AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?

ఆపదలో ఆదుకున్న వారిని దేవుడితో సమానం అంటారు. ముఖ్యంగా ఆర్థిక అవసరాలకు డబ్బులు ఇచ్చిన వారిని అభిమానిస్తుంటాం. అవసరం గట్టెక్కిన తర్వాత.. అప్పు మెల్లగా తీర్చుకోవచ్చని అందరూ భావిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఓడ ఎక్కేటప్పుడు ఓడ మల్లయ్య... ఓడ దిగిన తర్వాత బోడ మల్లయ్య అన్న చందంగా వ్యవహరిస్తుంటారు.

అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?
Suryapet Crime News
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 22, 2025 | 3:06 PM

Share

ఆపదలో ఆదుకున్న వారిని దేవుడితో సమానం అంటారు. ముఖ్యంగా ఆర్థిక అవసరాలకు డబ్బులు ఇచ్చిన వారిని అభిమానిస్తుంటాం. అవసరం గట్టెక్కిన తర్వాత.. అప్పు మెల్లగా తీర్చుకోవచ్చని అందరూ భావిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఓడ ఎక్కేటప్పుడు ఓడ మల్లయ్య… ఓడ దిగిన తర్వాత బోడ మల్లయ్య అన్న చందంగా వ్యవహరిస్తుంటారు. అయ్యో పాపం అని అవసరానికి డబ్బులు ఇచ్చింది ఓ వృద్ధురాలు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అనసూర్యమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. అదే కాలనీలో లింగం సతీష్ అనే వ్యక్తి కూడా కుటుంబంతో ఉంటున్నాడు. ఏడాది క్రితం తన అవసరాల కోసం వృద్ధురాలు అనసూర్యమ్మ నుండి 50 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అయితే సంవత్సరం దాటినా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో సతీష్ పై అనసూర్యమ్మ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అప్పు తీర్చే మార్గాన్ని సతీష్ కు కనిపించ లేదు. చివరకు వృద్ధురాలు అనసూయమ్మను అంతం చేయాలని భావించాడు.

అనసూర్యమ్మ ఒంటరిగా ఉండటం చూసి.. మైనర్ అయిన తన మేనల్లుడితో సతీష్ వృద్ధురాలు ఇంటికి వచ్చాడు. వృద్ధురాలు అనసూర్యమ్మ, సతీష్ కలిసి మద్యం సేవించారు. మద్యం తాగాక మత్తులోకి జారుకున్న అనసూర్యమ్మను గొంతు నులిమి సతీష్ హత్య చేశాడు. తర్వాత అప్పు పత్రాలతో పాటు వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యాడు. మృతురాలి వంటిపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి అప్పు పత్రం, రూ. 3.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సహకరించిన సతీష్ భార్య మౌనికను కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో హత్య, దొంగతనం కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఆపదలో ఆదుకున్న వృద్ధురాలిని అప్పు కోసం హత్య చేయడంతో స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..