Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ నిలిపివేసింది. రష్యా అతి తక్కువ ధరకే మనకు చమురు అందిస్తోంది. ఇప్పుడు అది ఆగిపోవడంతో త్వరలో ధరలు పెరిగే అవకాశముంది.

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్‌లో భాగంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ సుంకాలను తగ్గించారు. ఇక భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లను భారీగా తగ్గించింది. దీంతో ఇరు దేశాలకు ప్రయోజనం జరగనుంది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా వస్తువులను ఎగుమతి చేసేవారికి ట్యాక్సులు తగ్గనున్నాయి. దీంతో పరిశ్రమలకు కూడా బెనిఫిట్ జరగనుంది. అయితే ఈ ఒప్పందంలోని ఓ నిబంధన వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదముందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. వాటి వివరాలేంటో చూద్దాం.
పెట్రోల్ ధరలు పెరుగుతాయా..?
రష్యా నుంచి భారత్ చమురు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. రష్యా తక్కువ ధరకే మనకు చమురు అందిస్తోంది. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ట్రంప్ కోరగా.. దీనికి భారత్ అంగీకరించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి అమెరికా, వెనిజులా నుంచి మాత్రమే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ట్రంప్ నిబంధన విధించారు. ఒకవేళ నిబంధన ఉల్లంఘించి రష్యా నుంచి కొంటే 25 శాతం సుంకం విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించాడు. దీనికి భారత్ ఆమోదం తెలపడంతో రష్యా నుంచి తక్కువ ధరకు లభించే చమురు ఆగిపోనుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ దాదాపు 85 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌కు రష్యా నుంచి ఎక్కువగా చమురు సరఫరా అవుతుంది. చమురు దిగుమతుల్లో భారత్ మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది.
తగ్గింపులు ఇప్పటికే ప్రారంభం
రష్యా నుంచి ఇప్పటికే చమురు కొనుగోలు చేయడం భారత్ తగ్గించింది. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్ లాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు వెనిజులా వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక రిలయన్స్ కూడా వెనిజులా నుంచి కొనుగోలు చేయడం కోసం ఆర్డర్ ఇచ్చింది. రష్యా భారతదేశానికి అత్యంత తక్కువ ధరకు చమురును అందిస్తోంది. గతంలో ఈ తగ్గింపు బ్యారెల్‌కు $7 నుండి $8 వరకు ఉండేది. కానీ ఇప్పుడు $11కి పెరిగింది. అమెరికా, వెనిజులా నుంచి కొంటే బ్యారెల్‌కు కనీసం $7 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఖర్చులు కూడా పెరగనున్నాయి. దీని వల్ల పెట్రోల్ దిగుమతి చేసుకునే కంపెనీలకు అదనపు ఖర్చు అవుతుంది. దీంతో పెట్రోల్ ధరలను పెంచి ప్రజలకు ఆయిల్ కంపెనీలు భారం మోపే అవకశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
