Hyderabad: చేసేది పోలీస్ జాబ్.. ఉన్నది మాత్రం దొంగబుద్ది.. ఇంతకీ ఈ మహానుభావుడు ఏం చేశాడంటే
హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారిన రూ.23 కోట్ల మోసం కేసులో కీలక నిందితుడు సతీష్ కస్టడీ నుంచి పరారైన ఘటన చుట్టూ వివాదం రేగింది. ఈ ఘటనపై పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గౌడ్‌ను గురువారం సస్పెండ్ చేశారు.

సతీష్ కుమార్(67) అనే వ్యక్తి, తన భార్య శిల్పా, కుమార్తెతో కలిసి హైప్రొఫైల్ మోసం కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిపై నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే అక్టోబర్ 23న మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు ట్రాన్సిట్‌లో ఉన్న సమయంలో సతీష్ పరారయ్యాడు. ఈ పరిణామంతో పోలీసులు అప్రమత్తమై, మొత్తం టాస్క్ ఫోర్స్ బృందాన్ని మళ్లీ నిందితుడి కోసం శోధనకు పంపారు. సతీష్ రూ.23 కోట్ల మోసానికి పాల్పడి, పలు పెట్టుబడిదారులను మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు నేతృత్వంలో బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ, కస్టడీలోనే సతీష్ తప్పించుకోవడంతో హైదరాబాద్ సీపీ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన కమిషనర్.. సస్పెండ్ అయిన ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షణలో నిర్లక్ష్యం జరిగిందని తేల్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు శోధనలు కొనసాగిస్తున్నాయి.
మహారాష్ట్ర నుంచి సదాశివపేటకి వచ్చిన తర్వాత ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ స్వయంగా నిందితుల వాహనంలో ట్రావెల్ చేశాడు. తన వెనుక ఉన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాహనానికి, ఎస్సై వాహనానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంది. డ్రైవర్‌తో పాటు నిందితుడు, కేవలం ఎస్ఐ మాత్రమే ప్రయాణించారు. ఇదే సమయంలో నిందితుడు ఎస్ఐకు లంచం ఆఫర్ చేశాడు. తాను ముందస్తు బయలు పిటిషన్ దాఖలు చేశానని అప్పటివరకు అరెస్టు చేయకుండా చూసుకుంటే రెండు కోట్లు ఇస్తానని చెప్పటంతో ఎస్సై డబ్బుకు ఆశపడి నిందితుడిని తప్పించాడు.
సదాశివపేట వద్ద ఒక దాబా దగ్గర ఆగి ఉన్న క్రమంలో అప్పటికే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి మరో కారులో దాబా వద్దకు రావాలని చెప్పాడు. దాబా వద్దకు రాగానే నిందితుడి కుటుంబ సభ్యులకు నిందితుడిని అప్పగించాడు ఎస్ఐ. మరోవైపు తన వెనుక వచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిందితుడు తప్పిపోయాడని ఎస్ఐ శ్రీకాంత్ డ్రామా ఆడాడు. దీంతో అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన సజ్జనార్.. శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.




