధీనంలో హెచ్ఐసీసీ

  ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో ఎస్పీజీ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది. బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసిసిని ఎస్పీజీ సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

 • 02 Jul 2022 08:04 AM (IST)

  గులాబీ, కషాయ జెండాలతో నిండిపోయిన భాగ్యనగరం..

  హైదరాబాద్ నగరంలో జండాల వార్ మొదలైంది. బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీగా జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో జంక్షన్లలో జండాల వార్ కనిపిస్తోంది. ఈ జండాల యుద్దానికి కేంద్రంగా నక్లెస్ రోడ్ జంక్షన్ మారింది. ఓవైపు గులాబీ, మరోవైపు కాషాయం జండాలు, తోరణాలతో నెక్లెస్ రోడ్ నిండిపోయింది. కాగా.. నగరవ్యాప్తంగా ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ బీజేపీ కటౌట్లు ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హాకు సపోర్ట్ చేస్తూ టిఆర్ఎస్ ప్లెక్సీలు ఏర్పాటు చేశాయి గులాబీ శ్రేణులు..

 • 02 Jul 2022 07:59 AM (IST)

  ఓరుగల్లులో బీజేపీకి షాక్..

  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేల వరంగల్ లో బీజేపీకి షాక్ తగిలింది. ఇద్దరు బీజేపీ ముఖ్యనేతలు KTR సమక్షంలో TRSలో చేరారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు & రైల్వే బోర్డ్ మెంబర్ చింతాకుల సునీల్, 27వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. MLA నన్నపునేని నరేందర్ నేతృత్వంలో TRSలో చేరగా.. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యవర్గ సమావేశాల సమయంలో బీజేపీ ముఖ్యనేతలు trsలో చేరడంతో ఓరుగల్లులో చర్చనీయాంశంగా మారింది.

 • 02 Jul 2022 07:49 AM (IST)

  సమావేశాలను ప్రారంభించనున్న బీజేపీ చీఫ్ నడ్డా..

  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో శనివారం ఉదయం 10 గంటలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు.

 • 02 Jul 2022 07:41 AM (IST)

  భద్రతా వలయంలో చార్మినార్..

  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. సుమారు వేయి మందికి పైగా పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

 • 02 Jul 2022 07:40 AM (IST)

  యోగికి స్వాగతం పలికేందుకు తరలిరండి.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్

  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, భాగ్యలక్ష్మి ఆలయంలో జరిగే మహా హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పిలుపునిచ్చారు.

 • 02 Jul 2022 07:30 AM (IST)

  వేదికపై ముగ్గురు మాత్రమే..

  హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు 345 మందికి అవకాశం లభించింది. ఈ సమావేశాల్లో తెలంగాణకు చెందిన 14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు పాల్గొననున్నారు. అయితే ఈ ప్రధాన వేదికపై కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే ఆసీనులు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజ్యసభలో బీజేపీ పక్షనేత, కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌లు మాత్రమే వేదికపై కూర్చుంటారని నాయకులు పేర్కొన్నారు.

 • 02 Jul 2022 07:12 AM (IST)

  నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు..

  ప్రధాని మోడీ సహా, బీజేపీ అగ్రనేతల పర్యటన నేపథ్యంలో శనివారం, ఆదివారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

 • 02 Jul 2022 06:57 AM (IST)

  అంతటా కోలాహలం..

  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లో కోలాహలం నెలకొంది. కషాయ తొరణాలు, ఫ్లెక్సీలతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. సమావేశాలు జరిగే ప్రాంతంలో, నగరమంతటా భారీ హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో కాషాయమయం చేశారు.

 • 02 Jul 2022 06:51 AM (IST)

  ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని

  ప్రధాని మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు మధ్యాహ్నం 2.55 గంటలకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు.

 • 02 Jul 2022 06:40 AM (IST)

  భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్న సీఎం యోగి..

  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్నారు. భాగ్యలక్ష్మి మందిరంలో జరిగే మహా ఆరతిలో పాల్గొనేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీనేతలు ప్రకటన విడుదల చేశారు.

Published On - Jul 02,2022 6:35 AM

Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ