Sankranthi 2026: సంక్రాంతి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలి? ఇండియాలో టాప్ 5 ఫెస్టివల్ డెస్టినేషన్స్ ఇవే!
జనవరి మాసం రాగానే భారతదేశం ఒక అందమైన రంగుల లోకంచాలా మారుతుంది. దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంట చేతికి వచ్చే తరుణంలో జరుపుకునే కోత ఉత్సవాలు (Harvest Festivals) మన సంస్కృతికి అద్దం పడతాయి. ఉత్తరాదిలో వెలిగే లోహ్రీ మంటల నుండి, దక్షిణాదిలో గుమగుమలాడే పొంగల్ వంటకాల వరకు.. ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. మీరు ఈ 2026 జనవరిలో ఒక చిరస్మరణీయమైన యాత్ర చేయాలనుకుంటే, ఈ పండుగ వేడుకలు జరిగే ప్రాంతాలను సందర్శించడం ఉత్తమ ఎంపిక.

చలికాలం ముగిసి, సూర్యుడు తన దిశను మార్చుకునే మకర సంక్రాంతి సమయం పర్యాటకులకు పండగే! గుజరాత్ ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాలు, పంజాబ్ పొలాల్లో మార్మోగే డోలు దరువులు, అసోంలో జరిగే సాముహిక విందులు.. ఇలా భారత్ తన వైవిధ్యతను చాటుకుంటుంది. ఆహార ప్రియులైనా, ఫొటోగ్రాఫర్లైనా లేదా మన ఆచారాలను తెలుసుకోవాలనుకునే వారైనా ఈ జనవరిలో సందర్శించాల్సిన టాప్ డెస్టినేషన్స్ వివరాలు మీకోసం ఈ ప్రత్యేక గైడ్‌లో ఉన్నాయి.
1. పంజాబ్ (లోహ్రీ – జనవరి 13, 2026): పంజాబ్‌లో లోహ్రీ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతాయి. రాత్రిపూట మంటలు (Bonfires) వేసి, వాటి చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు పాడతారు. అమృత్‌సర్ వంటి నగరాల్లో స్వర్ణ దేవాలయం ఈ సమయంలో అద్భుతంగా వెలుగులీనుతుంది. మక్కీ కీ రోటీ, సర్సో కా సాగ్ వంటి పంజాబీ వంటకాలను రుచి చూడటానికి ఇది సరైన సమయం.
2. గుజరాత్ (అంతర్జాతీయ గాలిపటాల పండుగ – జనవరి 14, 2026): అహ్మదాబాద్‌లో జరిగే గాలిపటాల పండుగ (Uttarayan) ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద వేల సంఖ్యలో గాలిపటాలు ఆకాశాన్ని రంగులమయం చేస్తాయి. దీనితో పాటు ‘ఉందియు’, ‘జలేబి’ వంటి గుజరాతీ రుచులను ఆస్వాదించవచ్చు.
3. తమిళనాడు (పొంగల్ – జనవరి 14-17, 2026): తమిళనాడులో పొంగల్ నాలుగు రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఇళ్ళ ముందు వేసే అందమైన కోలమ్స్ (ముగ్గులు), ఎడ్ల పండుగ (మాట్టు పొంగల్) చూడముచ్చటగా ఉంటాయి. మదురై, తంజావూరు వంటి పట్టణాలు సంప్రదాయ వేడుకలకు నిలయాలు.
4. అసోం (మాఘ్ బిహు – జనవరి 15, 2026): అసోంలో పంట కోతల పండుగను ‘మాఘ్ బిహు’గా జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వెదురుతో తాత్కాలిక గుడిసెలు (Meji) నిర్మించి, సాముహిక విందులు ఆరగిస్తారు. అస్సామీ పిఠాలు, లారూ వంటి తీపి పదార్థాలు ఇక్కడ ప్రత్యేకం.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ‘పెద్ద పండుగ’గా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ వేడుకలు మూడు నుండి నాలుగు రోజుల పాటు (భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ) అంబరాన్ని అంటుతాయి. తెల్లవారుజామునే భోగి మంటలతో పాత వస్తువులను తగులబెట్టి కొత్త ప్రారంభానికి నాంది పలుకుతారు. ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పండుగ శోభను పెంచుతాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోనసీమ లాంటి ప్రాంతాల్లో జరిగే ప్రభల తీర్థం మరియు కోడి పందేలు ఆంధ్ర సంక్రాంతికి ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయి.
తెలంగాణలో కూడా ఈ పండుగను పంటల పండుగగా, ఆత్మీయ వేడుకగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో సజ్జ రొట్టెలు, నువ్వులు, బెల్లంతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. ఇక్కడ గాలిపటాలు ఎగురవేయడం (Kite Flying) ఒక పెద్ద వేడుకగా సాగుతుంది; ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. మూడవ రోజైన కనుమ నాడు పశువులను (గోవులను) లక్ష్మీదేవి స్వరూపంగా భావించి అలంకరించి పూజిస్తారు. పల్లెల్లో కొత్త బట్టలు ధరించి, బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయడం, గ్రామీణ క్రీడల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుంది.
