చరిత్రపుటల్లోకి జూబ్లీహిల్స్ నామినేషన్ల పర్వం.. ఎన్ని వచ్చాయో తెలుసా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందికి పైగా త్రిబుల్ ఆర్ బాధిత రైతులు నామినేషన్లు వేశారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు తమ ఆవేదన అర్థం కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే సరైన నిర్ణయంగా భావించారట. భూనిర్వాసితులు ఏకకాలంలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఒక సవాలుగా మారే ఛాన్స్ ఉంది.

వరదలా పారిన నామినేషన్లతో జూబ్లీహిల్స్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల నామినేషన్లు మూడే అయినా.. మిగతావన్నీ నిరసనల నుంచి పుట్టినవే కావడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ.. ఏంటీ నిరసనల నామినేషన్లు..? పోటెత్తిన నామినేషన్లతో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? అనేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చేందుకు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సహజమే. కానీ ఇటీవల కాలంలో ప్రజలు, రైతులు, ప్రజా సంఘాలు ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నాయి. మాస్ నామినేషన్స్ వ్యూహంతో తమ డిమాండ్లను జాతీయ దృష్టికి తీసుకువస్తున్నాయి. అసలు దేశంలో మాస్ నామినేషన్స్ వ్యూహం ఎక్కడ ప్రారంభమైంది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్దయెత్తున ముందుకు వచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి క్యాండిడేట్లు క్యూ కట్టారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్లు, రైతులు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు తరలిచ్చారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు గేటు లోపల ఉన్నవారికి ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేసి నామినేషన్లకు అవకాశం కల్పించారు. దీంతో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం అర్థరాత్రి వరకు కొనసాగగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211మంది నామినేషన్లు వేయగా.. 321 సెట్ల నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు వేసినవారిలో రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులే సుమారు 180మందికిపైగా ఉన్నారు. ట్రిపులార్‌తో భూములు కోల్పోతున్న బాధిత రైతులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దిగి నిరసన వ్యక్తం చేస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక.. ఇలాంటి నిరసన నామినేషన్లు దాఖలు అయినవి గతంలోనూ రెండు సందర్భాలు ఉన్నాయి. 1996లో నల్గొండ పార్లమెంటు స్థానానికి రికార్డ్ స్థాయిలో 531 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను పాలకులకు తెలియజేయడమే లక్ష్యంగా సుమారు 480 మంది బాధితులు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో నామినేషన్ల వేశారు. దశాబ్దాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉండడంతో వేలాదిమంది జీవచ్ఛావాలుగా మారుతున్నారు. ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగు, సాగునీరు అందించాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమ డిమాండ్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జలసాధన సమితి ఎన్నికలను వేదికగా చేసుకుంది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో జలసాధన సమితి మాస్ నామినేషన్స్ వ్యూహాన్ని తొలిసారిగా అమలు చేసింది. ఫ్లోరైడ్ బాధితులు, రైతులను, ఉద్యమ కార్యకర్తలను సమీకరించి 531 నామినేషన్లు వేయించింది.
ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ, విత్ డ్రా తర్వాత 480 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో 386 మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులతో పాటు 60 మంది మహిళలు పోటీలో నిలిచారు. మాస్ నామినేషన్స్‌తో అసాధారణంగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయడం ఎన్నికల సంఘానికి ఇబ్బందిగా మారింది. దీంతో నియోజకవర్గంలో ఈ ఎన్నికను ఎన్నికల సంఘం నెలరోజుల పాటు వాయిదా వేసింది.
480 మంది అభ్యర్థుల గుర్తులతో గతంలో ఎన్నడూ లేనంత భారీ సైజులో ఒక పుస్తకం ఆకారంలో బ్యాలెట్ పత్రం రూపొందించారు. భారీ సైజులో బ్యాలెట్ పేపర్ ఉండటంతో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా భారీ ఆకారంలో బ్యాలెట్ బాక్స్‌లను కూడా తయారు చేయించింది. పోలింగ్ నిర్వహణకు వేలాదిమంది సిబ్బందిని వినియోగించారు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఎన్నికల సంఘం నెల రోజుల తర్వాత 1996 మే 27న ఎన్నికలు నిర్వహించారు. 480 మంది అభ్యర్థులున్న బ్యాలెట్ పత్రంలో 313 వరుస సంఖ్యలో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షంకు కంకి-కొడవలి గుర్తు కేటాయించారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ పత్రాలన్నీ లెక్కించేందుకు రెండు రోజుల సమయం పట్టింది. చివరికి సిపిఐ అభ్యర్థి ధర్మ బిక్షంకు 2,77,336 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనా రెడ్డికి 2,05,579 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 477 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా ధర్మభిక్షం విజయం సాధించారు. జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను జాతీయ దృష్టికి తీసుకువెళ్లేందుకే మాస్ నామినేషన్స్ ను దాఖలు చేశామని అప్పటి ఇండిపెండెంట్ అభ్యర్థులు తెలిపారు.
ఇక.. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు పోటెత్తాయి. పసుపు బోర్డు సాధన అంశాన్ని ఢిల్లీ లెవల్లో హైలైట్ చేసేందుకు నిజామాబాద్ ఎంపీ స్థానానికి 179మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఫలితంగా.. ఈవీఎంలను వినియోగించలేక బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. ఎన్నికల తర్వాత రైతుల డిమాండ్ మేరకు పసుపు బోర్డు ఏర్పాటైంది. ఇప్పుడు.. రీజినల్ రింగు రోడ్డు బాధిత రైతులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేయడం సెగ పుట్టిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందికి పైగా త్రిబుల్ ఆర్ బాధిత రైతులు నామినేషన్లు వేశారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు తమ ఆవేదన అర్థం కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే సరైన నిర్ణయంగా భావించారట. భూనిర్వాసితులు ఏకకాలంలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఒక సవాలుగా మారే ఛాన్స్ ఉంది. రైతుల సమస్యపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. ఈ ఎన్నికను ఎన్నికల కమిషన్ ఎలా నిర్వహిస్తుందని దానిపై ఉత్కంఠగా ఉంది.
మాస్ నామినేషన్స్‌తో నల్లగొండ పార్లమెంటు స్థానానికి నిర్వహించిన ఈ ఎన్నిక జాతీయ స్థాయిలో చర్చకు, సంస్కరణలకు దారి తీసింది. తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు నల్లగొండ పార్లమెంటు స్థానం, కర్ణాటకలోని బెల్గాం, తూర్పు ఢిల్లీ అసెంబ్లీ స్థానాలకు మాస్ నామినేషన్స్ దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం సంస్కరణలు తీసుకువచ్చింది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో నామినేషన్ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్ పెంచింది.
ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని పరిగణలోకి తీసుకుని జాబితా ప్రకటిస్తారు. దీంతో.. ఉండేవెన్ని.. క్యాన్సిల్ అయ్యేదెన్ని అనేది తేలనుంది. అలాగే.. నామినేషన్ల విత్‌డ్రా గడువు ఎల్లుండి వరకు ఉండడంతో.. ఆ తర్వాత.. జూబ్లీ బైపోల్‌లో పోటీ చేసే ఫైనల్ క్యాండిడేట్లు ఎంతమంది అనేది క్లారిటీ రానుంది. ఏదేమైనా.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటెత్తిన నామినేషన్లతోనూ రికార్డ్‌లకు ఎక్కబోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




