Gujarat Result: హ్యాట్రిక్‌లపై హ్యాట్రిక్‌ల వెనుక రహస్యం ఏమిటి.. ఇన్ని విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయి..?

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Dec 09, 2022 | 4:00 AM

ఎన్నికల్లో ఓ సారి గెలవడమే కష్టం.. ఇక వరుసగా హ్యాట్రిక్‌లపై హ్యాట్రిక్‌లు కొట్టడం అంటే మాటాలా.. ఇది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. తాజాగా గుజరాత్‌లో వరుసగా ఏడో సారి అధికారంలోకి రావడమే కాకుండా.. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలం..

Gujarat Result: హ్యాట్రిక్‌లపై హ్యాట్రిక్‌ల వెనుక రహస్యం ఏమిటి.. ఇన్ని విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయి..?
Bhupendra Patel, Mamata Banerjee, Naveen Patnaik, Jyoti Basu, Pawan Chamling

ఎన్నికల్లో ఓ సారి గెలవడమే కష్టం.. ఇక వరుసగా హ్యాట్రిక్‌లపై హ్యాట్రిక్‌లు కొట్టడం అంటే మాటాలా.. ఇది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. తాజాగా గుజరాత్‌లో వరుసగా ఏడో సారి అధికారంలోకి రావడమే కాకుండా.. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీ మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎలా సాధ్యమైందనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. గుజరాత్‌లో బీజేపీలా దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాయి. మరోవైపు దేశంలో గతంలో ఓ వెలుగు వెలిగి.. ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, వామపక్షాలు క్రమక్రమంగా బలహీనపడుతున్నాయి . మరికొన్ని మాత్రం ఆయా రాష్ట్రాల్లో ఏళ్లపాటు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాకుండా ప్రజావ్యతిరేకతను దాటుతూ అధికారాన్ని దక్కించుకుంటున్నాయి. గతంలో చిన్న రాష్ట్రాలపైన త్రిపుర, సిక్కింలలో ఇటువంటి పరిస్థితులు చూడగా.. తాజాగా గుజరాత్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ఈ తరహా రాజకీయం కొనసాగుతోంది. బెంగాల్‌ను 34ఏళ్ల పాటు సీపీఎం ఏకధాటిగా పాలించిన రికార్డుకు గుజరాత్‌ బీజేపీ సమం చేసింది. ఇప్పటికే 27 ఏళ్లు గుజరాత్‌లో అధికారంలో ఉన్న కమలం పార్టీ.. మరో ఐదేళ్ల పాలనకు మార్గం సుగమం చేసుకుంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైన వేళ కేశూభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో 1995లో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టింది. తొలినాళ్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆ పార్టీ తొలి రెండేళ్లలో రెండు సార్లు సీఎంలను మార్చింది. అనంతరం రాజకీయ పరిణామాలు మారిపోవడంతో అక్కడ 27 రోజులపాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత వచ్చిన రాష్ట్రీయ జనతా పార్టీ రెండేళ్లు పాలించినప్పటికీ సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించలేకపోయింది. ఈ క్రమంలో 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అప్పటినుంచి ఇప్పటి వరకు తిరుగులేని శక్తిగా అవతరించింది.

2001 అక్టోబర్‌ 7న బీజేపీ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. తనదైన వ్యూహాలతో గుజరాత్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఆ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో అల్లాడిపోయిన రాష్ట్ర పరిస్థితిని ఆయన చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విద్యుత్తు రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మోదీ. దీంతో రాష్ట్రంలో ఆయన క్రేజ్ బాగా పెరిగింది. గుజరాత్‌లో మోదీతో 2001లో మొదలైన బీజేపీ విజయ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగం, ధరల పెరుగుదలతోపాటు పలు జాతీయ అంశాలతో కాంగ్రెస్‌ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ వ్యూహాల ముందు అవి బెడిసికొడుతున్నాయి. గుజరాత్‌లో ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో విజయంతో వరుసగా ఏడుసార్లు గెలిచిన పార్టీగా నిలిచింది. ముఖ్యంగా తుపానుతో అతాలకుతంలం అయిన గుజరాత్‌ను అభివృద్ధి పధంలో నడిపించడానికి బీజేపీ చేసిన ప్రయత్నమే ఆ పార్టీకి వరుస విజయాలు సాధించడానికి కారణమవుతూ వస్తోందనే వాదన వినిపిస్తోంది.

1960, 70వ దశకంలో రాజకీయ అస్థిరతను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్‌కు సీపీఏం నేత జ్యోతిబసు మార్గదర్శిగా నిలిచారు. 1977లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సుదీర్ఘ కాలం దాదాపు 23 ఏళ్లు పాలించిన నేతగానూ రికార్డు సృష్టించారు. 2000లో బాధ్యతల నుంచి వైదొలిగిన ఆయనకు.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దానిని తిరస్కరించారు. ఆ తర్వాత సీఏంగా బాధ్యతలు చేపట్టిన బుద్ధదేవ్‌ భట్టాచార్య.. మరో పదేళ్లు అధికారాన్ని నిలబెట్టారు. మొత్తంగా బెంగాల్‌ను 34ఏళ్లపాటు పాలించి కమ్యూనిస్టులు రికార్డు నెలకొల్పారు. మూడు దశాబ్దాల పాలనలో ప్రజాఉద్యమాలతో రంగ ప్రవేశం చేశారు మమతా బెనర్జీ. ప్రజా వ్యతిరేకతను తనవైపు మలచుకున్న మమతా బెనర్జీ.. కమ్యూనిస్టుల కంచుకోటకు గండికొడుతూ 2011లో ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లోనూ విపక్షాల విమర్శలు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ మూడోసారి ఘనవిజయం సాధించారు. స్వతంత్ర భారత దేశంలో సుదీర్ఘకాలం పాటు ఓ రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నిలిచింది. 1994లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌.. వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. అభివృద్ధి, శాంతి వ్యూహాలతో ముందుకెళ్లిన ఆయన 24 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కనిపించినప్పటికీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. దేశంలో అత్యధిక కాలం ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగానూ చామ్లింగ్‌ నిలిచారు. 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ పార్టీ విజయం సాధించడంతో పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ సీఎం పీఠానికి దూరమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఒకే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోన్న రాష్ట్రాల జాబితాలో ఒడిశా స్థానం సంపాదించుకుంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌.. ఇప్పటివరకు ఐదుసార్లు వరుసగా విజయం సాధించారు. 2000లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ ఇప్పటికీ విజయవంతమైన పాలన సాగిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం, వరుస తుపాన్లు, నిరక్షరాస్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఒడిశాను అభివృద్ధి పథంలో నడిపించడంలో నవీన్‌ పట్నాయక్‌ సఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలా మూడుసార్లు కంటే ఎక్కువుగా అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీలో సీపీఏం, బీజేపీ, బిజుజనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నిలిచాయి. అలాగే ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర కూడా రెండు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచింది. 1978 నుంచి 1988 వరకు సీపీఎం తరఫున నృపెన్‌ చక్రవర్తి త్రిపుర సీఎంగా కొనసాగారు. తర్వాత ఓ సారి కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. 1993లో మళ్లీ అధికారం చేపట్టిన సీపీఎం.. 23ఏళ్లు అధికారంలో కొనసాగింది. 1998 నుంచి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో మాణిక్‌ సర్కార్‌ విజయం సాధించారు. ఆయన మొత్తంగా 20 ఏళ్లు సీఎం పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2018 ఎన్నికల్లో త్రిపుర సీఎం పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకొని 2022లో రెండోసారి విజయం సాధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu