Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

జమ్ములో వరసగా నాలుగో రోజు కూడా డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లలో యాంటీ డ్రోన్‌ జామర్లను అమర్చారు.

Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు
Anti Drone And Jammer
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 01, 2021 | 7:21 AM

జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్‌బేస్‌, ఆర్మీ బేస్‌లపై డ్రోన్‌లు సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జమ్ము ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లను అమర్చారు. జమ్ము సైనిక స్థావరాలకు సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి 1.30 నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి. మొదట కాలుచూక్‌ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోన్‌ కన్పించగా.. ఆ తర్వాత కాసేపటికే రత్నచక్‌ సైనిక ప్రాంతంలో మరోదాన్ని గుర్తించారు. ఇక మూడోది.. కుంజ్వానీ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద కన్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిఫెన్స్‌ ఇన్‌స్టాలేషన్స్‌ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది.

జమ్ము సైనిక స్థావరాల దగ్గర గత నాలుగు రోజుల్లో మొత్తం ఏడు డ్రోన్లు సంచరించాయి. గత ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు జమ్ము వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భవనంపై , పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచాయి. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.

ఈ ఘటనలో భవనం పైకప్పునకు రంధ్రం పడింది. కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్ములోని మరో సైనిక స్థావరంపై దాడిని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి.

వరుస ఘటనల కారణంగా జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు డ్రోన్‌ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే తొలిసారి. సరిహద్దు అవతల నుంచి ప్రారంభమైన ఈ సరికొత్త ముప్పుతో అప్రమత్తమైన కేంద్రం తాజా పరిస్థితిని సమీక్షించింది.

ప్రధాని మోదీ మంగళవారం దిల్లీలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో తో భేటీ అయ్యారు. దేశ భద్రతకు ఏర్పడే కొత్త సవాళ్లను గట్టిగా తిప్పికొట్టేందుకు సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని నిర్ణయించారు. జమ్ము ఎయిర్‌బేస్‌ దాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌జీ అధికారులు కూడా ఎయిర్‌బేస్‌ను పరిశీలించారు.

ఇవి కూడా చదవండి : AP-TS Water Disputes: ఏపీ-తెలంగాణ జల వివాదంపై సీఎం జగన్ సంచలన కామెంట్స్.. వారికి ఇబ్బంది కలుగకూడదనే..

Viral Video: కళ్లను మాయ చేసే ఎనిమిదో వింత.. వీడియో చూస్తే మీరూ నమ్మలేరు.!