AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కంటే ఈ పక్షి గూడుకే ఫుల్ డిమాండ్.. ఏకంగా లక్షల్లోనే.. అసలు కథ ఏంటంటే..?

ప్రకృతిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించే స్విఫ్ట్‌లెట్ పక్షి. ఈ పక్షి కట్టుకునే గూళ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి మించిన డిమాండ్ ఉంది. ఎండిన పుల్లలు, ఆకులు కాకుండా కేవలం తన నోటి నుంచి వచ్చే లాలాజలంతోనే ఈ పక్షి గూడు కడుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

బంగారం కంటే ఈ పక్షి గూడుకే ఫుల్ డిమాండ్.. ఏకంగా లక్షల్లోనే.. అసలు కథ ఏంటంటే..?
Swiftlet Bird Builds Its Nest With Saliva
Krishna S
|

Updated on: Jun 21, 2026 | 9:59 PM

Share

ప్రపంచంలో బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల ధరలు ఆకాశాన్ని తాకడం గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ ఒక చిన్న పక్షి కట్టుకునే గూడు ధర కూడా లక్షల రూపాయల్లో ఉంటుందని మీకు తెలుసా? వినడానికి చాలా విచిత్రంగా అనిపించినా ఇది పచ్చి నిజం. స్విఫ్ట్‌లెట్ అనే ఒక చిన్న పక్షి నిర్మించే గూడు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజసిద్ధమైన ఉత్పత్తులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఉన్న డిమాండ్ చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. స్విఫ్ట్‌లెట్ పక్షులు సాధారణంగా ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చూడటానికి ఇవి మిగతా పక్షుల లాగే చాలా సాదాసీదాగా ఉంటాయి. కానీ వీటికున్న ఒక వింత అలవాటు ప్రపంచంలోనే వీటిని ప్రత్యేకం చేసింది. సాధారణంగా పక్షులు గూడు కట్టుకోవడానికి ఎండిన పుల్లలు, గడ్డి, ఆకులు లేదా పీచును ఉపయోగిస్తాయి. కానీ ఈ స్విఫ్ట్‌లెట్ పక్షి మాత్రం ఎలాంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులను వాడదు. ఇది కేవలం తన నోటి నుంచి వచ్చే లాలాజలంతోనే గూడును తయారు చేసుకుంటుంది.

ఈ వింత గూడు ఎలా తయారవుతుందంటే?

గూడు కట్టుకునే సమయం వచ్చినప్పుడు ఈ పక్షులు తమ లాలాజలాన్ని పదే పదే చీకటి గుహల గోడలపై లేదా నిటారుగా ఉండే కొండ చరియలపై ఉంచుతాయి. ఆ లాలాజలం గాలి తగలగానే క్రమంగా గట్టిపడటం ప్రారంభమవుతుంది. ఇలా పక్షి కొన్ని రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి.. చివరికి ఒక చిన్న గిన్నె ఆకారంలో ఉండే గూడును సిద్ధం చేస్తుంది. ఇదే గూడు అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతుంది.

ప్రాణాలకు తెగించి సేకరిస్తారు..

ఈ ఖరీదైన గూళ్లను సేకరించడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే స్విఫ్ట్‌లెట్ పక్షులు ఎల్లప్పుడూ దట్టమైన, చీకటిగా ఉండే ప్రమాదకరమైన లోతైన గుహల్లో లేదా వందల అడుగుల ఎత్తున్న కొండలపై మాత్రమే గూళ్లు కడతాయి. వీటిని సేకరించే వ్యక్తులు కేవలం తాడులు, వెదురు నిచ్చెనల సహాయంతో ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఎత్తుకు చేరుకుంటారు. అక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. అందుకే ఈ గూళ్ల సేకరణ అత్యంత ప్రమాదకరమైన పనిగా భావిస్తారు.

ఈ గూళ్లకు అంత డిమాండ్ ఎందుకు?

ముఖ్యంగా చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ పక్షి గూళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడ ఈ గూళ్లను ఒక విలాసవంతమైన, అత్యంత పోషక విలువలున్న ఆహారంగా చూస్తారు. ఈ గూళ్లతో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బర్డ్ నెస్ట్ సూప్ అనే రాయల్ డిష్‌ను తయారు చేస్తారు. ఈ సూప్ తాగడం వల్ల శరీరానికి అపారమైన శక్తి లభిస్తుందని, యవ్వనంగా ఉంటారని అక్కడి వారు నమ్ముతారు. ఈ సూప్‌ను విదేశాల్లో అత్యంత సంపన్నులు తినే స్టార్ హోటల్స్ లగ్జరీ మెనూలో ఉంచుతారు. నాణ్యతను బట్టి ఈ స్విఫ్ట్‌లెట్ పక్షి గూళ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు వేల డాలర్లు పలుకుతాయి.

ఇప్పుడు ఇదొక పెద్ద బిజినెస్..

రోజురోజుకూ పెరుగుతున్న ఈ డిమాండ్ కారణంగా ఇప్పుడు ఆగ్నేయాసియా దేశాల్లో ఇదొక పెద్ద బిజినెస్‌గా మారింది. సహజసిద్ధమైన గుహలే కాకుండా.. ఈ పక్షులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. తద్వారా పక్షుల జనాభాకు నష్టం కలగకుండా గూళ్ల ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వీటిని అతిగా సేకరిస్తే పక్షుల మనుగడకే ప్రమాదమని, అందుకే గూళ్ల సేకరణపై అనేక దేశాల్లో కఠినమైన నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.

Follow Us