AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: గుజరాత్‌ ఫలితాన్ని కాంగ్రెస్ ముందే ఊహించిందా.. అలా జరగకుండా జాగ్రత్తపడిందా..?

ఎన్నికల్లో పోటీచేసే ఎవరైనా గెలుపు తమదేనని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం అవసరం ఉండదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ముందుకువెళ్లలేరు. అందుకే తాను ఓడిపోతానని తెలిసినా గెలిచేది తానేనంటూ పార్టీ శ్రేణుల్లోనూ, తన అభిమానుల్లో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం నింపడం కోసం..

Congress: గుజరాత్‌ ఫలితాన్ని కాంగ్రెస్ ముందే ఊహించిందా.. అలా జరగకుండా జాగ్రత్తపడిందా..?
Congress Party
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 1:47 AM

Share

ఎన్నికల్లో పోటీచేసే ఎవరైనా గెలుపు తమదేనని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం అవసరం ఉండదు. ఆత్మవిశ్వాసం లేకపోతే ముందుకువెళ్లలేరు. అందుకే తాను ఓడిపోతానని తెలిసినా గెలిచేది తానేనంటూ పార్టీ శ్రేణుల్లోనూ, తన అభిమానుల్లో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం నింపడం కోసం చెబుతూ ఉంటారు. చిన్న, పెద్ద రాజకీయ పార్టీలతో పాటు.. స్వతంత్య్ర అభ్యర్థులు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తారు. అయితే రాజకీయ పార్టీలు.. క్షేత్రస్థాయిలో ఫలితం ఎలా ఉంటుందనేది ముందే పసిగడతాయనడంలో పెద్దగా సందేహం అవసరం లేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమ బలబలాలేమిటి.. రానున్న ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది ఆయా పార్టీలు ముందుగానే అంచనా వేస్తాయి. అయితే పూర్తిగా ఫలితాలు ఇలాగే ఉంటాయని చెప్పలేకపోయినా.. తమ పరిస్థితి ఎలా ఉండొచ్చనే అంచనాకు వస్తాయి. వివిధ రాజకీయపార్టీలు ఎన్నికలకు ముందు, ఎన్నికలు జరుగుతున్న వేళ వివిధ సర్వే సంస్థలతో సర్వే చేయించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రజల్లో తమ పట్ల సానుకూలత ఉందని తెలిస్తే మాత్రం.. విజయం కోసం విశ్వప్రయత్నాలు చేస్తాయి. దానికి తగినట్లుగా పోల్ మేనేజ్‌ మెంట్ చేస్తాయి. అదే తమ పార్టీ ఎంత ప్రయత్నించినా గెలవదని తెలిస్తే మాత్రం ఖర్చును తగ్గించుకుంటాయి.

తాజాగా గుజరాత్‌ ఫలితాల సరళిని చూస్తే ఇక్కడ ఇలాంటి ఫలితం వస్తుందని కాంగ్రెస్ ముందే అంచనా వేసిందా అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి గుజరాత్‌ వంటి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగుతున్నవేళ ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉన్నారు. కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే రాహుల్ గాంధీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జోడో యాత్రతో కాంగ్రెస్‌ గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పెరుగుతుందన్న హస్తం పార్టీ అంచనాలు గుజరాత్‌లో తలకిందులైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని.. అంతా తానై వ్యవహరించినా ఇలాంటి ఫలితం వస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండేది. అలాంటి అపవాదు రాహుల్‌పై పడకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.

ఒకవేళ గుజరాత్‌లో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తే.. భారత్ జోడో యాత్ర ప్రభావం ఏమాత్రం చూపించలేదని, రాహుల్ గాంధీని ప్రజలు నమ్మడం లేదనే ప్రచారాన్ని బీజేపీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఇది మైనస్ అవుతుందని గ్రహించిన హస్తం పార్టీ.. గుజరాత్‌ ప్రచారానికి రాహుల్‌ను దూరంగా ఉంచిదా అనే అనుమానం కలుగుతుంది. అసలు ప్రచారంలో పాల్గొనకపోతే కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండటంతో క్యాడర్‌ను సంతృప్తిపర్చడం కోసం రెండు, మూడు రోజులు పర్యటించి నమః అనిపించారు. అది కూడా చాలా తక్కువ ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇమేజ్ దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తపడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..