మీకు తెలుసా.. షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్? 99శాతం మందికి తెలియదు..
షర్టు తొడుక్కునేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? మగవారి షర్టుకు బటన్లు కుడివైపున ఉంటే, ఆడవారి షర్టుకు మాత్రం ఎడమవైపున ఉంటాయి. రోజూ చూసే విషయమే అయినా.. దీని వెనుక శతాబ్దాల నాటి ఒక విచిత్రమైన చరిత్ర, సామాజిక ఆచారం దాగి ఉందని చాలామందికి తెలియదు. అసలు ఆడా, మగ షర్టులకు బటన్లు వేర్వేరు వైపులా ఎందుకు ఉంటాయి? అనేది తెలుసుకుందాం..

మగవారు, ఆడవారు వేసుకునే షర్టులకు బటన్లు వేర్వేరు వైపులా ఉంటాయనే విషయం చాలామంది గమనించే ఉంటారు. సాధారణంగా పురుషుల షర్టులకు బటన్లు కుడి వైపునఉంటే, మహిళల షర్టులకు మాత్రం ఎడమ వైపున ఉంటాయి. ఇది కేవలం ఏదో సాధారణ ఫ్యాషన్ డిజైన్ అనుకుంటే పొరపాటే. దీని వెనుక శతాబ్దాల నాటి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పురుషులు, మహిళల బటన్ల అమరికలో ఈ తేడా ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం.. ఐరోపాలో అనేక శతాబ్దాల క్రితం షర్టులకు బటన్లు ఉండటం అనేది కేవలం ధనవంతులు, ఉన్నత వర్గాల ఇళ్లలోనే కనిపించేది. ఆ కాలంలో ఉన్నత వర్గానికి చెందిన మహిళలకు దుస్తులు వేయడానికి పనిమనుషులు ఉండేవారు. సహజంగా ప్రపంచంలో మెజారిటీ ప్రజలు కుడిచేతి వాటంకలిగి ఉంటారు. ఒక మహిళకు ఎదురుగా నిలబడి దుస్తులు తొడిగే పనిమనిషికి.. బటన్లు ఎడమవైపు ఉంటే బటన్లు పెట్టడం లేదా తీయడం చాలా సులువుగా ఉండేది. ఆ పాతకాలపు ఆచారమే నేటికీ మహిళల దుస్తుల్లో కొనసాగుతోంది.
యుద్ధాలు.. కత్తుల వాడకం..
పురుషుల షర్టులకు కుడివైపున బటన్లు ఉండటానికి నాటి యుద్ధ తంత్రాలు ప్రధాన కారణమని చెబుతారు. ఆ కాలంలో పురుషులు తమ కుడిచేతితో కత్తులు, తుపాకులు లేదా ఇతర ఆయుధాలను పట్టుకునేవారు. ఒకవేళ శత్రువు దాడి చేస్తే, ఎడమచేతితో షర్టును పక్కకు జరిపి, కుడిచేతితో లోపల ఉన్న కత్తిని క్షణాల్లో బయటకు తీయడానికి షర్టు బటన్లు కుడివైపున ఉండటం ఎంతో అనుకూలంగా ఉండేది.
పిల్లలకు పాలు పట్టే వెసులుబాటు..
మహిళల బటన్ల అమరిక వెనుక మరొక ప్రసిద్ధ సిద్ధాంతం కూడా ఉంది. సాధారణంగా తల్లులు తమ పసిపిల్లలను ఎడమ చేతితో అడిస్తూ, కుడిచేతిని ఫ్రీగా ఉంచుకుంటారు. ఈ సమయంలో పిల్లలకు పాలు పట్టేందుకు ఎడమవైపు ఉన్న బటన్లను కుడిచేతితో సులువుగా తీయడానికి ఈ డిజైన్ తోడ్పడేదని అంటుంటారు.
మారిన కాలం.. మారని సాంప్రదాయం..
ఈ కారణాల్లో ఏది నూటికి నూరు శాతం నిజమనే దానికి పక్కా చారిత్రక ఆధారాలు లేనప్పటికీ, పనిమనుషులు దుస్తులు తొడిగే సిద్ధాంతాన్నే అత్యధిక మంది చరిత్రకారులు అంగీకరిస్తారు. కాలక్రమేణా సామాజిక పరిస్థితులు, జీవనశైలి పూర్తిగా మారిపోయినప్పటికీ.. ఆనాటి ఐరోపా ఫ్యాషన్ డిజైనింగ్ సాంప్రదాయం మాత్రం ఈనాటికీ ఆటోమేటిక్ గా కొనసాగుతూనే వస్తుంది.
