PM Modi: కరోనా మహమ్మారి అంతం కాలేదు.. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.. ప్రధాని మోడీ సూచన..
కోవిడ్-19 మహమ్మారి అంతం కాలేదని, దేశవ్యాప్తంగా పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మోడీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రయోగశాలలను పర్యవేక్షించాలని, పరీక్షలను పెంచాలన్నారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కలవరం మొదలైంది. ఈ తరుణంలో కేంద్రం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసి.. కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతోపాటు రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. తాజగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య రెండువేల మార్క్ దాటింది. దేశంలో నిన్న 2,151 కేసులు నమోదయ్యాయి. 5 నెలల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశంలో కోవిడ్ 19, ఇన్‌ఫ్లుఎంజా పరిస్థితిపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వివరాలు తెలుసుకుని.. అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో, పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్ ఉంటే, దానిని ట్రాక్ చేయవచ్చని తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మాస్క్ ధరించాలని సూచించారు. రోగులు, ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా ఆసుపత్రిలో మాస్కులు ధరించాలన్నారు. సీనియర్ సిటిజన్‌లు, అనారోగ్యంతో బాధపడే వారు మాస్కులు ధరించాలని మోడీ సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమని.. తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కోవిడ్-19 మహమ్మారి అంతం కాలేదని, దేశవ్యాప్తంగా పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మోడీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రయోగశాలలను పర్యవేక్షించాలని, పరీక్షలను పెంచాలన్నారు. ఆసుపత్రులు అన్ని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మాక్ డ్రిల్స్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల్లో పడకల లభ్యతను పర్యవేక్షించాలని, దీనితో పాటు అవసరమైన మందుల కొరత లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంకా అవసరమైన చర్యలు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
దేశంలోని ఇన్‌ఫ్లుఎంజా పరిస్థితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధాన మంత్రికి అధికారులు వివరించగా.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు.
అంతకుముందు 2022 డిసెంబర్ 22న ప్రధాని మోదీ దేశంలోని కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్షించారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్‌కు సంబంధించిన 20 కోర్ మందులు, 12 ఇతర మందులు, 8 బఫర్ మందులు, 1 ఇన్‌ఫ్లుఎంజా ఔషధాల లభ్యత, ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతోపాటు 22,000 ఆసుపత్రుల్లో 2022 డిసెంబర్ 27న మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.
శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలని, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..