Hyderabad: కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి అండగా నగర పోలీసు యంత్రాంగం.. వివరాలు తెలుసుకోండి..
కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి అండగా నిలవనుంది భాగ్యనగర పోలీస్ యంత్రాంగం. ఇళ్లు కట్టుకునే సమయంలో డబ్బుల కోసం బెదిరిపంపులు వస్తున్నాయన్న కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు..
Hyderabad Police: సొంత ఇంటిని నిర్మించుకోవాలనేది అందరికి ఉండే సర్వసాధారణమైన కోరిక. భాగ్యనగరం వంటి అభివృద్ది చెందిన ప్రాంతాల్లో ఇల్లు ఉండాలనే ఆశ ఎవరికి మాత్రం కలగదు..? హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలనే కోరిక కేవలం తెలుగు రాష్ట్రాలవారికేే కాక చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఉండేదే. అందుకోసం కొందరు ఎంతో కాలంగా రూపాయి రూపాయి అంటూ కూడగట్టి మరీ తాము కట్టుకోబోయే ఇంటికి శంకుస్థాపన చేస్తారు. అప్పుడే వస్తారు కేటుగాళ్లు. ‘మీ ఇంటికి ఆ పర్మిషన్ లేదు. మీరు మాకు చెప్పకుండా ఎలా కడతారు..? ఆ డాక్యుమెంట్లు చూపించండి, ఈ పత్రాలు ఎక్కడ..? మా షేర్ ఎంత..?’ అంటూ డబ్బుల కోసం వేధిస్తుంటారు కొందరు మోసగాళ్లు. ‘డబ్బులు ఇవ్వకపోతే అధికారులకు చెప్పి మొత్తం కూల్చేయిస్తాం.. మేము అడిగినంత ఇస్తే సరే సరి. లేకపోతే అంతా సర్దేయాల్సిందే..’ అంటూ బెదిరిస్తుంటారు బ్లాక్‌మెయిలర్స్. ప్రస్తుత కాలంలో ఇలాంటి మోసగాళ్లు ఎక్కువైపోయారు. వీరికి భయపడే చాలా మంది సామాన్యలు ఇళ్లు కట్టుకోవడానికి భయపడి అద్దె ఇంటిలోనే జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి అండగా నిలవనుంది భాగ్యనగర పోలీస్ యంత్రాంగం. ఇళ్లు కట్టుకునే సమయంలో డబ్బుల కోసం బెదిరిపంపులు వస్తున్నాయన్న కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇళ్లు కట్టుకునేవారిని ఎవరు బెదిరించినా, నిర్మొహమాటంగా వారిపై ఫిర్యాదు చేయమని, వారి సంగతి తాము చూసుకుంటామని పోలీపు అధికారులు సామాన్య ప్రజలకు భరోసాను కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇళ్లు కట్టుకునే వారిని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లలో లేదా డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీసు వాట్సప్ నెంబర్ 9490616555 కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నగర ప్రజలకు సూచించారు.
హైదరాబాద్ నగరంలో ఇళ్లు కట్టుకునే వారిని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లలో, డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీసు వాట్సప్ నెంబర్ 9490616555 కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గారు నగర ప్రజలకు సూచించారు. pic.twitter.com/7c46EMPOqg
— Hyderabad City Police (@hydcitypolice) December 23, 2022
గృహ ప్రవేశాలు, వాణిజ్య వ్యాపార ప్రారంభోత్సవాల సందర్భంగా హిజ్రాలు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై ఫిర్యాదులు చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ వెనకాడవద్దని, టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక బృంధాల సిబ్బందితో బలవంతపు వసూళ్లు చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..