RBI లోగోలో పులి, తాటి చెట్టు ఎందుకు ఉన్నాయి? దీని వెనుక ఇంత కథ ఉందా?
RBI Logo: ఒక అధికారిక లోగో రూపుదిద్దుకోవడం వెనుక ఎంతటి పరిశీలన, చర్చలు, మార్పులు జరిగాయో ఈ చరిత్ర తెలియజేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ డబుల్ మొహర్ నాణెంలోని సింహం, తాటి చెట్టు నమూనా నుంచి స్ఫూర్తి పొందిన RBI.. భారతీయతను ప్రతిబింబించేందుకు..

RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లోగోను ఎప్పుడైనా నిశితంగా గమనించారా? అందులో ఒక జంతువు, దాని వెనుక తాటి చెట్టు కనిపిస్తాయి. చాలామంది దానిని సింహంగా భావిస్తుంటారు. కానీ నిజానికి అది పులి. అసలు RBI లోగోలో పులినే ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఈ చిహ్నం రూపకల్పనలో ఎలాంటి మార్పులు జరిగాయి? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఈస్ట్ ఇండియా కంపెనీ నాణెం నుంచి స్ఫూర్తి
1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన సమయంలో బ్యాంకు అధికారిక ముద్ర (Common Seal) ఎలా ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. ఈ ముద్రను కరెన్సీ నోట్లు, చెక్కులు, అధికారిక ప్రచురణలపై ఉపయోగించాలనుకున్నారు. అందుకోసం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను రూపొందించారు. బ్యాంకుకు ప్రభుత్వ సంస్థ హోదా ఉందనే భావన కనిపించాలి. అయితే అది ప్రభుత్వ చిహ్నంలా పూర్తిగా ఉండకూడదు. డిజైన్‌లో భారతీయత ప్రతిబింబించాలి. చూడటానికి సరళంగా, కళాత్మకంగా ఉండటంతో పాటు అధికారిక ముద్రకు తగినట్టుగా ఉండాలి. లెటర్‌హెడ్లు, ఇతర అధికారిక పత్రాలపై కూడా పెద్దగా మార్పులు చేయకుండా ఉపయోగించుకునేలా ఉండాలి. ఈ లక్ష్యంతో అప్పట్లో అందుబాటులో ఉన్న వివిధ ముద్రలు, పతకాలు, నాణేలను పరిశీలించారు. చివరకు ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిన డబుల్ మొహర్ బంగారు నాణెం డిజైన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో సింహం, తాటి చెట్టు బొమ్మలు ఉన్నాయి. RBI అధికారిక ముద్రకు ఆ నమూనా అనువుగా ఉంటుందని భావించారు.
సింహాన్ని తొలగించి పులిని ఎందుకు ఎంచుకున్నారు?
ఈస్ట్ ఇండియా కంపెనీ నాణెంలోని సింహం, తాటి చెట్టు నమూనాను అలాగే ఉపయోగించాలని తొలుత భావించినప్పటికీ, ఒక కీలకమైన మార్పు చేయాలని నిర్ణయించారు. అదే సింహం స్థానంలో పులిని ఉంచడం. దీనికి ప్రధాన కారణం భారతీయత. సింహం కంటే పులి భారతదేశానికి మరింత ప్రత్యేకమైన జంతువుగా అప్పట్లో పరిగణిస్తారు. అందుకే దేశీయతను ప్రతిబింబించేలా RBI లోగోలో సింహం స్థానంలో పులిని చేర్చాలని నిర్ణయించారు. అలా తాటి చెట్టు వెనుక పులి ఉన్న డిజైన్ రూపుదిద్దుకుంది.
1935 ఫిబ్రవరి 23న డిజైన్‌కు ఆమోదం
RBI వాటా ధ్రువపత్రాలపై ముద్రించాల్సిన అవసరం ఉండటంతో తొలుత ఈ డిజైన్ తయారీ బాధ్యతను మద్రాస్‌లోని ఒక సంస్థకు అప్పగించారు. 1935 ఫిబ్రవరి 23న జరిగిన RBI బోర్డు సమావేశంలో ఈ ముద్ర డిజైన్‌కు ఆమోదం లభించింది. అయితే పులి రూపం మరింత మెరుగ్గా ఉండాలని బోర్డు అభిప్రాయపడింది. అప్పటికే డిజైన్‌కు ఆమోదం లభించడంతో వెంటనే పెద్ద మార్పులు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఈ అంశాన్ని అప్పటి డిప్యూటీ గవర్నర్ సర్ జేమ్స్ టేలర్ అంతటితో వదిలేయలేదు.
అప్పటి డిప్యూటీ గవర్నర్ సర్ జేమ్స్ టేలర్ పులి రూపాన్ని మరింత సహజంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్త స్కెచ్‌లు రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం భారత ప్రభుత్వ మింట్, నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ సహకారం తీసుకున్నారు. మంచి డిజైన్ తయారు చేయడానికి కలకత్తాలోని బెల్వెడెరే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పులి విగ్రహాన్ని ఫొటో తీయించి, దానిని నమూనాగా ఉపయోగించాలని కూడా ఏర్పాటు చేశారు.
అయితే కొత్తగా తయారైన స్కెచ్‌లలో కొన్ని లోపాలు కనిపించాయి. ఒక డిజైన్‌లో పులి కుక్కలా కనిపిస్తోందని, మరొక డిజైన్‌లో పులి బాగున్నప్పటికీ తాటి చెట్టు ఆకృతి సరిగ్గా లేదని సర్ జేమ్స్ అభిప్రాయపడ్డారు. తాటి చెట్టు కాండం పొడవుగా ఉండటం, కొమ్మలు సన్నగా కనిపించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
చివరకు ఏం జరిగింది?
కొన్ని ప్రయత్నాల తర్వాత నాసిక్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మెరుగైన నమూనాలను సిద్ధం చేసింది. అయితే అప్పటికే ఉన్న బ్యాంకు అధికారిక ముద్రను మార్చకూడదని చివరకు నిర్ణయించారు. కొత్తగా రూపొందించిన మెరుగైన స్కెచ్‌లను మాత్రం RBI కరెన్సీ నోట్లు, లెటర్‌హెడ్లు, చెక్కులు, అధికారిక ప్రచురణలపై ఉపయోగించే చిహ్నంగా స్వీకరించారు.
RBI లోగో వెనుక అసలు కథ ఇదే..
ఒక అధికారిక లోగో రూపుదిద్దుకోవడం వెనుక ఎంతటి పరిశీలన, చర్చలు, మార్పులు జరిగాయో ఈ చరిత్ర తెలియజేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ డబుల్ మొహర్ నాణెంలోని సింహం, తాటి చెట్టు నమూనా నుంచి స్ఫూర్తి పొందిన RBI.. భారతీయతను ప్రతిబింబించేందుకు సింహం స్థానంలో పులిని ఎంచుకుంది. పులి రూపాన్ని మెరుగుపరిచేందుకు కూడా అప్పట్లో ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. అందుకే RBI లోగోలో కనిపించే పులి బొమ్మ కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు.. భారతీయతకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చారిత్రక చిహ్నం.
ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి 63 ఫైనాన్స్ కంపెనీల లైసెన్సుల రద్దు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




