Flight Journey: అక్కడి నుంచి విమాన ప్రయాణం.. ఢిల్లీ కంటే చవకమయం.. ఎందుకో తెలుసా?
Cheaper Airfares: మీరు దేశ రాజధాని ఢిల్లీకి తరచుగా రాకపోకలు సాగిస్తారా? ఢిల్లీ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లి వస్తుంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇక నుంచి మీరు ఇదివరకటి కంటే తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయవచ్చు. అవును. ఇదేదో విమానయాన సంస్థలు ఇస్తున్న దీపావళి డిస్కౌంట్ కాదు. టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా సరే.. ఢిల్లీకి బదులుగా ఆ నగరాన్ని ఆనుకున్న నోయిడా నుంచి ప్రయాణం చేస్తే ఏకంగా 10 నుంచి 15 శాతం వరకు టికెట్ ధరలో ఆదా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

Cheaper Airfares: మీరు దేశ రాజధాని ఢిల్లీకి తరచుగా రాకపోకలు సాగిస్తారా? ఢిల్లీ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లి వస్తుంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇక నుంచి మీరు ఇదివరకటి కంటే తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయవచ్చు. అవును. ఇదేదో విమానయాన సంస్థలు ఇస్తున్న దీపావళి డిస్కౌంట్ కాదు. టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా సరే.. ఢిల్లీకి బదులుగా ఆ నగరాన్ని ఆనుకున్న నోయిడా నుంచి ప్రయాణం చేస్తే ఏకంగా 10 నుంచి 15 శాతం వరకు టికెట్ ధరలో ఆదా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి సాగించే విమాన ప్రయాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు టెర్మినళ్లు, 4 సమాంతర రన్ వే లతో రోజుకు సగటున 1,400 నుంచి 1,500 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ నగరానికి ఆనుకుని నోయిడా, గురుగ్రాం, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి శాటిలైట్ టౌన్‌షిప్స్ కూడా శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నోయిడా శివార్లలోని జేవర్ వద్ద మరొక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం మంజూరు చేసి, శరవేగంగా నిర్మాణం చేపట్టింది. ప్రపంచంలో లండన్, న్యూయార్క్, పారిస్, మెల్‌బోర్న్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఒకటికి మించి కమర్షియల్ ఎయిర్‌పోర్ట్స్ కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ నగరాన్ని కూడా చేర్చేందుకు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడనుంది.
నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి ఎందుకు చవక?
ఢిల్లీ నగరానికి ఆనుకున్న నోయిడాలో హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, మైక్రోసాఫ్ట్ సహా అనేక ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలున్నాయి. ఇది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక నగరంగా మారిపోయింది. పేరుకు ఢిల్లీకి నగరానికి ఆనుకుని ఉన్నప్పటికీ.. ఈ నగరం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతం దాటగానే ఈ రాష్ట్ర సరిహద్దులు మొదలవుతాయి. అదే ఇప్పుడు నోయిడా ఎయిర్‌పోర్టుకు వరంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కఠినమైన చర్యలతో శాంతిభద్రతలను సుస్థిరం చేసిన తర్వాత పెట్టుబడులు, పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు వీలుగా అనేక పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ మరో రూ. 1,800 కోట్లు పెట్టుబడితో విస్తరణ చేపట్టి అదనంగా మరో 3,000 మందికి ఉపాధి కల్పించనుంది. పెట్టుబడులతో ముందుకొస్తున్న సంస్థల్లో శాంసంగ్, డిక్సన్, ఎల్జీ, ఒప్పో, వివో, లావా, ఆప్టిమస్ వంటి ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలున్నాయి.
ఈ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్’ (ATF)పై దేశంలోనే అత్యల్పంగా 1 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తోంది. కానీ ఢిల్లీలో ఏవియేషన్ ఫ్యూయల్‌పై 25 శాతం పన్ను అమలవుతోంది. విమాన టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులను నిర్ణయించే అంశాల్లో ఏవియేషన్ ఫ్యూయల్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ప్రతి టికెట్‌పై బేస్ ఫేర్‌తో పాటు ఏవియేషన్ ఫ్యూయల్ ధరను కూడా ముద్రిస్తారు. ఇరుగు, పొరుగునే ఉన్న ఈ రెండు విమానాశ్రయాల్లో ఫ్యూయల్ ధరల్లో వ్యత్యాసానికి కారణమయ్యే ట్యాక్స్ పాలసీయే విమాన టికెట్ ధరల్లోనూ వ్యత్యాసానికి కారణమవుతుంది. కనీసం 10 నుంచి 15 శాతం మేర టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఉదాహరణకు మీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకున్న టికెట్ ధర రూ. 7,000 ఉందనుకుంటే, అదే గమ్యానికి మీరు నోయిడా ఎయిర్‌పోర్టు టికెట్ కొనుగోలు చేస్తే మీకు రూ. 5,600కే టికెట్ లభిస్తుంది.
నోయిడా ఎయిర్‌పోర్టు ప్రారంభం ఎప్పుడు?
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2024 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యమునా అథారిటీ సన్నాహాలు చేస్తోంది. 2021 నవంబర్ 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంఖుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రన్ వే నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. రన్ వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రలో (ATC) మార్చి నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే విమానాల రాకపోకలు సాగించవచ్చు. అయితే కమర్షియల్ ఆపరేషన్స్ మొదలుపెట్టాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. అందుకోసం టర్మినల్ భవనాలతో పాటు మరికొన్ని మౌలిక వసతులు అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్న వేగంతో సాగితే వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి వాణిజ్య సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్ట్ ప్రారంభించిన తొలి రోజే కనీసం 65 విమానాలను టేకాఫ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు ఈ కొత్త ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు మెట్రో రైల్ సేవలను కూడా ఇక్కడి వరకు విస్తరిస్తున్నారు. మధ్యలో ఎక్కువ స్టాప్స్ లేకుండా కేవలం 6 స్టాపుల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా హైస్పీడ్ ‘ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్’ నిర్మాణం జరుగుతోంది. సాధారణంగా దేశంలోని నలు మూలల నుంచి ఢిల్లీ చేరుకునే ప్రయాణికుల్లో ఢిల్లీ నగరంతో పనుండే వారికంటే నోయిడా, గురుగ్రాం వంటి నగరాల్లో బిజినెస్ మీటింగ్స్ కోసం వచ్చేవారే ఎక్కువగా ఉంటారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగి నగరంలోని ట్రాఫిక్ దాటుకుని నోయిడా చేరుకునే సరికి సగం రోజు గడచిపోతుంది. రాష్ట్ర సరిహద్దులు దాటి సాగే ప్రయాణంలో క్యాబ్ బిల్లుల మోత కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది నేరుగా నోయిడాలోనే విమానం దిగి, అక్కడి బిజినెస్ మీటింగ్స్ చూసుకుని తిరిగొచ్చే అవకాశాన్ని కొత్త విమానాశ్రయం కల్పించనుంది. పైపెచ్చు ఢిల్లీతో పోల్చితే తక్కువ ధరకు ప్రయాణం చేయవచ్చు. మరింత తక్కువ ఖర్చుతో క్యాబ్‌లో తాము కోరుకున్న చోటకు చేరుకోవచ్చు. యూపీ బాటలో ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏవియేషన్ ఫ్యూయల్‌పై పన్నులు తగ్గిస్తే తప్ప టికెట్ ధరల్లో వ్యత్యాసం ఇలాగే కొనసాగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..