AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: గుజరాత్‌లో తగ్గని మోదీ ఇమేజ్.. అభివృద్ధి మంత్రంతో క్లీన్ స్వీప్.. పనిచేయని విపక్షాల ఉచిత హామీలు..

గుజరాత్‌లో మరోసారి మోడీ మార్క్ కన్పించింది. ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఏడోసారి గెలవడంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్ర ఎనలేనిదంటున్నారు రాజకీయ పండితులు. విపక్షాల ఉచిత హామీలకంటే ప్రధాని మోదీ అభివృద్ధి నినాదంవైపే గుజరాతీ ఓటర్లు..

PM MODI: గుజరాత్‌లో తగ్గని మోదీ ఇమేజ్.. అభివృద్ధి మంత్రంతో క్లీన్ స్వీప్.. పనిచేయని విపక్షాల ఉచిత హామీలు..
Prime Minister of India Narendra Modi
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 1:00 AM

Share

గుజరాత్‌లో మరోసారి మోడీ మార్క్ కన్పించింది. ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఏడోసారి గెలవడంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్ర ఎనలేనిదంటున్నారు రాజకీయ పండితులు. విపక్షాల ఉచిత హామీలకంటే ప్రధాని మోదీ అభివృద్ధి నినాదంవైపే గుజరాతీ ఓటర్లు మొగ్గుచూపినట్లు ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. గుజరాత్‌ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందునుంచే నెలకు కనీసం రెండు సార్లు గుజరాత్‌లో పర్యటించేలా ప్లాన్ చేసుకున్న మోదీ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మోదీ తలకిందులు తపస్సు చేసినా బీజేపీ గెలవదంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చినా.. ప్రధాని మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటే వెళ్లారు. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేసేది తామేనంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఫలితాలు చూస్తే మాత్రం.. మోదీ మ్యాజిక్ గుజరాత్‌లో వందశాతం పనిచేసినట్లు కనిపించింది. ఎన్నికల సభలే కాకుండా.. భారీ రోడ్‌షోలతో ప్రజలందరినీ ఆకట్టుకున్నారు నరేంద్రమోదీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గుజరాత్‌లోనూ గెలిపిస్తే తమ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆలోచన కూడా గుజరాతీల ఈ తీర్పునకు కారణంగా తెలుస్తోంది.

గుజరాత్‌ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్నికలకు ముందు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. సొంతరాష్ట్రంలో ఓటమి చెందితే విపక్షాల నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొవల్సి వస్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూలతను ఎదుర్కొవల్సి వస్తుందని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 1995 నుంచి కమలం పార్టీ గుజరాత్‌ ను పాలిస్తూ వస్తోంది. అప్పటి నుంచి బీజేపీ తిరుగులేని పార్టీగా విజయ దుదుంబి మోగిస్తూ వస్తోంది. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి విజయంతో పశ్చిమబెంగాల్‌లో వామపక్షాల కూటమి ఘనతను కమలం పార్టీ సమం చేసింది. ఇప్పటివరకు వరుసగా ఏడుసార్లు అధికారం చేపట్టిన పార్టీ పశ్చిమబెంగాల్‌లో సీపీఏం మాత్రమే. ఆ రికార్డును బీజేపీ సమం చేసింది. మరోవైపు ఒడిశాలో బిజు జనతాదళ్ 2000 నుంచి వరుసగా ఐదు సార్లు విజయం సాధించింది.

2024 సార్వత్రిక ఎన్నికలపై గుజరాత్‌ ఫలితం ప్రభావం చూపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తూ వచ్చారు. దీంతో గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంతో ఆపార్టీ మరింత దూకుడును ప్రదర్శించే అవకాశాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచి ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కేజ్రీవాల్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉండేది. అయితే ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. దీంతో సార్వత్రిక ఎన్నికలు సైతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గానే జరిగే అవకాశాలున్నాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్‌లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాదాపు 30కు పైగా ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. భారీ రోడ్ షోలు సైతం నిర్వహించారు. ప్రధానంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య, భారీ ప్రాజెక్టుల కోసం భూసేకరణ, రైతుల పంట నష్టానికి సరైన పరిహారం అందకపోవడం వంటి అంశాలు ఈసారి ప్రచారంలో కీలకంగా మారినప్పటికి.. ఇవ్వన్నీ బీజేపీ గెలుపును ఆపలేకపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..