యోగా డే
ప్రపంచ వ్యాప్తంగా యోగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. దీన్ని మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడే యోగాకు లభించిన ప్రత్యేక గుర్తింపుగా పరిగణించాలి. భారత్‌లో అత్యంత పురాతన కాలం నుంచి యోగా ఆచరణలో ఉంది. 2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 177 సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో జూన్ 21నాడు అత్యంత పొడవైన రోజు కావడంతో ఆ రోజున యోగా డేగా ప్రతిపాదించడం జరిగింది. 2015 జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత్ నలుమూలలా మాత్రమే కాకుండా న్యూయార్క్, పారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, సియోల్ వంటి విశ్వ నగరాల్లోనూ యోగా డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది. జీవితంలో క్రమశిక్షణకు కూడా యోగా దోహదపడుతుంది.