Trivikram : తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పాత్రపై చేసిన ప్రసంగం ఎంతో భావోద్వేగభరితం. బాల్యం నుండి పెద్దయ్యే వరకు తండ్రి గురించి మన అవగాహన ఎలా మారుతుందో ఆయన వివరించారు. సమాజంలో తండ్రికి లభించని గుర్తింపును, ఆయన చేసే నిస్వార్థ త్యాగాలను స్మరిస్తూ, బతికుండగానే వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవశ్యకతను చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పాత్ర, ఆయన సమాజానికి, కుటుంబానికి అందించే సహకారం గురించి ఒక భావోద్వేగ ప్రసంగం చేసిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతుంది. సాధారణంగా అమ్మకు లభించినంత గుర్తింపు తండ్రికి లభించదని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తల్లి నవమాసాలు మోసి, కంటుందని, పెంచి పెద్ద చేస్తుందని అంటుండగా, చిన్ననాటి నుండి మన వేలు పట్టుకొని నడిపించేది తండ్రి అని ఆయన గుర్తుచేశారు. “బాల్యంలో, ఐదేళ్లు, ఆరేళ్ల వయసులో పిల్లలకు తండ్రి ఒక సూపర్ హీరో, సూపర్ మ్యాన్‌గా కనిపిస్తాడు. తమ తండ్రి ఏదైనా చేయగలడని, ప్రపంచంలో ఆయన సాధించలేనిది ఏమీ లేదని భావిస్తారు. అయితే, పదేళ్లు వచ్చిన తర్వాత, స్కూల్లో తోటి పిల్లల ధనిక కుటుంబాలను, వారి తండ్రుల కార్లను చూసినప్పుడు, తమ తండ్రి అంత గొప్పవాడు కాదేమో అనే సందేహాలు మొదలవుతాయి. పదిహేనేళ్లు దాటి, పద్దెనిమిదేళ్లు వచ్చేవరకు, తండ్రి చెప్పే సిగరెట్ కాల్చొద్దు, బాగా చదువుకో, రాత్రిపూట త్వరగా ఇంటికి రా వంటి మాటలు నసగా, చాదస్తంగా అనిపిస్తాయి. తండ్రికి సరిగ్గా బతకడం తెలియదని, అందుకనే ఇలా అయిపోయాడని పిల్లలు అనుకుంటారు.
జీవితంలో ఇరవై ఏళ్ళు, ఇరవై ఐదేళ్లు వచ్చి, పెళ్లి చేసుకుని, అద్దె ఇంటిలో ఉంటూ, ఉద్యోగం చేసి, నెల ఆఖరికి అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు, బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు తండ్రి గొప్పదనం అర్థం కావడం మొదలవుతుంది. నలుగురు పిల్లలను పెంచి, కుటుంబ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వహించాడో అనే ఆలోచన కలుగుతుంది. “మనం ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది” అనిపిస్తుందని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ఆ తర్వాత, 35, 40 ఏళ్లు దాటి, పిల్లలు పెద్దవాళ్లవుతుంటే, స్కూల్ ఫీజులు, రికమండేషన్లు, రాత్రిపూట పిల్లలకు ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్‌కు పరిగెత్తటాలు, ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు తండ్రి పడిన కష్టం గుర్తుకు వస్తుంది. అప్పుడు కళ్ళలో నీళ్లు నిండి, “అయ్యో బాబోయ్! ఇన్ని కష్టాలు పడి మనందరినీ పెంచి ఇక్కడిదాకా తీసుకొచ్చాడు” అనిపిస్తుంది. అయితే, అప్పటికే చాలామంది తండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారని, వారిని గుర్తించి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉండదని” ఆయన భావోద్వేగంగా చెప్పారు.
త్రివిక్రమ్ భారతీయ సంస్కృతిలో “డే”ల ప్రాముఖ్యతపై కూడా చర్చించారు. ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించి, మిగిలిన రోజుల్లో ఆడపిల్లలను చంపేద్దాం అనడం సరికాదని, అలాగే సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అమ్మను ప్రేమించి, మిగిలిన రోజులు తిట్టడం సరికాదని ఆయన అన్నారు. అదే విధంగా, సంవత్సరంలో 365 రోజుల్లో ఒకరోజు కాకుండా, ప్రతిరోజు తండ్రిని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. సాహిత్యంలో, నాటకాల్లో, సినిమాల్లో కూడా అమ్మను డ్రమెటైజ్ చేసినంతగా తండ్రిని చూపించలేకపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రి నుంచే మనం వారసత్వం తీసుకుంటామని, అది కేవలం డబ్బు కాదని, పేరు, సంస్కారం అని త్రివిక్రమ్ గుర్తుచేశారు. “ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను”, “ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను” అని మనల్ని పరిచయం చేసేది తండ్రి ఇచ్చిన పేరు, నేపథ్యం అని ఆయన అన్నారు.
తండ్రికి మనం ఏమి తిరిగి ఇవ్వగలం? కృతజ్ఞత కోరి ఆయన మనల్ని పెంచడు కదా? అని ప్రశ్నిస్తూ, ఒక జ్ఞాపకంగా గుర్తుంచుకుందాం, మర్చిపోవద్దు అని చెప్పారు. ఆయన తిరిగి థాంక్స్ చెప్పాలని కోరుకోడని కూడా పేర్కొన్నారు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే ప్రపంచాన్ని చూస్తామని, ఆయన వేలు పట్టుకొని నడక నేర్చుకుంటామని, ఆయన ఒళ్ళో కూర్చుని చదువుకోవడం, ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటామని త్రివిక్రమ్ వివరించారు. ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ముందు కూర్చుని, ప్రపంచం మొత్తం గెలుస్తున్నామని భావించేవారని గుర్తుచేసుకున్నారు. చివరిగా, తండ్రి దూరమైన తర్వాత కూడా మనం ఒంటరిగా లేమని, కనపడని నీడలా ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడని త్రివిక్రమ్ అన్నారు.
