AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐ ఛీ కొట్టింది.. మాజీ టీం గెంటేసింది.. కట్‌చేస్తే.. సెంచరీతో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్

Prithvi Shaw Century Against Mumbai: పృథ్వీ షా టీమిండియాకు దూరంగా ఉండవచ్చు. ముంబై జట్టు అతన్ని విలువైనదిగా పరిగణించకపోవచ్చు.. కానీ అతను ఇప్పటికీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కుడిచేతి వాటం ఓపెనర్ మహారాష్ట్ర తరపున అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ, ఆ తర్వాత ముంబై ఆటగాళ్లతో గొడవకు దిగాడు.

బీసీసీఐ ఛీ కొట్టింది.. మాజీ టీం గెంటేసింది.. కట్‌చేస్తే.. సెంచరీతో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్
Prithvi Shaw
Venkata Chari
|

Updated on: Oct 08, 2025 | 8:33 AM

Share

Team India: భారత దేశవాళీ క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఇటీవల తన సొంత జట్టు ముంబైని వీడి, కొత్తగా మహారాష్ట్ర జట్టులోకి మారిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్, క్రమశిక్షణ వంటి కారణాలతో ముంబై జట్టులో తన స్థానాన్ని కోల్పోయి, తీవ్ర నిరాశలో ఉన్న షా, ఇప్పుడు తన బ్యాట్‌తోనే విమర్శకులకు, ముఖ్యంగా బీసీసీఐ సెలెక్టర్లకు గట్టి సమాధానం చెప్పాడు.

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు మాజీ జట్టు ముంబైతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున ఆడిన పృథ్వీ షా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 140 బంతుల్లోనే శతకం (చివరికి 186 పరుగులు) పూర్తి చేసి, తన పాత జట్టు బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 305 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

సెలెక్టర్లకు షా గర్జన..

గత కొన్నేళ్లుగా ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలు, క్రమశిక్షణారాహిత్యం వంటి ఆరోపణలతో షా భారత జట్టుకు, చివరకు ముంబై దేశవాళీ జట్టుకు కూడా దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీకి ముంబై జట్టులో చోటు దక్కకపోవడంతో, “నేను ఇంకేం చేయాలి దేవుడా?” అంటూ భావోద్వేగ పోస్టు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో, తనను పక్కన పెట్టిన మాజీ జట్టుపై సెంచరీ చేయడం పృథ్వీ షా పడిన బాధకు, కసికి అద్దం పడుతోంది.

ఇవి కూడా చదవండి

ముంబైని వీడి మహారాష్ట్రకు మారిన తర్వాత తొలిసారి ముంబైతో తలపడిన షా, తన ఫామ్ తిరిగి వచ్చిందనే బలమైన సంకేతాన్ని బీసీసీఐ సెలెక్టర్లకు పంపాడు. ‘తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని, టీమిండియాలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని’ ఈ సెంచరీ ద్వారా షా గట్టిగా చెప్పినట్లయ్యింది.

కొత్త ఆరంభం.. కొత్త సంకల్పం..

ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) పొందిన తర్వాత, పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. బుచ్చిబాబు టోర్నమెంట్‌లో కూడా ఛత్తీస్‌గఢ్‌పై సెంచరీ చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

“నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు,” అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చిన షా, ఇప్పుడు కేవలం తన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాడు. రంజీ ట్రోఫీ సీజన్‌లో భారీ పరుగులు చేసి, టీమిండియా ఓపెనర్ స్థానం కోసం సెలెక్టర్ల తలుపు తట్టడమే అతని ముందున్న ప్రధాన లక్ష్యం. మహారాష్ట్ర తరపున అతని ఈ కొత్త ప్రయాణం, క్రికెట్ ప్రపంచంలో షా రెండవ ఇన్నింగ్స్‌కు శుభారంభంగా చెప్పవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..