Viral: తవ్వకాలలో బయటపడిన భారీ లోహపు గంగాళం.. లోపల.. !
Treasure in Tonk : మీరు గుప్త నిధుల అన్వేషణ గురించి విని ఉంటారు. ట్రెజర్ హంట్ గురించి చదివి ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఎక్స్‌క్లూజివ్‌గా ఓ నిధి అన్వేషణ చూపించబోతున్నాను. భూమిలోనుంచి బయటపడిన ఆ వస్తువు ఏంటి? దానిలో ఉన్న అమూల్యమైన వస్తువులేంటో తెలుసుకుందాం..

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా నుండి ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్కడ నివాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిద్రా గ్రామంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో భూమిని తవ్వుతున్నప్పుడు ఒక మర్మమైన కుండ బయటపడంతో కలకలం చెలరేగింది. ఈ కుండ బంగారం లాంటి మెరిసే లోహపు ముక్కలతో నిండి ఉందని పుకారు వ్యాపించిన వెంటనే, సమీపంలోని అనేక గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందంటే అక్కడ ఉన్న ప్రజలలో దోపిడీకి దిగే పరిస్థితి తలెత్తింది. పోలీసులు, రెవిన్యూ అధికారులు చాలా కష్టపడి జనసమూహాన్ని నియంత్రించి కుండను స్వాధీనం చేసుకున్నారు. కుండలో కొన్ని ప్రత్యేక లోహపు ముక్కలు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
శనివారం సాయంత్రం గ్రామంలోని ఒక బంజరు భూమిలో కొన్ని పూజా వస్తువులు పడి ఉండటంతో ఈ హంగామా మొదలైంది. ఈ స్థలం కింద ఏదో పురాతన నిధి పాతిపెట్టబడి ఉండవచ్చని స్థానిక గ్రామస్తులు అనుమానించారు. ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది. వెంటనే ప్రజలు అక్కడ గుమిగూడడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించి తీసుకుని JCB యంత్రంతో తవ్వకం చేపట్టాలని నిర్ణయించారు. తవ్వకం ప్రారంభమైన కొద్దిసేపటికే, భూమి కింద నుండి ఒక పెద్ద లోహపు కుండ కనిపించడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఆ కుండ దాదాపు 10 అడుగుల లోతులో భూగర్భంలో పాతిపెట్టబడి ఉంది. దానిని బయటకు తీసినప్పుడు, అది చాలా పురాతనమైదిగా.. బరువుగా ఉన్నట్లు గుర్తించారు. కుండ సుమారు 2 అడుగుల ఎత్తు.. 1.5 అడుగుల వెడల్పు కలిగి ఉంది. దీని మొత్తం బరువు 100 నుంచి 150 కిలోగ్రాముల మధ్య ఉంటుందని అంచనా. కుండ పై భాగం నుంచి బంగారం లాంటి లోహపు ముక్కలు కనిపించాయి. అటువంటి లోహపు కుండలు ఇప్పుడు ఉపయోగంలో లేవని.. ఇది ఎంతో పురాతనమైదిగా భావిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
జేసీపీ సహాయంతో లోహపు కుండను బయటకు తీయగానే, అక్కడే ఉన్న జన సందోహం ఒక్కసారిగా అదుపుతప్పింది. పదుల సంఖ్యలో ఒకేసారి కుండపైకి దూసుకెళ్లి లోపల ఉన్న దాన్ని దక్కించుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. కొంతమంది లోహపు ముక్కలతో పొలాల వైపు పరిగెత్తారు. తరువాత, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని చాలా మందిని పట్టుకుని ఆ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలంలో అనుమతి లేకుండా తవ్వకం ఎవరు ప్లాన్ చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పంచాయతీ సమితి సభ్యుడు రాంకిషోర్ మీనా తెలిపారు. ఇది నిజంగా పాతిపెట్టిన నిధా లేదా దీని వెనుక మరేదైనా కథ ఉందా అనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది. ముందుజాగ్రత్తగా అధికారులు ఈ కుండను జిల్లా ఖజానా కార్యాలయంలో సురక్షితంగా భద్రపరిచారు. లోహం స్వచ్ఛత.. దాని చారిత్రక ప్రాముఖ్యతను ఖచ్చితంగా నిర్ణయించడానికి పురావస్తు శాఖకు కూడా సమాచారం ఇచ్చారు.
భారతదేశంలో భూగర్భంలో దొరికిన క్లెయిమ్ చేయని నిధికి సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ చట్టం ప్రకారం, 10 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ఏదైనా వస్తువు భూగర్భంలో పాతిపెట్టబడితే దానిని నిధిగా పరిగణిస్తారు. అటువంటి నిధి దొరికినా.. కనిపించినా వెంటనే జిల్లా కలెక్టర్‌కు తెలియజేయడం తప్పనిసరి. కలెక్టర్ ఆ వస్తువును ప్రభుత్వ ఖజానాలో జమ చేసి, దాని నిజమైన యజమాని లేదా హక్కుదారులను కనుగొనడానికి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. చట్టబద్ధమైన హక్కుదారుడు కనుగొనబడకపోతే, ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తారు. నిధిని కనుగొన్న తర్వాత దాచడం లేదా దొంగిలించడం నేరం.
ఈ నిధి గురించి సిద్రా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ వివిధ చర్చలు జరుగుతున్నాయి. తవ్వకం జరిగిన ప్రదేశంలో మరింత అక్రమ తవ్వకాలను నిరోధించడానికి పోలీసులను మోహరించారు. కుండ దొరికిన భూమిని ఇంతకు ముందు ఎప్పుడూ తవ్వలేదని, ఆ ప్రాంతం చాలావరకు నిర్జనమైపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి కుండలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని అధికారులు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామం అంతటా పోలీసు గస్తీని పెంచారు.
