కలలో తల్లిదండ్రులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ దివ్య రహస్యం ఏంటంటే..?
తల్లిదండ్రుల ప్రేమకు మరణం లేదు.. వారు మనతో ఉన్నా, భౌతికంగా దూరమైనా వారి ఆశీస్సులు ఎప్పుడూ మన వెంటే ఉంటాయి. అందుకే మన కలలో తల్లిదండ్రులు కనిపిస్తే అది మన అదృష్టంగా భావించాలి. కలలో వారు కనిపిస్తే ఏ పనిలో విజయం వరిస్తుంది? వారు మనకు ఇచ్చే దివ్య సందేశం ఏంటి? నిద్రలేవగానే మనం చేయాల్సిన పనులు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రలో మనకు వచ్చే కలలు కేవలం ఊహలేనా? లేక భవిష్యత్తును సూచించే సంకేతాలా? కలల గురించి శాస్త్రీయ అధ్యయనాన్ని వనిరాలజీ అంటారు. సైన్స్ ప్రకారం ఇవి నాడీ కణాల సంకేతాలు అయితే, ఆధ్యాత్మికంగా ఇవి దివ్య సందేశాలు. ముఖ్యంగా కలలో తల్లిదండ్రులు కనిపిస్తే అది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతమని పండితులు చెబుతున్నారు. కలలో జీవించి ఉన్న లేదా చనిపోయిన తల్లిదండ్రులు కనిపించడం అత్యంత శుభప్రదమని శాస్త్రం చెబుతోంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు లేదా ఒక ముఖ్యమైన ఆలోచనలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కలలోకి వస్తే, ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం వరిస్తుంది. తల్లిదండ్రులు కలలో కనిపించిన రోజున ఆ వ్యక్తిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు నిండుగా ఉంటాయని, ఆ రోజంతా చేసే పనులన్నీ కలిసి వస్తాయని విశ్వసిస్తారు.
ప్రేమకు ప్రతిరూపాలు
తల్లిదండ్రుల ప్రేమకు మరణం లేదని కలల శాస్త్రం వివరిస్తోంది. ప్రస్తుతం మీతో ఉన్న తల్లిదండ్రులు కలలోకి వస్తే, వారికి మీపై అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉన్నాయని అర్థం. చనిపోయిన తల్లిదండ్రులు కలలోకి రావడం అంటే.. వారు భౌతికంగా మనల్ని విడిచి వెళ్లినా, వారి ఆశీస్సులు ఎప్పుడూ మన వెంటే ఉన్నాయని, వారు మనల్ని కాపాడుతున్నారని అర్థం.
కలలు వచ్చే సమయం.. ఫలితం
కలలు వచ్చే సమయాన్ని బట్టి వాటి ప్రభావం మారుతుందని పెద్దలు చెబుతుంటారు. అర్ధరాత్రి వచ్చే కలల కంటే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బలమైన నమ్మకం. సూర్యోదయానికి ముందు వచ్చే శుభ స్వప్నాలు జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తాయని పండితులు చెబుతున్నారు.
ఇలా కనిపిస్తే ఏం చేయాలి?
ఒకవేళ మీ కలలో తల్లిదండ్రులు కనిపిస్తే, నిద్రలేవగానే ఈ పనులు చేయడం శ్రేయస్కరం.
- మొదట భగవంతుడి నామస్మరణ చేయాలి.
- మనసులోనే తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలి.
ఇలా చేయడం వల్ల మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా ఆ రోజంతా విజయవంతంగా గడుస్తుంది.
కలలు మన అచేతన మనస్సులోని భావోద్వేగాలకు ప్రతిబింబాలు. తల్లిదండ్రులు కలలోకి రావడం అనేది మన అదృష్టంగా భావించి, వారి పట్ల గౌరవాన్ని, ప్రేమని కలిగి ఉండటం మన కనీస ధర్మం.
