బక్రీద్ ముందే వ్యాపారిని ‘బకరా’ చేశారు! మేకలు ‘ఒరిజినల్’.. ఇచ్చిన నోట్లు మాత్రం..!
బక్రీద్ పండుగకు ముందు ఒక దిగ్భ్రాంతికరమైన మోసపు కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని సూరత్ నగరంలో పండుగ సీజన్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని దారుణానికి ఒడిగట్టారు. కొందరు కేటుగాళ్లు నకిలీ కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి మేకల సంతను వేదికగా ఎంచుకున్నారు.

బక్రీద్ పండుగకు ముందు ఒక దిగ్భ్రాంతికరమైన మోసపు కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని సూరత్ నగరంలో పండుగ సీజన్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని దారుణానికి ఒడిగట్టారు. కొందరు కేటుగాళ్లు నకిలీ కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి మేకల సంతను వేదికగా ఎంచుకున్నారు. నకిలీ నోట్ల కట్టలను ఇచ్చి రెండు మేకలను కొనుగోలు చేసి, ఒక వ్యాపారిని ఘోరంగా ముంచేశారు. అలస్యంగా మోసాన్ని గ్రహించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజస్థాన్‌కు చెందిన భాన్వర్‌లాల్ జైచంద్ భగారియా అనే మేకల వ్యాపారి బక్రీద్ పండుగ వ్యాపారం కోసం సూరత్‌లోని పల్సానా టి-పాయింట్ ఓవర్‌బ్రిడ్జి కింద ఉన్న ‘బక్రా బందీ’ (మేకల సంత)కి వచ్చాడు. అక్కడ సూరత్‌లోని లింబాయత్ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు అతని వద్దకు వచ్చి రెండు మేకలను బేరం కుదుర్చుకున్నారు. ఒక్కో మేక ధర రూ. 25,000 చొప్పున మొత్తం 50,000 రూపాయలకు డీల్ కుదిరింది. నిందితులు ఆ వ్యాపారికి రూ. 500 నోట్ల కట్టను ఇచ్చి మేకలతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఉదయం వ్యాపారి భన్వర్‌లాల్ ఆ డబ్బును లెక్కించడం ప్రారంభించినప్పుడు అసలు విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ కట్టలోని నోట్లన్నింటిపై ఒకే సీరియల్ నంబర్ ఉండటాన్ని గమనించాడు. నిశితంగా పరిశీలించగా.. ఆ మొత్తం రూ. 50,000 లో కేవలం మూడు రూ. 500 నోట్లు (రూ. 1,500) మాత్రమే అసలైనవని, మిగిలిన 97 నోట్లు నకిలీవని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే మే 17వ తేదీన సూరత్‌లోని సచిన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన మహమ్మద్ ఉల్ఫత్ షేక్, నజీర్ అన్సారీ, సత్తార్ షేక్, రయీస్ సిద్ధిఖీ అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మహమ్మద్ ఉల్ఫత్ అని తేలింది. అతని గిడ్డంగిపై పోలీసులు దాడి చేయగా, అక్కడ మరో 20 నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. పట్టుబడతామనే భయంతో నిందితులు కొన్ని నోట్లను అప్పటికే తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద మొత్తం 322 నకిలీ నోట్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పండుగ వేళ అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ నకిలీ నోట్ల ముఠా అరెస్టుతో సూరత్ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
