Inspiration story: దృష్టిలోపమున్నా.. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం.. లక్షల్లో ప్యాకేజీ
శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నా మనం రోజూ చేసే పనిలో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగం అయితే.. ఆ లాంగ్వేజ్ లు, కోడ్ లు మాములుగా ఉండదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..

Inspiration story: శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నా మనం రోజూ చేసే పనిలో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగం అయితే.. ఆ లాంగ్వేజ్ లు, కోడ్ లు మాములుగా ఉండదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. మరి అదే దృష్టిలోపం ఉన్న వారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావడమంటే కొద్దిగా కష్టమైన పనే.. అయినా పట్టుదలతో తమ ఉద్యోగ నిర్వహణకు దృష్టిలోపం అడ్డురాదంటూ కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాంటి వారికి కంపెనీలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. దీంతో లక్షల్లో ప్యాకేజీ పొందుతూ అంధులు సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా ఇండోర్ కు చెందిన దృష్టిలోపం కలిగిన వ్యక్తికి మైక్రోసాఫ్ట్ సంస్థ జాబ్ ఆఫర్ చేసింది. అదికూడా లక్షల్లో జీతం.. అసలు ఆ కుర్రాడెవరు.. జాబ్ ఆఫర్ ఎలా వచ్చిందో ఈస్టోరీలో తెలుసుకుందాం..
దృష్టిలోపం ఉందని ఆ యువకుడు చింతించలేదు. పట్టుదలతో ఏకంగా మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కొట్టేశాడు.. ఇండోర్‌కు చెందిన యష్ సోంకియా అనే విద్యార్థికి మైక్రోసాఫ్ట్ లక్షలాది రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం ఇచ్చింది. ముగ్గురు తోబుట్టువులలో పెద్దవాడైన సోంకియా చిన్నతనం నుండి దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. ఇండోర్‌లోని శ్రీ గోవింద్రం సెక్సరియా ఇంజినీరింగ్ కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్ పట్టాపొందాడు. ఆకుర్రాడికి మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.47 లక్షల రూపాయల ప్యాకేజీని ఆఫర్ చేయడంతో పాటు.. తమ కంపెనీ షేర్లను కేటాయించింది. మైక్రోసాఫ్ట్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం రావడంతో సోంకియా ఎగిరి గంతేశాడు. ఈలక్ష్యాన్ని చేరుకోవడానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని.. ఇంజినీరింగ్ విద్య అభ్యసించే సమయంలో ప్రారంభంలో ఇబ్బంది అయిందని.. అయినా నెమ్మదిగా అన్ని ఇబ్బందులను అధిగమించి చదవడం అలవాటు చేసుకున్నట్లు సోంకియా తెలిపాడు. కళాశాల అధ్యాపకులతో పాటు స్నేహితులు తనకు చాలా సహాయం చేశారని అందుకే తాను ఈస్థాయికి చేరుకోగలిగానని చెప్పాడు. తన చదువులో ఇంటర్నెట్ ఎంతో సహాయపడిందని.. అయితే తాను చాలా సవాళ్లను ఎదుర్కొన్నానని.. తోటి వ్యక్తుల నుండి లభించిన అండతో ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసినట్లు తెలిపాడు. దృష్టిలోపం ఉన్నవారు సాఫ్ట్ వేర్ రంగంలో రాణించడం కత్తిమీద సాములాందిదేనని.. అయినా ఏరంగంలోనైనా రాణించేందుకు 100% కృషి చేస్తే ఏలోపం అడ్డురాదని చెప్పాడు సోంకియా.
యశ్ సోంకియా తండ్రి యశ్పాల్ ఇండోర్‌లో సాధారణ క్యాంటీన్ యజమాని. తన కుమారుడిని పాఠశాలకు, కళాశాలకు పంపడం చాలా కష్టమైందని.. అయినా ఉపాధ్యాయులు, స్నేహితుల మద్దతుతో చదివించగలిగామని యశ్పాల్ తెలిపారు. తన కొడుకు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం సాధించడం అనేది తన ఊహకు అందని విషయమని.. అయితే తనను తాను నిరూపించుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినందుకు గర్వంగా ఉందన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..