Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రీ వెరిఫికేషన్ .. ఆందోళనలో ఆశావాహులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లక్షలాది మంది పేదలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2016 లో తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూం స్కీమ్ తీసుకొచ్చి గూడు లేని నిరుపేదలు లేకుండా చేస్తామని చెప్పింది. ఒక్క భాగ్యనగర పరిధిలోనే లక్ష ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది.

Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రీ వెరిఫికేషన్ .. ఆందోళనలో ఆశావాహులు
Buildings
Follow us
Vidyasagar Gunti

| Edited By: Aravind B

Updated on: Jul 12, 2023 | 4:18 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లక్షలాది మంది పేదలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2016 లో తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూం స్కీమ్ తీసుకొచ్చి గూడు లేని నిరుపేదలు లేకుండా చేస్తామని చెప్పింది. ఒక్క భాగ్యనగర పరిధిలోనే లక్ష ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణమే పూర్తి కాలేదు. అయినా వాటికి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. ఇటీవల కొల్లూరులో నిర్మించిన భారీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల టౌన్ షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించి 6 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల పట్టాలు అందజేశారు. కొల్లూరులో ఒక్క చోటే 15 వేలకు పైగా డబల్ బెడ్ రూం ఇళ్లు రెడీగా ఉన్నాయి. నగరంలో స్థలాభావం కారణంగా శివారులో ఇళ్లు నిర్మించి వాటిని కొందరికి ఇవ్వాలని ప్లాన్ చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక మాత్రం ఇంకా నత్తనడకన సాగుతోంది. ఎన్నికలు సమీస్తున్న వేళ ఇప్పటి వరకు నిర్మించిన 60 వేలకు పైగా ఇళ్లను పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు సిద్ధమవుతోంది.

జీహెచ్ఎంసీ పరిధిలో డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం మొత్తం 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో బల్దియా అధికారులు ఓ దఫా వెరిఫికేషన్ చేసి 3.5 లక్షల అప్లికేషన్లను ఫైనల్ చేశారు. అడ్రస్, ఆధార్, ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్ వంటి వివరాలను మూడున్నర లక్షల మంది నుంచి సేకరించారు. కాగా లక్ష ఇండ్లే పంపిణీ చేయలనుకోవడంతో మరోసారి ఈ అప్లికేషన్లను వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బల్దియా, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల కోసం సర్వే చేపట్టారు. అప్లై చేసుకున్న వారి వివరాలతో ప్రతి ఇంటికి రీ వెరిఫికేషన్ కోసం సిబ్బంది వెళుతున్నారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక యాప్‎లో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల అర్హతకు ఈ వివరాలు ఉండాల్సిందే. అవేంటంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డు ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటి అడ్రస్, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే సొంత ఇల్లు లేకపోవడం, గతంలో ఏ ఇళ్ల పథకాల్లో లబ్ధి పొందని పొందని వారు అర్హులు. అయితే ఇటీవల వెరిఫికేషన్ చేసిన అధికారులు నెలల వ్యవధిలోనే రెండోసారి వెరిఫికేషన్ చేస్తుండటంతో ఇళ్లు వస్తాయని భావించిన ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో అప్లికేషన్లు సగానికి సగం తగ్గాయి. మరోసారి వెరిఫై చేస్తే మరికొన్ని తగ్గొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డబల్ బెడ్ రూం లబ్ధిదారుల సర్వే కోసం 543 మంది బల్దియా, 162 మంది రెవెన్యూ సిబ్బంది పనిచేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 117 ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 49 బస్తీల్లో 9,828 ఇళ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇళ్లు కట్టాలని భావించింది. అయితే ఇందులో 111 చోట్ల 90 వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వీటిలో 65 వేల ఇళ్ల పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 24 ప్రాంతాల్లో పూర్తి చేసిన 4,500 ఇళ్లను అధికారులు లబ్ధిదారులకు అందజేశారు.

( విద్యాసాగర్, సీనియర్ కరస్పాండెంట్, టీవీ9 )