AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మానుష్య ప్రదేశంలో కుక్కల మూకుమ్మడి దాడి.. మహిళ మృతి

మేకల మేత కోసం ఇంటికి దూరంగా ఉన్న వాగులోకి వెళ్లిన మహిళపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. నిర్మానుష్యంగా ఉండటంతో ఆమె కాపాడాలంటూ కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తీవ్రగాయాల పాలై బాధితురాలు మృతి చెందింది. తమ ఊరిలో వీధికుక్కల దాడులు నిత్యం చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

నిర్మానుష్య ప్రదేశంలో కుక్కల మూకుమ్మడి దాడి.. మహిళ మృతి
Stray Dogs Attack
Srilakshmi C
|

Updated on: May 26, 2026 | 10:45 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం, మే 26: రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కుక్కలు వరుస దాడులకు తెగబడ్డాయి. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై మూకుమ్మడిగా అరుస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో నిత్యం ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ మహిళపై వీధి కుక్క లు మూకుమ్మడిగా దాడి చేశాయి. అకస్మాత్తుగా కుక్కలు దాడి చేయడంతో ఆమె కేకలు వేస్తున్నా.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో తీవ్రగాయాల పాలైంది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం ఎస్సీ కాలనీకి చెందిన మారె రాములమ్మ (40) తన ముగ్గురు కుమారులతో కలిసి స్థానికంగా జీవిస్తోంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం ఉదయం కుమారులంతా పనులకు వెళ్లగా.. రాములమ్మ తమ మేకపిల్లలను సమీపంలోని వాగు ఒడ్డున పొలాల వద్దకు తీసుకెళ్లింది. అవి మేత మేస్తున్న క్రమంలో ఎక్కడి నుంచి వచ్చాయోగానీ నాలుగు వీధి కుక్కలు ఒక్కసారి ఆమెపై దాడి చేశాయి. ఒంటరిగా ఉన్న రాములమ్మ వాటిని నిలువరించేవారు లేకపోయింది. దీంతో ఆమెపై పడి అవి విచక్షణారహితంగా గాయపరిచాయి. కాపాడాలంటూ రాములమ్మ కేకలు వేసినప్పటికీ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమె సాయంకోసం ఎంతగా అరిచినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు అక్కడే స్పృహతప్పి కింద పడిపోయింది. కాసేపటికి ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాములమ్మ మృతి చెందింది.

కుక్కల నుంచి రక్షించాలని మున్సిపల్‌, గ్రామపంచాయతీ అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం కానరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని సార్లు ఎవరు ఏమీ అనకపోయినా కుక్కలు వాటంతట అవే దాడి చేస్తాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us