Minister Srinivas Goud: వివాదంలోకి ప్రజలను లాగడం సరికాదు.. ఏపీ మంత్రుల కామెంట్స్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్..
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం హాట్ హాట్‌గా సాగుతోంది. నిత్యం ఇరు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు కామెంట్స్ విసురుకుంటున్నారు. మీవంటే మీ ప్రాజెక్టులే అక్రమమని వాదించుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం హాట్ హాట్‌గా సాగుతోంది. నిత్యం ఇరు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు కామెంట్స్ విసురుకుంటున్నారు. మీవంటే మీ ప్రాజెక్టులే అక్రమమని వాదించుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఈ వివాదంపై స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలోని ఏపీ ప్రజల ఆస్తులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యాపారాలు అడ్డుకుంటున్నారని ఏపీ ప్రజలు ఒక్కరైనా ఫిర్యాదు చేశారా అని నిలదీశారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఆంధ్రా వాసి అయినా ఇబ్బంది పడ్డారా… ఆంధ్రా నేతల పేర్లతో ఉన్న కాలనీలు, పార్కుల పేర్లను మార్చామా అని వరుస ప్రశ్నలు సంధించారు.
గతంలో ఆంధ్రా నేతలు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించకుండా చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వేలాది మంది తెలంగాణ ప్రజల మరణాలకు నాటి నాయకులు కారణమయ్యారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకుంటే ఏపీ ప్రభుత్వం వెంటనే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
బోర్డు అనుమతులు వచ్చాకే ప్రాజెక్టును చేపట్టి నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఈ ఏడేళ్లలో ఒక్క ఆంధ్రా వాసికి తెలంగాణలో ఇబ్బంది కలగలేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల నీటి కేటాయింపుపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలు బోర్డుకు పలుమార్లు పరస్పర ఫిర్యాదులు చేశాయి.
ఏపీ ప్రభుత్వం వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్జీటీ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జల వివాదంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది.