Medical Colleges: బోధన సిబ్బంది లేక వైద్య కళాశాలలు విలవిల.. సంచలన విషయాలు బయటపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్

దేశంలోని వైద్య కళాశాలల్లోని నాణ్యత ప్రమాణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 2 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కావడం, మరో 150 కాలేజీల గుర్తింపు ప్రమాదంలో పడడమే ఇందుకు నిదర్శనం.

Medical Colleges: బోధన సిబ్బంది లేక వైద్య కళాశాలలు విలవిల.. సంచలన విషయాలు బయటపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్
Medical Students
Follow us

| Edited By: Aravind B

Updated on: Jun 02, 2023 | 3:00 PM

దేశంలోని వైద్య కళాశాలల్లోని నాణ్యత ప్రమాణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 2 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కావడం, మరో 150 కాలేజీల గుర్తింపు ప్రమాదంలో పడడమే ఇందుకు నిదర్శనం. జనాభాలో చైనాను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఆ జనాభా అవసరాలను తీర్చగలిగే వైద్యులను తయారు చేయడంలో ఇంకా వెనుకంజలోనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రతి 1,000 మంది ప్రజలకు ఒక వైద్యుడు, ప్రతి 300 మందికి ఒక నర్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రతి 1,511 మందికి ఒక వైద్యుడు ఉండగా.. ప్రతి 670 మందికి ఒక నర్సు ఉన్నారు.

ఈ లెక్కలు వైద్యులు, వైద్య సిబ్బంది కొరతను విస్పష్టంగా వెల్లడిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు వైద్యులు, వైద్య సిబ్బందిని తయారు చేసే కళాశాలల సంఖ్య పెరగలేదని దీన్నిబట్టి అర్థమవుతోంది. అయితే 2014 వరకు దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 654కు చేరుకుంది. అంటే గత తొమ్మిదేళ్లలో ఈ సంఖ్య దాదాపు రెట్టింపయింది. అయినప్పటికీ ఈ సంఖ్య వైద్యుల లోటును తీర్చడానికి సరిపోదని నిపుణులు చెబుతున్నారు. వైద్య కళాశాలల సంఖ్య పెరిగినప్పటికీ అందుకు తగిన నిష్పత్తిలో వైద్య విద్యను అందించే అధ్యాపకులు లేకపోవడం వైద్య విద్య నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన లోపాలేంటి?

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో తనిఖీలు జరిపిన నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వివిధ రకాల లోపాలను గుర్తించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రమాణాలను ఆయా వైద్య కళాశాలలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని తేలింది. అలాంటి కళాశాలలు ఎక్కువగా పుదుచ్చేరి, గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని శతాబ్దాల నాటి కళాశాల, తమిళనాడులోని ప్రసిద్ధ స్టాన్లీ మెడికల్ కాలేజీ కూడా ఈ జాబితాలో ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన లోపాల్లో సరైన భద్రతా వ్యవస్థ లేకపోవడం, నిర్దేశించిన మేరకు సీసీటీవీ కెమెరాలు లేకపోవడం, వైద్య విద్యార్థులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోవడంతో పాటు చాలా కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు ప్రధానంగా కనిపించాయి. ఇందులో బోధనా సిబ్బంది కొరత అన్నది అత్యంత కీలకమైనది. ఇది మినహా మిగతావి అమలు చేయకపోవడం ఆయా కళశాలల నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఇవి కూడా చదవండి

బోధన సిబ్బంది కొరత మొత్తం వైద్య విద్య నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దేశంలో మెడికల్ కాలేజీలు పెరిగినంత నిష్పత్తిలో బోధన సిబ్బంది లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజల ప్రాణాలతో ముడిపడ్డ వైద్యం వంటి రంగాల్లో వైద్యులకు సరైన నాణ్యతతో కూడిన విద్యను అందించకపోతే ఆ ప్రభావం యావత్ సమాజంపై పడుతుంది. యావత్ ప్రజారోగ్య వ్యవస్థను ప్రమాదంలో పడేస్తుంది. మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించడం కేవలం ఆ కాలేజీకి మాత్రమే పరిమితం చేస్తే ఫలితం ఉండదు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, వైద్య సమాజం, ప్రైవేట్ వైద్య రంగం సంయుక్తంగా పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఉండాలి. తద్వారా తరగతి గదుల్లో నేర్చుకునే అంశాలకు తగినంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడమే ఈ నిబంధన ముఖ్యోద్దేశం.

గతంలో చాలా ప్రైవేట్ కాలేజీలు ఈ నిబంధనను సరిగా అమలు చేసేవి కావు. నాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీకి వచ్చే సమయంలో ఆదరాబాదరాగా రోగులను తీసుకొచ్చి ఆస్పత్రులను నింపేవి. ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికీ ఈ పరిస్థితి కొన్ని చోట్ల కొనసాగుతుందని వైద్య విద్యార్థులే చెబుతుంటారు. అందుకే వైద్య విద్యను అభ్యసించాలనుకునేవారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం కఠోరంగా శ్రమిస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు సాధించలేకపోయినవారు తమ తమ స్తోమతను బట్టి ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నప్పటికీ.. డిమాండ్‌కు సరిపడా కాలేజీలు, సీట్లు లేకపోవడంతో చాలా మంది చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, జార్జియా, ఉజ్బెకిస్తాన్ సహా పలు ఇతర దేశాల్లో వైద్య విద్యను అభ్యసించడం కోసం వెళ్తున్నారు.

మేల్కొలుపు

నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీలు, పలు మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు వంటి చర్యలు దేశంలోని వైద్య విద్యావ్యవస్థకు ఒక మేల్కొలుపు అని చెప్పాలి. గుర్తింపు రద్దు చేసినంత మాత్రానా కళాశాల మూతపడనప్పటికీ, ఈ విద్యా సంవత్సరం కొత్త అడ్మిషన్లు చేపట్టడానికి వీలుండదు. ఫలితంగా ఆ మేరకు మెడికల్ సీట్ ఆశిస్తున్న విద్యార్థులకు కూడా నష్టం జరిగినట్టే. గుర్తింపు రద్దు కళాశాలల్లో మౌలిక వసతుల సమస్యలను అధిగమించడం కష్టతరమేమీ కానప్పటికీ బోధన సిబ్బంది కొరతను అధిగమించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఒక వైద్య కళాశాల ఉండాలని, వైద్యులతో ఆ రంగంలో కీలకమైన నర్సింగ్ సిబ్బందిని అందజేయడంతో ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం కాలేజీల సంఖ్యను పెంచుకుంటూ పోయినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, వాటిలో నాణ్యమైన విద్యాబోధన జరగాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే కొత్తగా నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తనిఖీలు చోటుచేసుకున్నాయి. 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దవగా.. అందులో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి వైఎస్ చౌదరి (సుజనా చౌదరి)కి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ కూడా అనుమతులు రద్దయిన మెడికల్ కాలేజీల జాబితాలో ఉండడం విస్మయం కల్గిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్-19 మహమ్మారితో సతమతమైన వేళ మిగతా దేశాల కంటే మెరుగ్గా ఆ మహమ్మారిపై పోరు సాగించి, స్వశక్తితో రూపొందించిన కోవిడ్-19 టీకాను మిగతా ప్రపంచానికి కూడా అందజేసిన ఘనత సాధించిన భారతదేశం, భవిష్యత్తు వైద్యావసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ చర్యలు విజయవంతం కావాలంటే బోధన సిబ్బంది కొరత వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి