AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ హీరోయిన్‌తో 20 సినిమాలు చేసినా.. ఒక్క మాట మాట్లాడని కృష్ణ.. ఫోన్‌ చేస్తే నో చెప్పేసిందట

సూపర్ స్టార్ కృష్ణ, అలనాటి నటి వాణిశ్రీ 20 చిత్రాల్లో కలిసి నటించినా, ఎప్పుడూ మాట్లాడుకోలేదట. వారి మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా.. ఈ మౌనం కొనసాగిందట. 30 ఏళ్ల తర్వాత కృష్ణ ఒక సినిమా కోసం ఫోన్ చేసినా, వాణిశ్రీ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు.

Tollywood: ఆ హీరోయిన్‌తో 20 సినిమాలు చేసినా.. ఒక్క మాట మాట్లాడని కృష్ణ.. ఫోన్‌ చేస్తే నో చెప్పేసిందట
Superstar Krishna
Ravi Kiran
|

Updated on: Feb 09, 2026 | 9:49 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ, అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీల మధ్య కొనసాగిన మౌనం తెలుగు ఇండస్ట్రీలోనే ఓ ఆసక్తికరమైన అంశం. వీరిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించినా, ఏ రోజు కూడా మాట్లాడుకోలేదని నటి వాణిశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కృష్ణ లోపల ఏదీ దాచుకోకుండా మొహం మీదనే అనేస్తారనే ఇండస్ట్రీలో పేరుంది. ఆయనతో పనిచేసిన చాలామంది ఈ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. తన సినిమా పరాజయం పాలైనా ఓపెన్‌గా చెబుతారని, ఎటువంటి గొడవనైనా అప్పటికప్పుడు పరిష్కరిస్తారని పేరున్న కృష్ణ, వాణిశ్రీ విషయంలో మాత్రం మౌనం పాటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వాణిశ్రీ అప్పట్లో సావిత్రి తర్వాత తెలుగు ఇండస్ట్రీను ఏలిన నటీమణులలో ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి అగ్ర తారలతో ఆమె పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. కృష్ణ-వాణిశ్రీ కాంబినేషన్‌లో 20కి పైగా సినిమాలు వచ్చాయి. మహాబలుడు, మరుపురాని కథ, కన్నె మనసులు, జగత్ కిలాడీలు, చీకటి వెలుగులు, స్త్రీ జన్మ, అసాధ్యుడు, పచ్చని సంసారం లాంటి అనేక విజయవంతమైన చిత్రాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాణిశ్రీ మాట్లాడుతూ.. కృష్ణతో తాను ఏనాడూ మాట్లాడలేదని తెలిపారు. కనీసం సెట్‌లో హాయ్, బై కూడా లేదన్నారు. “తనను ఆయన పట్టించుకునేవారు కాదు, తానూ ఆయన్ని పట్టించుకునేదాన్ని కాదు” అని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు, భేదాభిప్రాయాలు లేవని, అయినా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, కృష్ణంరాజు తన నటనను ప్రశంసించేవారని, కానీ ఏఎన్నార్, కృష్ణ ఎప్పుడూ తనను అభినందించలేదని వాణిశ్రీ చెప్పుకొచ్చారు. కృష్ణ చాలా మంచివారని, అందరినీ బాగా చూసుకుంటారని, వ్యక్తిగా గొప్ప మనిషని, కానీ తన విషయంలోనే ఆ గ్యాప్ ఎందుకు ఉందో తెలియదని అన్నారు.

సుమారు 30 ఏళ్ల తర్వాత కృష్ణ తనకు ఫోన్ చేసి, ఒక సినిమాలో నటించమని అడిగారట. ఆ సినిమాలో సవతి తల్లి పాత్రను, హీరోకు విషం ఇచ్చి చంపే నెగటివ్ రోల్‌ను ఆఫర్ చేశారు. ఆ సినిమా చూసిన తర్వాత, అలాంటి పాత్ర తనకు వద్దని వాణిశ్రీ మొహమాటం లేకుండా తిరస్కరించారు. మూడు నాలుగు సార్లు కృష్ణ అడిగినా, ఆమె “నో” చెప్పినట్లు తెలిపారు. “అలా ఆ ఒక్కసారి మాత్రమే తనతో కృష్ణ మాట్లాడారని, అది తప్ప ఇప్పటివరకు మాట్లాడుకోలేదని” వాణిశ్రీ వెల్లడించారు. వెంకటేష్ నటించిన అబ్బాయిగారు సినిమా తొలుత కృష్ణ దగ్గరికే వచ్చిందని, వాణిశ్రీ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా వెంకటేష్ దగ్గరికి వెళ్ళిందని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Follow Us