Online Fraud: ప్రజలకు బిగ్ అలర్ట్.. సోషల్ మీడియాలో వచ్చే ఈ యాడ్స్ నమ్మారంటే నట్టేట మునిగినట్టే!
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో జోతిష్యం, తంత్ర-మంత్ర సేవల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని హెచ్చరించారు. అవన్నీ మీ నుంచి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు పన్నే పన్నాగాళ్లని.. వాటిని నమ్మి జనాలు డబ్బులు కోల్పోవద్దని తెలిపారు. ఎవరైనా ఈ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు కీలక హెచ్చరకలు జారీ చేశారు. సోషల్ మీడియాలో జోతిష్యం, తంత్ర-మంత్ర సేవల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్తగా జ్యోతిష్య, తంత్ర-మంత్ర సేవల పేరుతో మోసాలకు తెర లేపారని హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫార్ముల ద్వారా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం, శాంతి పూజలు, ప్రేమ వివాహం, వశీకరణ, బిజినెస్ గ్రోత్ వంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో అమాయక పౌరులకు వలవేస్తున్నారని.. వీటి పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మొదట్లో చిన్న మొత్తాలు మాత్రమే అడిగి నమ్మకాన్ని సంపాదించే ఈ ముఠాలు, ఆ తర్వాత దశలవారీగా పెద్ద మొత్తాలు డిమాండ్ చేస్తాయని తెలిపారు. బాధితుడు డబ్బులు ఆపగానే, లేదా వారికి బ్లాక్ చేసినప్పుడు వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరింపులకు దిగుతారని.. కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయపెట్టి బాధితులను మానసికంగా చిత్రవధ చేస్తున్నారని తెలిపారు.
సైబర్ మోసగాళ్లు ఒకే గ్యాంగ్‌గా అనేక నకిలీ పేర్లతో అకౌంట్లు నిర్వహిస్తూ, వేర్వేరు బ్యాంకు ఖాతాలను ఉపయోగించి లావాదేవీలు చేస్తారని తెలిపారు. ప్రతి బాధితుడి మానసిక స్థితిని అర్థం చేసుకుని ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వాటి ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుంటారని.. ఒకసారి బాధితుడు తమ వలలో పడిన తర్వాత పూజ కోసం మరింత సొమ్ము కావాలి, దోష నివారణకు ప్రత్యేక సేవ అవసరం, మీ శత్రువులు శాపాలు వేశారు, వాటి నివారణకు రూ. 50,000 అవసరం అని దశలవారిగా డబ్బు వసూలు చేస్తారని తెలిపారు. చెల్లింపు నిరాకరిస్తే OTP, బ్యాంకు వివరాలు అడగడం, బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారని.. ఎవరైనా ఈ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండం లేదా www.cybercrime.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
మోసానికి గురైతే మీరు ఏం చేయాలి?
- సోషల్ మీడియాలో కనిపించే జ్యోతిష్య, తంత్ర, వశీకరణ ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు.
- తెలియని వ్యక్తులకు డబ్బులు పంపించే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలి. శీఘ్ర నిర్ణయాలు మీకు నష్టం కలిగిస్తాయి.
- వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ సమాచారం, ఇంటి వివరాలు అపరిచితులతో పంచుకోవద్దు.
- బ్యాంకు ఖాతా వివరాలు, OTP, UPI PIN ఏ కారణం చేతైనా ఎవరికీ చెప్పవద్దు.
- బెదిరింపులు వస్తే భయపడకుండా తక్షణమే స్థానిక పోలీసులను సంప్రదించండి.
- సైబర్ మోసానికి గురైతే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
