తల్లి మరణంతో అనాథైన 50 రోజుల పసిపాప.. కష్టకాలంలో స్నేహితుడికి పూర్వ విద్యార్థుల భరోసా!
"స్నేహం" అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు యువకులు. ఆపదలో ఉన్న మిత్రుడిని చూసి అయ్యో పాపం అని వదిలేయకుండా, మేమున్నామంటూ భరోసానిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తసంబంధం కంటే స్నేహమే గొప్పదని నిరూపిస్తూ వారు చేసిన సాయం అందరినీ కలచివేస్తోంది.

“స్నేహం” అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు యువకులు. ఆపదలో ఉన్న మిత్రుడిని చూసి అయ్యో పాపం అని వదిలేయకుండా, మేమున్నామంటూ భరోసానిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తసంబంధం కంటే స్నేహమే గొప్పదని నిరూపిస్తూ వారు చేసిన సాయం అందరినీ కలచివేస్తోంది.
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు ఉన్నత పాఠశాలలో 2009-2010 విద్యా సంవత్సరంలో వీరంతా కలిసి చదువుకున్నారు. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యాక, జీవితంలో ఎవరి దారి వారు చూసుకుని వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కానీ, వారి మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదు. అదే గ్రామానికి చెందిన బాసాని హరీష్ కూడా ఆ బ్యాచ్ విద్యార్థే. హరీష్‌కు కీర్తి అనే యువతితో వివాహమైంది. వారి సంసారం సజావుగా సాగుతున్న సమయంలో, కీర్తి తీవ్ర అనారోగ్యానికి గురైంది.
తన భార్యను ప్రాణపాయం నుండి కాపాడుకోవడానికి హరీష్ చేయని ప్రయత్నం లేదు. లక్షలాది రూపాయలు ఖర్చు చేశాడు. చికిత్స కోసం తనకున్న పొలాన్ని కూడా అమ్మేశాడు. కానీ, విధి వెక్కిరించింది. పరిస్థితి విషమించి కీర్తి ఇటీవల మరణించింది. ఆ సమయంలో కీర్తికి కేవలం 50 రోజుల వయసున్న పసిపాప ఉంది. భార్యను కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయి, పసిపాపను ఎలా పెంచాలో తెలియక హరీష్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు.
తమ మిత్రుడికి కలిగిన కష్టాన్ని చూసి ఆ పూర్వ విద్యార్థులు చలించిపోయారు. తల్లి లేని ఆ పసిపాప భవిష్యత్తును తలచుకుని బాధపడ్డారు. మాటలతో ఊరడించడం కంటే చేతల్లో సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.మిత్రులంతా గ్రూపులుగా ఏర్పడి తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని సేకరించారు. అందరూ కలిసి లక్ష రూపాయలు పోగు చేశారు.ఆ మొత్తాన్ని ఆ పసిపాప పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
డిపాజిట్ చేసిన పత్రాలను హరీష్‌కు అందిస్తూ, నీకు మేమున్నామని ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవారే మొహం చాటేస్తున్న నేటి రోజుల్లో, చిన్ననాటి మిత్రులు చూపిన ఈ ఔదార్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. తోటి మిత్రుడి కుటుంబం రోడ్డున పడకుండా, ఆ చిన్నారి చదువుకు ఆసరాగా నిలిచిన ఈ స్నేహితుల బృందాన్ని గ్రామస్తులు వేనోళ్ల కొనియాడుతున్నారు.
స్నేహం అంటే కేవలం సరదాలు, ఆనందాలే కాదు.. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడటం అని ఈ అమ్మనబోలు పాఠశాల పూర్వ విద్యార్థులు నిరూపించారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిన ఈ మిత్రులు నిజమైన స్నేహానికి బ్రాండ్ అంబాసిడర్లు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
