AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి..

కూతురు ఇతర మతస్థుడిని వివాహం చేసుకుంటే పుట్టింటి ఆస్తిపై హక్కులు కోల్పోతారా? తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై పిల్లలకు ఎంతవరకు హక్కు ఉంటుంది? ఇటీవల కేరళకు చెందిన ఎన్.ఎస్. శ్రీధరన్ కుటుంబ ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చింది. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి..
Supreme Court Property Rights Verdict
Krishna S
|

Updated on: Aug 10, 2026 | 7:35 PM

Share

తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని తన ఇష్టమొచ్చిన వారికి రాసివ్వచ్చా? వేరే మతం, కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఒక కుమార్తెకు ఆస్తి ఇవ్వకుండా తండ్రి రాసిన వీలునామా చెల్లుతుందా? అనే ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ద్వారా పూర్తి స్పష్టత ఇచ్చింది. కేరళకు చెందిన ఒక కుటుంబ ఆస్తి వివాదం విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కేరళకు చెందిన ఎన్.ఎస్. శ్రీధరన్ అనే వ్యక్తికి తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక కూతురు శైల జోసెఫ్ వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీనితో ఆగ్రహించిన తండ్రి, 1988లో ఒక వీలునామా రాశారు. ఆ వీలునామాలో.. ‘‘ఈ ఆస్తి నా తండ్రి నుంచి వచ్చిన పిత్రార్జితం కాదు. ఇది నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి. కాబట్టి నా కూతురు వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్నందున ఆమెకు నా ఆస్తిలో రూపాయి కూడా ఇవ్వడం లేదు’’ అని రాసి, మిగిలిన ఎనిమిది మంది పిల్లలకు ఆస్తిని పంచి ఇచ్చారు. తండ్రి మరణించిన తర్వాత, ఆ కుమార్తె ఆస్తిలో తనకు కూడా వాటా కావాలని కోర్టును ఆశ్రయించారు.

కోర్టులలో ఏం జరిగింది?

ఈ కేసును ముందుగా విచారించిన దిగువ కోర్టు, కేరళ హైకోర్టులు తండ్రి రాసిన వీలునామాను అంగీకరించలేదు. తొమ్మిది మంది పిల్లలకు ఆస్తిని సమానంగా పంచాలని కుమార్తెకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మిగతా సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ తండ్రి రాసిన వీలునామానే చెల్లుతుందని సంచలన తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఒక వ్యక్తి తన సొంత కష్టంతో సంపాదించిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలి? ఎవరిని తీసివేయాలి? అనేది పూర్తి ఆయన ఇష్టం. అందులో కోర్టులు వేలు పెట్టలేవు. తండ్రి వీలునామా రాసి ఉంచినప్పుడు, ఆయన మనోభావాలకు, కోరికలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక పిల్లవాడిని లేదా కుమార్తెను ఆస్తి నుంచి తీసివేయడానికి తండ్రి చెప్పిన కారణం ఏంటనే దానితో చట్టానికి సంబంధం లేదు. వీలునామా చట్టబద్ధంగా ఉంటే అది చెల్లుతుంది.

ఇవి కూడా చదవండి

సాధారణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన తేడా..

ఈ తీర్పు చూసి చాలామంది మతం మారి పెళ్లి చేసుకుంటే ఆస్తి రాదా? అని భయపడే అవకాశం ఉంది. కానీ చట్టంలో చిన్న తేడా ఉంది..

పిత్రార్జిత ఆస్తి: ఒకవేళ ఆస్తి తాతల కాలం నుంచి వస్తున్నది అయితే.. కూతురు ఏ మతం వారిని పెళ్లి చేసుకున్నా సరే ఆమెకు పుట్టుకతోనే సమాన వాటా పొందే హక్కు ఉంటుంది. దీన్ని తండ్రి కూడా వీలునామా రాసి ఆపలేడు.

తండ్రి కష్టపడి కొన్న ఆస్తి: ఇది తండ్రి సొంత సంపాదన కాబట్టి ఆయన వీలునామా రాయకుండా చనిపోతే పిల్లలందరికీ సమానంగా వస్తుంది. కానీ ఆయన వీలునామా రాసి ఒక్కరినే ఆస్తి నుంచి తీసేస్తే, చట్టప్రకారం ఆయన రాసిన వీలునామానే చెల్లుతుంది.

ఇతర మతస్థులను వివాహం చేసుకున్నంత మాత్రాన ఆస్తి హక్కులు పోవు. కానీ తండ్రి తన సొంత సంపాదనను ఎవరికీ ఇవ్వకూడదని స్పష్టంగా వీలునామా రాసి పెడితే మాత్రం, ఆస్తిపై తండ్రి నిర్ణయమే అంతిమం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Follow Us