గిరిజన విద్యకు ONGC తోడ్పాటు.. ఎకలవ్య పాఠశాలల అభివృద్ధికి NSTFDCతో ఒప్పందం
గిరిజన విద్యాభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మౌలిక వసతులు, డిజిటల్ విద్య, కెరీర్ మార్గదర్శకత అందించేందుకు ONGC–NSTFDC మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ CSR ప్రాజెక్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 144 ఎకలవ్య పాఠశాలల్లో సుమారు 35 వేల మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

గిరిజన విద్యను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గిరిజన యువతకు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)– నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSTFDC) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో మౌలిక వసతులు, డిజిటల్ విద్య, కెరీర్ మార్గదర్శకత అందించనున్నారు. న్యూఢిల్లీ లోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి రంజనా చోప్రా సమక్షంలో ఈ ఒప్పందం మార్పిడి జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “విద్యను బలోపేతం చేస్తేనే స్థిరమైన అభివృద్ధికి బీజం పడుతుంది. అదే సాధికార సమాజానికి పునాది” అని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 499 ఎకలవ్య పాఠశాలలు పనిచేస్తుండగా, గిరిజన విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు సాంకేతికత, సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని అందించడమే ఈ పాఠశాలల లక్ష్యమని అధికారులు తెలిపారు.
ONGC ఈ ఒప్పందం కింద రూ.28 కోట్ల CSR నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 144 ఎకలవ్య పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ మౌలిక వసతులు, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతకు చర్యలు (సానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు, ఇన్సినిరేటర్లు), ఉపాధ్యాయుల సామర్థ్యాలు పెంచడం, విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, వ్యాపార శిక్షణ వంటివి అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 35 వేల మంది గిరిజన విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ–డమన్ & డయ్యూ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. గిరిజన సంక్షేమానికి కార్పొరేట్ రంగాన్ని భాగస్వామిగా మార్చే దిశగా ఇది కీలక ముందడుగు అని, వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ పేర్కొంది.

